చల్లబడిన వాతావరణం
ABN, Publish Date - May 17 , 2025 | 12:51 AM
ఎండల తీవ్రతతో తల్లడిల్లుతున్న జిల్లా ప్రజానీకానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. శుక్రవారం వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తగ్గాయి. పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో దాదాపు పది రోజులకుపైగా అత్యధిక ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తించాయి. దీనికితోడు వేడిగాలులు కొంత సేపు, ఉక్కపోత వాతావరణం మరికొంత సేపు ఉండటంతో ప్రజానీకం ఉక్కిరిబిక్కివుతున్నారు.
పలుచోట్ల ఒక మోస్తరు వర్షం
ఎండల తీవ్రత నుంచి ఉపశమనం
సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు
ఒంగోలు, మే 16 (ఆంధ్రజ్యోతి) : ఎండల తీవ్రతతో తల్లడిల్లుతున్న జిల్లా ప్రజానీకానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. శుక్రవారం వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తగ్గాయి. పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో దాదాపు పది రోజులకుపైగా అత్యధిక ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తించాయి. దీనికితోడు వేడిగాలులు కొంత సేపు, ఉక్కపోత వాతావరణం మరికొంత సేపు ఉండటంతో ప్రజానీకం ఉక్కిరిబిక్కివుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గాలులు, ఉరుములు, మెరుపులతో జల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో శుక్రవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో సగటున 9.0మి.మీ వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా సింగరాయకొండ మండలంలో 47.8 మి.మీ కురిసింది. పొన్నలూరులో 47.2, మర్రిపూడిలో 41.6, చీమకుర్తిలో 30.0, కొండపిలో 26.8, తాళ్లూరులో 21.4, పీసీపల్లిలో 21.2, నాగులుప్పలపాడులో 20.4, కురిచేడులో 18,4, సంతనూతలపాడు 11.6 మి.మీ నమోదైంది. పలు ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి. తిరిగి శుక్రవారం పగటి పూట కూడా పలుచోట్ల జల్లులు కురిశాయి. ఒంగోలులో ఉదయం నుంచి మబ్బులు పట్టి స్వల్పంగా జల్లులు పడ్డాయి. జిల్లాలో గత పదిరోజులుగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో 42నుంచి 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు అత్యధిక ప్రాంతాల్లో 40 డిగ్రీలపై ఎండ కాచింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఎర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపిలో 37.6 డిగ్రీలు నమోదైంది. అదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎక్కువ ప్రాంతాల్లో 30నుంచి 35 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో ప్రజానీకం ఊరట చెందింది. సాధారణంగా వేసవిలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండేది రోహిణికార్తెలో. ఈనెల 25నుంచి రోహిణి రానుంది. ఆ సమయంలో ఎండలు మండిపోవడం సహజం. అయితే వారం ముందు ఇలా వాతావరణం చల్లబడటం, వర్షం కురవడంతో రోహిణికి ముందే ఎండల మరింత మండుతాయేమోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.
Updated Date - May 17 , 2025 | 12:51 AM