అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టు
ABN, Publish Date - May 06 , 2025 | 01:40 AM
ఎర్రచందనం స్మగ్లింగ్‌తోపాటు ఇళ్లలో దొంగతనాలు చేయడంలో అందేవేసిన ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద రూ.85లక్షల విలువైన బంగారు అభరణాలు, వెండి వస్తువులతోపాటు ఆరు కిలోల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు అరెస్టు
రూ.85 లక్షల విలువైన బంగారు
ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం
వివరాలను వెల్లడించిన ఎస్పీ దామోదర్
ముఠా నాయకుడిపై 111 కేసులు
ఒంగోలు క్రైం, మే 5 (ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం స్మగ్లింగ్‌తోపాటు ఇళ్లలో దొంగతనాలు చేయడంలో అందేవేసిన ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద రూ.85లక్షల విలువైన బంగారు అభరణాలు, వెండి వస్తువులతోపాటు ఆరు కిలోల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో తిరుగుతూ పట్టపగలు ఇంటి తాళాలను కట్ చేసి లోపలికి వెళ్లి దోచుకోవడంలో ఆ ముఠా ఆరితేరింది. ఇటీవల ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో 16 చోట్ల వారు దొంగతనాలు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడమే వృత్తిగా ఎంచుకున్న కడప జిల్లాకు చెందిన ఈ ముఠా పనిలో పనిగా చోరీలు చేయడం కూడా అలవాటు చేసుకుంది. దొంగతనం చేసి తిరిగి వెళుతుండగా వారి కారును ఆపే ప్రయత్నం చేసిన ఎస్‌ఐ జీపునే ఢీకొట్టి తప్పించుకున్న నేరచరిత్ర వారిది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ వివరాలను వెల్లడించారు.
పట్టుబడింది ఇలా..
ఎస్పీ కథనం మేరకు.. కడప జిల్లా చాపాడు మండలం ఖాదర్‌పల్లికి చెందిన చీమపర్తి ఫక్రుద్దీన్ అలియాస్ పోగోడు అలియాస్ బొండోడు, అదేగ్రామానికి చెందిన చింపర్తి అలియాస్ సింపతి మహబూబ్‌పీరా, ప్రొద్దుటూరుకు చెందిన గాండ్లు లతీఫ్ బాషాలు ఆదివారం మధ్యాహ్నం పొదిలిలోని ఎస్‌వీకేపీ కాలేజీ బస్‌షెల్టర్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో పొదిలి పోలీసులు పట్టుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాకు ఫక్రుద్దీన్ నాయకత్వం వహిస్తాడు. వారి వద్ద రూ.81లక్షల విలువైన 924.33 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4.2లక్షల విలువైన 3.800 కిలోల వెండి వస్తువులు కలిపి మొత్తం రూ.85.20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అదేసమయంలో కారు, అందులో 6.190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపైన ఐదు జిల్లాల్లో 16 కేసులు ఉన్నాయి. ఈ ముఠాకు నాయకుడైన ఫక్రుద్దీన్‌పై 111 ఉన్నాయని, వీటిలో 74 ఎర్రచందనం కేసులని ఎస్పీ దామోదర్ వెల్లడించారు.
గత నెలలో ఎస్‌ఐ కారును ఢీకొట్టి పరారైన ముఠా
పొదిలిలో గతనెల 14న బీరం నాసరరెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. 27 సవర్ల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి అపహరణకు గురయ్యాయి. దీంతో సీసీ ఫుటేజీ సేకరించిన పోలీసులు దొంగల ముఠా కడప జిల్లాకు చెందినదని గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచారు. ఆతర్వాత గతనెల 17న కావలిలో దొంగతనం చేసిన ముఠా కారులో ప్రొద్దుటూరు వైపు వెళుతున్నట్లు మన జిల్లా పోలీసులు గుర్తించారు. కడప జిల్లా ఎస్పీ ద్వారా ప్రొద్దుటూరు ఎస్‌ఐని అప్రమత్తం చేశారు. అయితే దొంగల ముఠా ప్రొద్దుటూరు ఎస్‌ఐ జీపును ఢీకొట్టి పారైంది. దీంతో అప్పటి నుంచి వారిపై నిఘా ఉంచిన పొదిలి సీఐ వెంకటేశ్వరరావు ఆదివారం పొదిలిలో అనుమానాస్పదంగా బస్‌షెల్టర్‌లో ఉన్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగల ముఠాగా గుర్తించి అరెస్టు చేశారు.
పోలీసులకు రివార్డులు అందజేసిన ఎస్పీ
దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన దర్శి డీఎస్పీ బి.లక్ష్మీ నారాయణ, పొదిలి సీఐ టి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు వేమన, టి.రాజ్‌కుమార్, బ్రహ్మనాయుడుతోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలతోపాటు రివార్డులను అందజేశారు. సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
Updated Date - May 06 , 2025 | 01:40 AM