ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:48 AM
మెగా డీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు ఐదు సెంటర్‌లలోనే పరీక్షలు జరిగాయి.
90శాతం మంది హాజరు
ఒంగోలు విద్య, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు ఐదు సెంటర్‌లలోనే పరీక్షలు జరిగాయి. రెండు సెషన్లలో వీటిని నిర్వహించారు. మొత్తం 791 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 710 (90శాతం) మంది హాజరయ్యారు. 81మంది గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్న నిబంధన ఉండటంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ప్రధాన ద్వారాల వద్దే హాల్‌టిక్కెట్లను పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాతే హాలులోకి అధికారులు అనుమతించారు. ఒక్క బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లోనే రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. మిగిలిన నాలుగు కేంద్రాల్లో ఉదయం సెషన్ మాత్రమే జరిగింది. ఒంగోలు క్విస్ పరీక్షా కేంద్రంలో ఉదయం సెషన్‌లో 200 మందికి 179మంది, రైజ్ ప్రకాశంలో 170 మందికి 147 మంది, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో 100 మందికి 96 మంది, శామ్యూల్ జార్జి కళాశాలలో 120 మందికి 106 మంది, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 100 మందికి 89మంది పరీక్ష రాశారు. బ్రిలియంట్‌లో మధ్యాహ్నం సెషన్‌లో 101 మందికి 93 మంది పరీక్షకు హాజరయ్యారు. టీజీటీ గణితం, హిందీ, ఫిజికల్ సైన్స్, తెలుగు పోస్టులకు పరీక్ష నిర్వహించినట్లు డీఈవో కిరణ్‌కుమార్ తెలిపారు.
Updated Date - Jun 07 , 2025 | 12:49 AM