భవిష్యత్ కోసం బాగు
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:15 AM
మార్కాపురం డివిజన్ లోని చెరువుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ విధ్వంస పాలనకు డివిజన్‌లోని చెరువులు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో ఒక్క చెరువు నిర్వహణకు కూడా నిధులు కేటాయించిన పాపాన పోలేదు. మార్కాపురం డివిజన్ పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడిన ప్రాంతం.
చెరువుల మరమ్మతుపై ప్రభుత్వం దృష్టి
వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన వైనం
నిధులు కేటాయిస్తున్న ప్రస్తుత సర్కారు
వేగంగా పూర్తిచేయాలని కోరుతున్న రైతులు
మార్కాపురం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం డివిజన్ లోని చెరువుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ విధ్వంస పాలనకు డివిజన్‌లోని చెరువులు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో ఒక్క చెరువు నిర్వహణకు కూడా నిధులు కేటాయించిన పాపాన పోలేదు. మార్కాపురం డివిజన్ పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడిన ప్రాంతం. ఎలాంటి పక్కా నీటి పారుదల వ్యవస్థలు లేవు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఇలాంటి డివిజన్‌పై కనికరం కూడా చూపలేదు వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కీలకమైన కొన్ని చెరువులకు ఎస్‌డీఎంఎఫ్ పథకం ద్వారా రూ.1.52 కోట్ల నిధులు విడుదల చేసింది. అంతేకాక ఓఅండ్‌ఎం ద్వారా డివిజన్‌లోని అన్ని చెరువులకు మరమ్మతులు, కాలువల ఆధునికీకరణ తదితర పనులకు రూ.5.15 కోట్లు కేటాయించింది. ఆయా పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.
పనులు త్వరగా పూర్తిచేస్తేనే భద్రత
మార్కాపురం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో మొత్తం 411 చెరువులు ఉన్నాయి. మొత్తం ఆయకట్టు 60,951 ఎకరాలు ఉంది. ఎంఐ (మైనర్ ఇరిగేషన్) కింద 119, పీఆర్ చెరువులు 292 ఉన్నాయి. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కంభం ఇరిగేషన్ సబ్ డివిజన్‌లు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన 31 చెరువులకు సంబంధించి గత సంవత్సరం అక్టోబరులోనే ఎస్‌డీఎంఎఫ్ స్కీం కింద రూ.1.52 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లో ఇప్పటి వరకూ రూ.కోటి మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.52 లక్షల మేర జరుగుతున్నాయి. ఓఅండ్‌ఎం కింద దాదాపు ప్రతి చెరువుకూ నిర్వహణ పనుల కోసం రూ.5.15 కోట్లు మంజూరయ్యాయి. వాటి ద్వారా చెరువు కట్టల సామర్థ్యాన్ని పెంపొందించడం, అలుగులు, తూములు, కాలువలకు మరమ్మతుల పనులు చేయడం ప్రధానమైనవి. ఇవి త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. మే, జూన్‌లలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ఈ లోపుగా పనులు పూర్తి చేస్తే చెరువుల్లో నీరు చేరేందుకు అవకాశం ఏర్పడుతుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తయితేనే నిధుల విడుదల చేసినందుకు సార్థకత ఉంటుంది. ప్రస్తుతం కేటాయించిన నిధులేకాక త్వరలోనే ఓఅండ్‌ఎం కింద రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రధానమైన చెరువులకు సంబంధించి పెద్దపాటి పనులకు ప్రతిపాదనలు కూడా ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులకు పంపారు. గతంతో పోలిస్తే ఇరిగేషన్‌శాఖకు తగినన్ని నిధులు ప్రభుత్వం కేటాయిస్తున్నందున చెరువుల అభివృద్ధి పనులు యంత్రాంగం త్వరగా పూర్తి చేయాల్సి ఉంది.
Updated Date - Apr 26 , 2025 | 01:15 AM