కనిగిరి డెయిరీపై కన్ను
ABN, Publish Date - Jul 19 , 2025 | 01:54 AM
ఒకప్పుడు కళకళలాడిన కనిగిరి డెయిరీ నేడు ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరుకొంది. ప్రాంగణ మంతా దట్టంగా చిల్లచెట్లు కమ్ముకున్నాయి. భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇదే అదునుగా కొందరు రూ.50కోట్ల విలువచేసే ఐదు ఎకరాల డెయిరీ స్థలంపై కన్నేశారు.
ఐదు ఎకరాల భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రయత్నం
శిథిలావస్థలో భవనాలు
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రాంగణం
కనిగిరి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు కళకళలాడిన కనిగిరి డెయిరీ నేడు ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరుకొంది. ప్రాంగణ మంతా దట్టంగా చిల్లచెట్లు కమ్ముకున్నాయి. భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇదే అదునుగా కొందరు రూ.50కోట్ల విలువచేసే ఐదు ఎకరాల డెయిరీ స్థలంపై కన్నేశారు. దాన్ని కొట్టేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దశాబ్దాల క్రితం కనిగిరి పాలశీతల కేంద్రం పరిధిలోని ఆరు మండలాల్లో 140 వరకు పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. రెండు లక్షల మంది పాడి రైతులు పాలను డెయిరీకి సరఫరాచేసి ఆర్థికంగా ఎదిగారు. తర్వాత ప్రభుత్వాల విధానాల కారణంగా పాల ఉత్పత్తిదారులకు చెల్లింపుల్లో జాప్యం జరిగి బకాయి లు పెరిగిపోయాయి. ఈ కారణంతో రైతులు ప్రైవేటు డెయిరీలను ఆశ్రయించడం ప్రారంభించారు. దీంతో పాలసేకరణ గణనీయంగా పడిపోయి డెయిరీ పరిస్థితి దిగజారిపోయింది. డెయిరీ పూర్తిగా ఆగిపోవడంతో పాల ఉత్పతిదారులను ప్రైవేటు డెయిరీలు దోచుకోవడం ప్రారంభించాయి. పదేళ్లకు పైగా పాలకేంద్రం నిర్వహణలేక లోపల ఉన్న మిషనరీ అంతా తుప్పుపట్టి పోయింది. కేంద్రంలో శీతల ఉత్పన్నం (కూలింగ్) చేసే మిషనరీ పనికి రాకుండాపోయింది. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదంగా ఉన్న డెయిరీలో నేడు పిచ్చిచెట్లు ఏపుగా పెరిగి భయానకప్రాంతంగా మారింది. రైతులు సేద తీరేందుకు ఏర్పాటుచేసిన షెడ్డు మందుబాబులకు, రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
రూ.50కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కొట్టేసే ప్రయత్నం
దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డెయిరీ స్థలం విలువ నేడు రూ.50 కోట్లకు పైమాటే. దీంతో ఆ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. ఇప్పటికే డెయిరీలో ఉన్న రూ.20 లక్షలకు పైగా విలువైన యంత్ర సామగ్రి దొంగల పాలైంది. ఎలాంటి ఆదరణ లేకపోవడంతో కొంతమంది బడాబాబుల అండతో అక్రమార్కులు డెయిరీ స్థలం కొట్టేసేందుకు పథక రచన చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ రేటును నిర్ణయించి అతి చౌకగా 5ఎకరాల స్థలం కొట్టేసేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. డెయిరీ వెనుక వైపు నుంచి ఆక్రమించేందుకు పన్నాగం పన్నుతున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డెయిరీ స్థలాన్ని అక్రమార్కుల చెర నుంచి కాపాడి ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jul 19 , 2025 | 01:54 AM