అక్కడ విధులంటే.. వివాదాలు, కొర్రీలే!
ABN, Publish Date - May 21 , 2025 | 11:08 PM
తాళ్లూరు మండల రెవెన్యూ కార్యాలయం వివాదాలకేగాక, ప్రజా సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణికీ కేరాఫ్ అడ్ర్‌సగా మారింది. ఏ సమస్య వచ్చినా నెలల తరబడి తిప్పుకోవడం రెవెన్యూ అధికారులకు పరిపాటి అయ్యింది.
తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయం పనితీరుపై సర్వత్రా విమర్శలు
సమస్యలు పరిష్కారం కాక ప్రజలకు ఇబ్బందులు
గత వైసీపీ ప్రభుత్వహయాంలో భూరీసర్వే తప్పులు ఒక్కటీ పరిష్కారం కాలేదు
తాళ్లూరు, మే 21 (ఆంధ్రజ్యోతి) : తాళ్లూరు మండల రెవెన్యూ కార్యాలయం వివాదాలకేగాక, ప్రజా సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణికీ కేరాఫ్ అడ్ర్‌సగా మారింది. ఏ సమస్య వచ్చినా నెలల తరబడి తిప్పుకోవడం రెవెన్యూ అధికారులకు పరిపాటి అయ్యింది. ప్రతి సమస్యలకు ఏదో ఒక కొర్రీ వేస్తూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుండడం సర్వసాధారణమైంది. కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయంలో కీలకస్థాయి అధికారి నుంచి గ్రామస్థాయి అధికారి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది సమయంలో ముగ్గురు తహసీల్దార్లు మారటం, ప్రస్తుతం ఉన్న అధికారులు రెవెన్యూ సమస్యలను పరిష్కరించకపోవటంతో ప్రజలకు రెవెన్యూ కష్టాలు తప్పట్లేదు. అధికారుల మధ్య సఖ్యత లేక అవసరార్థులు నలిగిపోతున్నారు.
కొర్రీలే అధికం...
తహసీల్దార్ కార్యాలయంలో కీలక అధికారి పనిగట్టుకుని ఏదో ఒకసాకు చూపుతూ పనులు చేయకుండా వాయిదాలు వేస్తున్నారు. సిబ్బంది తప్పుడు రికార్డులు సృష్టించారని, కార్యాలయ రికార్డును, సిబ్బందిని నమ్మటానికి వీల్లేదన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న ప్రజల సమస్యలు పరిష్కారం కాక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సిబ్బంది పెండింగ్ ఫైళ్లను తీసుకెళ్లినా ఏదో ఒక సాకు చూపుతూ వాటిని వెనక్కి పంపుతుండడంతో పనులు ముందుకు సాగటం లేదు. ప్రజలు అధికారులను కలవాలన్నా అనుమతి లేకపోవటంతో కార్యాలయ ఆవరణలో పడిగాపులు కాస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
గత ఐదేళ్లు ఇబ్బంది పడ్డాం.. మళ్లీ ఇప్పుడు కూడా...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూసర్వే వల్ల పలుగ్రామాల్లో తప్పులు దొర్లాయి. ఆ తప్పులను సరిద్దలేదని, దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్లు, బ్యాంక్‌లో రుణాలు నిలిచాయని పలుగ్రామాల రైతులు వాపోతున్నారు. గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉండి రెవెన్యూ అధికారులు సహకరించక ఇబ్బందులు పడగా, ప్రస్తుతం కూడా తమ పనులు కావటంలేదని అధికార పక్ష నాయకులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అధికారులు, సిబ్బంది సమక్షంలోనే తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ పరస్పర దూషణలతో వాదులాడుకోవటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రీసర్వే తప్పులు సరిదిద్దలేదు
వద్దినేని శ్రీనివాసరావు, శివరాంపురం
నా భూమి గత ప్రభుత్వం జరిపిన రీసర్వేలో తప్పుగా నమోదు చేశారు. ఇటీవల గ్రామసభలో దరఖాస్తు ఇచ్చి మూడు నెలలు దాటినా తప్పు సరిదిద్ద లేదు. వారసత్వంగా సంక్రమించిన భూముల సర్వేనంబర్ 172లో 90 సెంట్ల భూమిలో 0.056 సెంట్ల భూమి మాత్రమే రికార్డుల్లో ఉంది. 171/1లో 1.70సెంట్లు, 164/12లో 54 సెంట్లు, 141/3లో 1.18 సెంట్లు కలిసి 3ఎకరాల 42 సెంట్లు భూమిరికార్డుల్లో కన్పించడం లేదు. బ్యాంక్‌లో రుణాలు రీషెడ్యూలు జరగక ఇబ్బందిగా ఉంది. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పరిష్కరించటం లేదు.
పూర్తి సమాచారంతో ఫైళ్లు పంపడం లేదు
కే సంజీవరావు, తహసీల్దార్
కింది స్థాయి నుంచి పూర్తి సమాచారంతో ఫైళ్లు పంపటం లేదు. కార్యాలయంలో ఉన్న రికార్డులు కొన్ని టాంపరింగ్ జరిగాయి. సమస్యలపై వచ్చిన దరఖాస్తులను కార్యాలయ రికార్డులను పరిశీలించి సరిగా ఉన్న వాటిని పరిష్కరిస్తున్నాం. ఇటీవల కార్యాలయంలో జరిగిన వాగ్యుద్ధం విషయమై మాట్లాడుతూ సిబ్బందిని విధులు సక్రమంగా నిర్వహించమని చెబితే ఆవేశంగా మాట్లాడమే తప్ప మరేమి లేదు.
Updated Date - May 21 , 2025 | 11:08 PM