మళ్లీ బోగస్ రుణ మోసం
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:22 AM
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ చేయూతనిస్తోంది. అయితే కొందరు ఆర్పీలు అక్రమాలకు పాల్పడుతున్నారు. పొదుపు సంఘాలను అడ్డుపెట్టుకుని బోగస్ గ్రూపులను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
తీసుకున్న లోన్లు చెల్లించాలని గ్రూపు సభ్యులపై బ్యాంకర్ల ఒత్తిడి
కొందరు ఆర్పీల బురిడీతో రోడ్డెక్కిన బాధితులు
మూడు నెలల్లో 350కు పైగా రుణాలు.. అందులో 56 నకిలీవిగా అనుమానం
గతంలో తొలగించిన వారిలో కొందరు నేటికీ ఆర్పీలుగా చెలామణి
వారంరోజులుగా పలు బ్యాంకుల్లో రుణాల కోసం వారు హడావుడి
వైసీపీ పాలనలో బీజం.. నేటికీ కొనసాగుతున్న బాగోతం
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ చేయూతనిస్తోంది. అయితే కొందరు ఆర్పీలు అక్రమాలకు పాల్పడుతున్నారు. పొదుపు సంఘాలను అడ్డుపెట్టుకుని బోగస్ గ్రూపులను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా జరిగిన భారీ కుంభకోణంపై ‘ఆంధ్రజ్యోతి’ గతేడాది మార్చి 5 నుంచి వరుస కథనాలు ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పట్లో అధికారులు స్పందించి కొందరు ఆర్పీలను బాధ్యతల నుంచి తొలగించారు. మరికొందరు మాత్రం కొనసాగుతూ నేటికీ పాత పంథాలోనే నడుస్తున్నారు. తొలగించిన వారిలో ఇద్దరు, ముగ్గురు ఆర్పీలుగా చెలామణి అవుతూ అదే బోగస్ బాగోతాన్ని నడుపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన ఆర్పీలు ఇష్టారాజ్యంగా దోచేశారు. నేటికీ బోగస్ గ్రూపుల భాగోతానికి అడ్డుకట్ట వేయలేకపోవడంతో కొందరు విధుల నుంచి తొలగించినా ఇంకా ఆర్పీలుగానే కొనసాగుతూ బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం మారినా.. అధికారులు మారినానకిలీ గ్రూపుల వ్యవహారం నడుస్తూనే ఉంది. ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 350 గ్రూపులకు రుణాలు మంజూరు కాగా అందులో 56 గ్రూపులు అసలు మెప్మా రికార్డుల్లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ లేకపోవడం గమనార్హం. అయితే ఈ నకిలీ గ్రూపులకు కార్యా లయ సిబ్బంది సహ కారం అందించడం మెప్మాలో చర్చనీయాంశమైంది.
ఓ ఆర్పీ నిర్వాకంతో రోడ్డెక్కిన బాధిత మహిళలు
తాజాగా కేశవస్వామి పేటకు చెందిన పలు పొదుపు సంఘాల మహిళలు ఓ ఆర్పీ చేతివాటంతో మోసపోయారు. విషయం తెలుసుకుని న్యాయం చేయాలని రోడ్డెక్కారు. తమ గ్రూపు బాధ్యతలు చూసే ఆర్పీ తమకు తెలియకుండా తమ పేరుతో భారీగానే రుణాలు దోచేసినట్లు బాధితులు వాపోతున్నారు. సుమారు 14గ్రూపుల పేరుతో రుణాలు తీసుకుని ఒక్కో సభ్యురాలికి రూ.2లక్షలు రుణం అందించాల్సి ఉండగా, కేవలం రూ.లక్ష మాత్రమే చేతికిచ్చారని తెలిపారు. తాము తీసుకున్న లక్షను తిరిగి చెల్లించినప్పటికీ ఇప్పుడు బ్యాంకర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి మిగిలిన లక్ష చెల్లించాలని కోరడంతో ఏమిచేయాలో అర్థం కావడం లేదన్నారు. ఇదే విషయమై ఆర్పీని ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాశ్యులమైన తమను ఆర్పీ మోసం చేసిందని, తమకు తెలియకుండా తమ పేరుతో రుణాలు తీసుకోవడం వలన బ్యాంకర్లు తమను బాధ్యలుగా చేస్తున్నారని వాపోయారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి తమకు న్యాయం పలువురు పొదుపు సంఘాల మహిళలు కోరుతున్నారు. దీంతోపాటు మరికొందరు ఆర్పీలు నేటికీ అవినీతికి పాల్పడటం, సకాలంలో రుణాలు తిరిగి చెల్లింపులు జరగకపోవడంతో బ్యాంకు అధికారులురంగంలోకి దిగారు. నెల వాయిదాలు చెల్లించాలని కోరడంతో అసలు తాము రుణాలే తీసుకోలేదని సభ్యులు వాపోతున్నారు.
మూడు నెలల్లోభారీగా గ్రూపు రుణాలు?
ఇటీవల కాలంలో మెప్మాలో అవినీతి బాగోతం మరింత అధికమైంది. మూడు నెలలుగా 350కిపైన పొదుపు సంఘాలకు రుణాలు మంజూరయ్యాయి. అందులో56 గ్రూపుల వివరాలు తెలియడం లేదు. అవన్నీ బోగస్ గ్రూపులైనట్లు సమాచారం. గడిచిన రెండు నెలల్లో పలు అవినీతి వ్యవహారాలు వెలుగులోకి రావడంతో ఒంగోలు సీఎంఎంగా బాధ్యతల్లో ఉన్న అధికారిని విధుల నుంచి తొలగించి, మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. మరోవైపు కార్యాలయంలోని మరో ఉద్యోగి బోగస్ గ్రూపులకు తన వంతు సహకారం అందించి భారీగానే బొక్కేసినట్లు సమాచారం. అటు కార్యాలయ ఉద్యోగులు, ఇటు అవినీతి ఆర్పీల పొదుపు సంఘాలను మోసం చేస్తూ, బ్యాంకులను బురిడీ కొట్టించి భారీగా దోచేయడం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
గత వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా..
మెప్మాలో అవినీతికి గత వైసీపీ పాలనలో పునాదులు పడ్డాయి. ఏడాది క్రితం కొందరు ఆర్పీలు, వైసీపీ నాయకురాళ్లు కుమ్మక్కయారు. పొదుపు మహిళల పేరుతో కోట్ల రూపాయలు మెక్కేశారు. లేని పొదుపు సంఘాలను ఉన్నట్లుగా చిత్రీకరించి మాయ చేశారు. ఆధార్ కార్డులు మార్చేశారు. ఆన్‌లైన్‌లో లేకుండా మాయ చేశారు. మొత్తంగా బోగస్ రుణాలతో భారీగా దోచేశారు. కొందరు వైసీపీ నాయకురాళ్లు మెప్మాతో సంబంధం లేకపోయినా, రుణాల పేరుతో కొన్ని బ్యాంకులను బురిడీకొట్టించి ఇష్టారాజ్యంగా దోచేశారు. అయితే ఈ అవినీతి బాగోతం మెప్మా జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలకు వెనుకడుగు వేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అప్పటి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు అధికారులు విచారణ చేసి ఐదుగురిని విధుల నుంచి తొలగించారు. అయితే తొలగించిన వారిలో ఇద్దరు ఆర్పీలు మాత్రం మెప్మాతో సంబంధం లేకపోయినా నేటికీ ఆర్పీలుగా చెలామణి అవుతూ బోగస్ గ్రూపులతో భారీగా దోచేసినట్లు సమాచారం.
పేర్లు మార్చి కొత్త గ్రూపులుగా..
పేర్లు మార్చి నకిలీ గ్రూపులతో కొందరు ఆర్పీలుగా వ్యవహరిస్తున్న తీరు విస్తుగొలుపు తోంది. వాస్తవానికి ఒక గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు. ఒక్కో ఆర్పీ కింద కొన్ని గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూపు నుంచి ఇద్దరు మహిళా సభ్యుల పేర్లు తీసి, వారి ఆధార్ కార్డులు మార్చేసి, గ్రూపు పేరును కూడా పూర్తిగా మార్చకుండా ముందు ఏదో ఒక అక్షరం చేర్చి మరో గ్రూపుగా సృష్టిస్తారు. ఎప్పటి నుంచో బ్యాంకర్లతో రుణాలకు సంబంధించి పరిచయాలు కలిగిన ఆర్పీలు కొత్త గ్రూపులుగా పరిచయం చేస్తారు. ఇదంతా గ్రూపు సభ్యులకు తెలియదు. ఈ విధంగా నకిలీ పొదుపు గ్రూపులను తయారు చేసి బ్యాంకర్లను మభ్య పెడతున్నారు. ఆర్పీలను నమ్మిన బ్యాంకర్లు ఒక్కో గ్రూపునకు రూ.20లక్షల రుణం మంజూరు చేస్తున్నారు. ఇటీవల ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది.
Updated Date - Apr 26 , 2025 | 01:22 AM