రైతుల భూములు అక్రమంగా ఆన్‌లైన్
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:28 PM
ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములు రీసర్వే చేశారు. రీసర్వే సమయంలో ఆన్‌లైన్ కాని రైతుల భూములను గుర్తించిన గ్రామసర్వేయర్ వాటిని తన బంధువుల పేర్లమీదకు మార్చుకున్నారు. ఆ వెంటనే వాటిని అధికారులతో కుమ్మక్కు అయి ఆన్‌లైన్ చేయించారు.
రీసర్వే పేరుతో ఉలిచి సర్వేయర్ మోసం
బంధువుల పేరుతో పలువురి భూముల మార్పు
మరికొన్ని భూముల విక్రయం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీఆర్వోతో కుమ్మక్కు
నేడు బయటపడటంతో రైతుల లబోదిబో
ఒంగోలు(రూరల్), జూన్22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములు రీసర్వే చేశారు. రీసర్వే సమయంలో ఆన్‌లైన్ కాని రైతుల భూములను గుర్తించిన గ్రామసర్వేయర్ వాటిని తన బంధువుల పేర్లమీదకు మార్చుకున్నారు. ఆ వెంటనే వాటిని అధికారులతో కుమ్మక్కు అయి ఆన్‌లైన్ చేయించారు. ఇలా సర్వేనంబరు 153-9లో 4.55 ఎకరాలు, సర్వేనంబరు 372లో 23సెంట్లు, సర్వేనంబరు 373లో 1.5 ఎకరాల భూములను సర్వేయర్ అన్‌లైన్ చేయించారు. అలాగే సర్వేనంబరు 153-9లో 4.55 ఎకరాల భూమిని రొయ్యల చెరువులు సాగు చేసే వ్యాపారికి విక్రయించాడు. ఇటీవల రైతులు ఆన్‌లైన్ కాని తమ భూములను ఆన్‌లైన్ చేయమని గ్రామ సచివాలయానికి వెళ్లి అర్జీలు సమర్పించారు. వాటిని పరిశీలించిన సమయంలో గ్రామ సర్వేయర్ అక్రమాలు వెలుగు చూశాయి. సొంత భూములు గల రైతులు డిజిటల్ అసిస్టెంట్‌తో కంప్యూటర్‌లో పరిశీలించగా ఆ భూములు మరొకరి పేరుతో ఆన్‌లైన్‌కావడం, ఆ వెంటనే అమ్మేయడం గుర్తించారు. ఈ భూముల అమ్మకాలలో మొత్తంగా రూ.30 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆన్‌లైన్‌కు నాటి గ్రామ వీఆర్వోగా పనిచేసిన వ్యక్తి పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోని భూముల ఆన్‌లైన్‌లో అక్రమాలకు పాల్పడిన గ్రామ సర్వేయర్, వీఆర్వోపై తగని చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయరాలని ఉలిచి గ్రామ రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ భూమి అని డీకేటీ రిజిస్టర్
వైసీపీ నేత మోసగించాడు
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన గిద్దలూరుకు చెందిన గీతాభవాని
ఒంగోలు క్రైం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ భూమి పేరుతో డీకేటీ భూమిని రిజిస్టర్ చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గిద్దలూరులోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన కామూరి గీతాభవాని ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కలిసి ఈమేరకు ఫిర్యాదు అందించారు. ఈదుల జయరామిరెడ్డి అనే వ్యక్తి వద్ద తాను రూ.22లక్షలకు వ్యవసాయ భూమి కొనుగోలు చేశానని తెలిపారు. అయితే తాము డబ్బులు చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఆ భూమిని పట్టాదారుపాసు పుస్తకం చేయించుకొనేందుకు వెళితే డీకేటీ భూమి అని చెప్పారన్నారు. జయరామిరెడ్డి అనే వ్యక్తి అప్పటి వైసీపీ నాయకుడు కావడంతో తాము ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకోలేదన్నారు. ఈవిషయాన్ని తమకు పొలం విక్రయించిన వ్యక్తి వద్దకు పోతే అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నాడని తమపై అక్రమ కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. తాము రిజిస్టర్ ఆఫీసు వద్దకు వెళ్లి డీకేటీ భూమిని ఏ విధంగా రిజిస్టర్ చేశారని ప్రశ్నిస్తే మాకు ఎటువంటి సంబంధం లేదని, భూమి అమ్మిని వ్యక్తిని అడగాలని చెప్పారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అప్పటి తహసీల్దార్ కూడా ఇందులో పాత్రధారులుగా ఉన్నారని, దీనిపై సమగ్ర విచారణ చేసి తనకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆమె జిల్లా ఏఎస్పీని వేడుకున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని, తమకు న్యాయంచేసి అదుకోవాలని ఎస్పీని విన్నవించారు.
Updated Date - Jun 23 , 2025 | 11:28 PM