బాబాయి, పిన్నిలపై అబ్బాయి దాడి
ABN, Publish Date - Jul 17 , 2025 | 10:55 PM
ఆస్తి తగాదాలతో బాబాయి, పిన్నిపై స్వయాన అన్న కుమారుడు ఇనుపరాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉంది.
ఆస్తి వివాదాలే హత్యాయత్నానికి కారణం
ఇద్దరి పరిస్థితి విషమం
గిద్దలూరు టౌన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ఆస్తి తగాదాలతో బాబాయి, పిన్నిపై స్వయాన అన్న కుమారుడు ఇనుపరాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. గిద్దలూరు మండలం పొదలకొండపల్లె గ్రామానికి చెందిన శనివారపు రమణారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రమణారెడ్డి, శివారెడ్డి అన్నదమ్ములు. ఇద్దరి మధ్య పొలంలో వేసిన వ్యవసాయ బోరు, భూమి భాగపంపకాలపై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పలు సందర్భాలలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరగ్గా భూమి, బోరు వ్యవహారం కొలిక్కిరాలేదు. అన్న శివారెడ్డి కుమారుడైన నిరంజన్‌రెడ్డి బాబాయ్ రమణారెడ్డిపై ద్వేషం పెంచుకుని బుధవారం రాత్రి రమణారెడ్డి, భార్య వెంకటసుబ్బమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా వెళ్లి గొడవ చేశాడు. అక్కడితో ఆగకుండా ఇనుప రాడ్‌తో బాబాయి, పిన్నిపై దాడి చేశారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకుని గాయపడిన ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరినీ నంద్యాలకు తరలించారు. తన తల్లిదండ్రులపై దాడి చేసిన నిరంజన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి ప్రేరణతోనే దాడి చేసినట్లు రమణారెడ్డి కొడుకు సాయికుమార్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు అర్బన్ సీఐ కె.సురేష్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Updated Date - Jul 17 , 2025 | 10:55 PM