అంగరంగ వైభవంగా..
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:37 PM
దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
సింగరాయకొండలో లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు
సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం
హంసవాహనంపై భక్తులకు దర్శనం
సింగరాయకొండ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత వరాహ లక్ష్మీనరసింహస్వామి, యోగానంద లక్ష్మీనరసింహస్వామి, స్వయంభు ఆంజనేయుడిని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం పూజల అనంతరం లక్ష్మీనరసింహుడు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరారు. అనంతరం మోతకాపులు స్వామివారిని గ్రామోత్సవానికి తీసుకెళ్లారు. భక్తులు అధికసంఖ్యలో సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి చదువుల తల్లి సరస్వతి అవతారంలో హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు ఊరేగే దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పి. కృష్ణవేణి, ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకటశేషా లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకుడు నరసింహాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చప్పరసేవ ఉంటుంది. రాత్రికి శేషవాహనంపై విహరించనున్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:37 PM