ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాఫియాలే మట్టుబెట్టాయి?

ABN, Publish Date - Apr 26 , 2025 | 01:24 AM

ఇసుక, లిక్కర్‌, రేషన్‌ మాఫియాలే టీడీపీ యువ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్యకు కారణమని తెలుస్తోంది. తాజా పోలీసు దర్యాప్తులో ఆ విషయం వెల్లడైనట్లు సమాచారం. హంతకులు ఉపయోగించిన స్కూటీ దొరకడంతో కేసు మిస్టరీ వీడిపోయే దశకు చేరింది. స్కూటీ క్లూతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు శరవేగంగా కదిలారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న రక్తపు మరకలతో ఉన్న స్కూటర్‌

రేషన్‌, లిక్కర్‌, ఇసుక వ్యవహారాల్లో విభేదాలు

వీరయ్య హత్య కేసు దర్యాప్తులో పురోగతి

స్కూటర్‌ క్లూతో ఛేదన దశకు పోలీసులు

ఇది కిరాయి హంతకుల పనేనని నిర్ధారణ

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఇసుక, లిక్కర్‌, రేషన్‌ మాఫియాలే టీడీపీ యువ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్యకు కారణమని తెలుస్తోంది. తాజా పోలీసు దర్యాప్తులో ఆ విషయం వెల్లడైనట్లు సమాచారం. హంతకులు ఉపయోగించిన స్కూటీ దొరకడంతో కేసు మిస్టరీ వీడిపోయే దశకు చేరింది. స్కూటీ క్లూతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు శరవేగంగా కదిలారు. హత్యకు కుట్రదారులను, పాత్రధారులను గుర్తించే విషయంలో ముందడుగు వేశారు. అప్పటికే అదు పులో ఉన్న అనుమానితులతోపాటు మరి కొందరిని శుక్రవారం మధ్యాహ్నం, రాత్రి అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో సైతం ఒకరిద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలిస్తున్నారు. కుట్రదారులు, స్థానిక పాత్రధారులపై ఒక అవగాహనకు వచ్చిన పోలీసులు పరా రీలో ఉన్న కిరాయి హంతకుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. గత మంగళవారం రాత్రి వీరయ్య హత్యకు గురికాగా సరైన క్లూ దొరక్క పోలీసులు సత మతమవుతున్న విషయం విదితమే. దర్యాప్తులో భాగంగా రాజకీయ, వ్యాపార అంశాలపై దృష్టి సారించారు. తాజా సమాచారం మేరకు రేషన్‌, లిక్కర్‌, ఇసుక వ్యవహారాల్లో విభేదాలే వీరయ్య హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరయ్య హత్యకు గురైన వెంటనే ఆయన స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు చెందిన రాజకీయ విరోధితోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటిరోజు అదే మండలానికి చెందిన మరో రౌడీషీటర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో వ్యాపార లావాదేవీలపై కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో శుక్రవారం చీమకుర్తికి సమీపంలోని బైపాస్‌ కూడలి వద్ద రక్తపు మరకలు పడి ఉన్న స్కూటీని స్థానికులు గుర్తించారు. ఒకరు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఇది కీలకంగా మారింది. దాని ఆధారంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గ్రామస్థుల పాత్ర ఉన్నట్లు గుర్తింపు

దర్యాప్తులో భాగంగా అప్పటికే అదుపులో ఉన్న అమ్మనబ్రోలుకు చెందిన యువకుడి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో విచారణ కొనసాగించారు. పోలీసులకు దొరికిన స్కూటీ అతనికి సుపరిచితుడైన ఇసుక వ్యాపారిదిగా వెల్లడైనట్లు తెలిసింది. ఈయన ఒంగోలు అన్నవరప్పాడు ప్రాంతానికి చెందినవ్యక్తి. గతంలో అమ్మనబ్రోలుకు చెందిన యువకుడికి గ్రావెల్‌, ఇసుక రవాణా చేసే లారీలు ఉండేవని అప్పటి నుంచి ఇసుక వ్యాపారితో సత్సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వెంటనే ఇసుక వ్యాపారికోసం పోలీసులు గాలింపు చేపట్టగా అతను అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడైంది. మరోవైపు అమ్మనబ్రోలులో ఆది నుంచి వీరయ్యతో శతృత్వం ఉన్న మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మాఫియా పాత్ర తోడైందా?

నిందితులకు నాగులుప్పలపాడు మండలంలో వీరయ్యకు రాజకీయ విరోధిగా ఉండి రేషన్‌ మాఫియా చేస్తున్న రౌడీషీటర్‌ సహకారం కూడా లభించిందన్న అంశంపై పోలీసులు మరోసారి విచారణ చేపట్టారు. ఇటు గ్రామంలోని విరోధులతోపాటు ఒంగోలులో ఇసుక వ్యాపారి లాంటి వారి సహకారం వెల్లడవడంతో అదే తరహాలో హతుడు వీరయ్యకు రాజకీయ విరోధిగా ఉన్న రేషన్‌ మాఫియా డాన్‌ పాత్రను కూడా పరిగణనలోకి తీసుకుని అనేక అంశాలను రాబడుతున్నట్లు సమాచారం. ఇసుక, రేషన్‌ మాఫియాల మధ్య గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంభాషణలను పసిగట్టేందుకు కాల్‌ డేటాను కూడా పరిశీలించారు. వారందరి మధ్య వందల ఫోన్‌కాల్స్‌ నమోదైనట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

ఆర్థిక సహకారంపై ఆరా

ప్రాథమిక సమాచారం తేటతెల్లమవడంతో ఈ హత్యకు సంబంధించి ఆర్థిక సహకారం ఎవరైనా ఇచ్చారా అన్న అంశంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. నలుగురిలో ఇద్దరు కిరాయి హంతకులైనట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. రాత్రి 7.40 కల్లా హత్య చేసిన వారు 8 గంటలకల్లా స్కూటీపై చీమకుర్తి బైపాస్‌ వద్దకు చేరుకున్నారు. స్కూటీని అక్కడ వదిలి బస్‌లో ఇతర ప్రాంతానికి వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందులో ఇద్దరు విజయవాడ నుంచి వెళ్తున్న కనిగిరి బస్‌ ఎక్కి కనిగిరిలో దిగారని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లారని నిర్ధారించుకున్నారు. ఆ ఇద్దరినీ కిరాయి హంతకులుగా భావించి వారికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇటు కిరాయి హంతకులకు, ఇతర అవసరాలకు పెద్దమొత్తంలో డబ్బు వెచ్చించినట్లు గుర్తించిన పోలీసులు ఆర్థిక సహకారం ఎవరు ఇచ్చి ఉంటారన్న కోణంలో మరో దర్యాప్తు చేపట్టారు. అదే మండలానికి చెంది హైదరాబాద్‌లో ఉంటున్న ఒక సంపన్నుడి సహకారం కూడా ఉండి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు హైదరాబాద్‌లో కూడా దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా వీరయ్యతో ఉన్న వైషమ్యాలను దృష్టిలో ఉంచుకుని ఆ వైపు నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేసమయంలో కొద్దిరోజులుగా అమ్మనబ్రోలు ప్రాంతంలో వీరయ్యకు ప్రమాదం పొంచి ఉందన్న నానుడి కొందరి మధ్య నలిగినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్రామానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఆడియోను పోలీసులు రాబట్టుకున్నట్లు కూడా సమాచారం. ఆ కోణంలో అమ్మనబ్రోలుకు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన రోజు అమ్మనబ్రోలుకు చెందిన యువకుడు, ఇతర అనుమానితులు ఒంగోలులోనే ఉండటం, ఇసుక వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని పోలీసులు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నారు. కిరాయి హంతకులను మాట్లాడటం, ఇతర వ్యవహారాలలో ఇసుక వ్యాపారి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో ఒక పోలీసు బృందం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

దశాబ్దకాలం నుంచి వైషమ్యాలు

అమ్మనబ్రోలులో ప్రస్తుత అనుమానితులు యువకుడి కుటుంబం, హతుడు వీరయ్యల మధ్య ఆది నుంచి రాజకీయ వైరం ఉన్నట్లు తెలిసింది. యువకుడి తండ్రి కూడా ఆరంభంలో మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు వర్గంలోనే ఉండేవారు. పీఏసీఎస్‌, పాలకేంద్రం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో వీరయ్యపాత్ర గణనీయంగా పెరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య క్రమేపీ వైషమ్యాలు పెరిగాయి. 2014 నుంచి వీరయ్య గ్రామంలోనే గాక మండల స్థాయిలో టీడీపీ పెత్తనాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ కోవలోనే ఉప్పుగుండూరుకు చెందిన రేషన్‌ మాఫియా నాయకుడు టీడీపీ నుంచి వెళ్లి వైసీపీలో చేరి గత ప్రభుత్వంలో పెత్తనం చెలాయించారు. గ్రామంలోని వీరయ్య వ్యతిరేకులను టీడీపీ పక్కన పెట్టింది. రౌడీషీటర్‌గా ఉన్న వైసీపీ నాయకుడు ఇటీవల టీడీపీలో చేరే ప్రయత్నాలు చేయగా వీరయ్య అడ్డుకున్నారు. అలాగే టీడీపీ అధినాయకత్వంతో వీరయ్యకు పూర్తిసంబంధాలు ఏర్పడ్డాయి. పైగా జిల్లా స్థాయి పదవిని చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దశలో వీరయ్యను హతమార్చడానికి ఇటు రాజకీయ వైషమ్యాలతోపాటు ఆయన ఎదుగుదలపై ఈర్ష్య కూడా కారణమై ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా అమ్మనబ్రోలుకు చెందిన యువకుడి సతీమణి అమెరికాలో ఉంటారు. గత కొంతకాలంగా తాను కూడా అమెరికా వెళ్తున్నట్లు ఆయన సన్నిహితులకు చెప్పినట్లు పోలీసులు తెలుసుకున్నారు. శుక్రవారం పోలీసులు పరిశీలన చేయగా ఈనెల 29న యువకుడు అమెరికా వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది.

గ్రామంలో పోలీసు పికెట్‌

తాజా సమాచారంతో గ్రామంలో వీరయ్య అభిమానులు ప్రత్యర్థులపై తిరగబడవచ్చన్న అనుమానంతో అమ్మనబ్రోలులోను, ఆ మండలంలోను పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి సమీక్ష చేస్తున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 01:24 AM