తాగునీటికి అధిక ప్రాధాన్యం
ABN, Publish Date - May 13 , 2025 | 12:06 AM
జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
అవసరమైతే పంచాయతీ నిధులు వినియోగం
అన్నివర్గాలకూ సంక్షేమ ఫలాలు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఒంగోలు కలెక్టరేట్, మే 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. డీఆర్సీ సమావేశం అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరం ఉంటే పంచాయతీల్లో నిధులను ఖర్చు చేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం నుంచి కూడా నిధులు రాబడతామన్నారు. జలజీవన్ మిషన్‌లో గత ప్రభుత్వం రాష్ట్రం వాటా చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రిని కలిసి పథకం అమలు గడువును మరో రెండేళ్లు పొడిగించారన్నారు. తద్వారా ఇంటింటికీ కొళాయి నీరు ఇచ్చి సమస్యను తీరుస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో కరువు నివారణ దిశగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించామన్నారు. నగరాలు, పట్టణాల్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీస్థలాల్లో ఎన్‌బీసీసీతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. అంతకు ముందు డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేలు పలు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు.
అమృత్ పనులను త్వరగా పూర్తిచేయాలి
దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎమ్మెల్యే
ఒంగోలు ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాతోపాటు అమృత్ పథకం కింద చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో 23,636 మందికి నివేశన స్థల పట్టాలు ఇచ్చారు. అందులో 13వేల మంది అనర్హులుగా అధికారులు గుర్తించారు. వారిని తొలగించి అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
అన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలి
ముత్తుముల అశోక్‌రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే
గిద్దలూరు నియోజకవర్గంలో అన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలి. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఆర్ కంటే వెబ్‌ల్యాండ్‌లో తక్కువ భూమి నమోదైంది. దీనిపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలి. కొమరోలు మండలంలో ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద అర్హత లేకుండానే కొంతమంది అక్రమంగా రూ.7 కోట్లు లబ్ధిపొందారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలి.
తాగునీటికి ఇబ్బందులు
కందుల నారాయణరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే
పశ్చిమ ప్రకాశంలోని గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల బోర్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. పైపులైన్లు దెబ్బతిన్నాయి. గతంలో తాగునీటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తర్లుపాడు మండలంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
పది రోజుల నుంచి రక్షిత మంచినీటి పథకం పనిచేయడంలేదు
బీఎన్.విజయకుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే
నాగులుప్పలపాడు రక్షిత మంచినీటి పథకం పది రోజుల నుంచి పనిచేయడం లేదు. సత్వరమే ఆ పథకం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
ఉపాధి పనులను అమలు చేయాలి
డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే
కనిగిరి మునిసిపాలిటీలో మూడు గ్రామాలు విలీనం చేశారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు చేయాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన మోటార్లు తరచూ పాడవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
ప్రజలకు తాగునీటిని అందించాలి
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే
దర్శి నియోజకవర్గ పరిఽధిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. అమృత్ పథకం కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయాలి.
సర్పంచ్‌ల తీర్మానాలు లేకుండా ఉపాధి పనులు
తాటిపర్తి చంద్రశేఖర్, వైపాలెం ఎమ్మెల్యే
సర్పంచ్‌ల తీర్మానం లేకుండానే ఉపాధి పనులు చేస్తున్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వెంటనే పరిష్కరించాలి.
రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేయాలి
దామచర్ల సత్యనారాయణ, మారిటైం బోర్డు చైర్మన్
జిల్లాలో నీటి వనరులు లేని నియోజకవర్గం కొండపి. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పాకల బీచ్‌ను అభివృద్ధి చేయాలి. సింగరాయకొండ, టంగుటూరు, సూరారెడ్డిపాలెం వద్ద ఆర్‌వోబీలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
మంచినీటి వనరులు ఉప్పుగా మారుతున్నాయి
నూకసాని బాలాజీ, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్
బింగినపల్లి చెరువు పరిధిలో ఆక్వా సాగు ఎక్కువగా ఉంది. అందువల్ల మంచినీటి వనరులు ఉప్పుగా మారుతున్నాయి. దానిపై అవసరమైన చర్యలు తీసుకోవాలి.
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ
ఈ ఏడాది అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలి.
Updated Date - May 13 , 2025 | 12:07 AM