ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతన్నకు భరోసా

ABN, Publish Date - Jun 05 , 2025 | 01:31 AM

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకురానుండటంతో ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి ఒకదశ పూర్తి చేసింది.

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల గుర్తింపునకు భారీ కసరత్తు

ప్రభుత్వం నుంచి అందిన 5.31 లక్షల మంది భూ యజమానుల ఖాతాల పరిశీలన

వారిలో పలు తేడాలు ఉన్న 42వేల ఖాతాల వివరాలు ఆయా తహసీల్దార్లకు అందజేత

మిగిలిన 4.90 లక్షల ఖాతాల జాబితా సిద్ధం

ప్రభుత్వానికి పంపిన వ్యవసాయ శాఖ

కుటుంబ సర్వే ఆధారంగా నేరుగా ప్రభుత్వ స్థాయిలోనే పరిశీలన

జిల్లాలో ఈకేవైసీ... ఆతర్వాతే తుది జాబితా

కుటుంబంలో ఒకరికే పథకం వర్తింపు

కౌలు రైతులకు లేనట్లే!

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకురానుండటంతో ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి ఒకదశ పూర్తి చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దాని కన్నా ప్రస్తుత సర్కారు ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని భారీగా పెంచింది. గత ప్రభుత్వం కేంద్రంతో కలిసి రూ.13,500 ఇస్తే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు చేసింది. ఈ మొత్తం అనర్హులకు అందకుండా, అర్హులకు అన్యాయం జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకొంటోంది. వివిధ దశల్లో వ్యవసాయ, రెవెన్యూ అధికారుల పరిశీలన జరుగుతోంది. ఈనెలలోనే పథకాన్ని అమలు చేసి రైతుల ఖాతాలలో నగదును జమ చేసేందుకు అంతా సిద్ధం చేస్తోంది.

ఒంగోలు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకానికి రాష్ట్రప్రభుత్వం తన నిధులను కలిపి అన్నదాత సుఖీభవను అమలు చేయనుంది. పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్రం ఏటా రూ.6వేల నగదును మూడు విడతలుగా రైతుల ఖాతాలకు జమ చేస్తోంది. దానికి మరో రూ.7,500 కలిపి గత వైసీపీ ప్రభుత్వం ఏటా రూ.13,500 రైతులకు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఏడాది పాలన పూర్తి సందర్భంగా ఈనెలలో అమలుకు నిర్ణయించింది. భారీగా పథకం నగదును పెంచడంతో లబ్ధిదారుల గుర్తింపులో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి తొలిదశ ప్రక్రియ పూర్తయింది. అందులో వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా ఉన్న రైతు ఖాతాలను నేరుగా రాష్ట్రప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జాబితాలను ప్రాథమిక పరిశీలన కోసం జిల్లాలకు పంపిం చింది. జిల్లాలో సుమారు 5.31లక్షల భూయజ మానులు ఉన్నట్లు గుర్తించి స్థానికంగా ఉన్న డేటాతో సరిపోల్చి చూడాలని ఆదేశించింది.

ఆధార్‌, పేర్లలో తేడాలతో..

ప్రభుత్వం పంపిన జాబితాలను వ్యవసాయశాఖ, క్షేత్ర స్థాయిలోని రెవెన్యూ సిబ్బంది పరిశీలించగా అందులో 42వేల పేర్లకు సంబంధించి ఆధార్‌ నంబరు, పేర్లు, ఇతరత్రా వాటిలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి పరిశీలన కోసం వ్యవసాయశాఖ నుంచి తహసీల్దార్లకు అందజేశారు. వాటిలో అధికభాగం భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగి మ్యుటేషన్లు జరగాల్సినవి ఉన్నట్లు సమాచారం. సజావుగా ఉన్న 4.90 లక్షల ఖాతాల జాబితాలను తిరిగి ప్రభుత్వానికి నివేదించారు. వాటిని ప్రభుత్వ స్థాయిలో కుటుంబ సర్వే ఆధారంగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఒక కుటుంబానికి ఒకరికే పథకం లబ్ధి అందజేస్తారు. జిల్లాలో ప్రభుత్వం నుంచి ఇచ్చిన 5.71 లక్షల ఖాతాలలో ఇంచుమించు సగానికిపైగా ఒకే కుటుంబంలో ఇద్దరి, ముగ్గురి పేర్లతో భూములు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో భూయజమానుల జాబితాల వివరాలను సరిపోల్చే చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

వేలిముద్ర, ఐరిస్‌ ద్వారానే ఈకేవైసీ

నెలకు రూ.10వేల కన్నా అధికంగా పెన్షన్లు పొందే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించేవారికి పథకం వర్తించదు. ఆధార్‌ సీడింగ్‌ ఆధారంగా ఇలాంటి వారిని గుర్తించే ప్రక్రియను ప్రభుత్వస్థాయిలోనే చేస్తున్నట్లు సమాచారం. అది పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలను తిరిగి జిల్లాలకు పంపిస్తారు. మళ్లీ ఆ జాబితాలలో పేర్లు ఉన్న వారందరికీ ఈకేవైసీ చేయాలి. అది కూడా గతంలో ఈక్రాప్‌ నమోదు, ఇతరత్రా వాటికి చేసిన తరహాసెల్‌ఫోన్‌ నంబర్‌ ఓటీపీతో ఈకేవైసీ చేసే అవకాశం లేదు. విధిగా సదరు లబ్ధిదారులుగా గుర్తించిన రైతుల వేలిముద్ర లేదా ఐరీస్‌ ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలి. దాని ద్వారా స్థానికంగా వ్యవసాయం చేయకుండా విదేశాలలో, ఇతర ప్రాంతాల్లో ఉండి ప్రభుత్వ లబ్ధి పొందే వారిని కట్టడి చేయనున్నారు.

కౌలు రైతు కార్డులు లేక దూరం

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం వాస్తవ పట్టా భూముల యజమానులు, అటవీ భూముల హక్కు పత్రాలు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అందనుంది. కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగు చేస్తున్న వారికి అందే అవకాశాలు లేవు. కౌలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నా అధికారికంగా కౌలుగుర్తింపు కార్డులు ఉన్నవారే అర్హులు, అలాంటి కార్డులు ఏటా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ తర్వాత జారీ అవుతాయి. దానివల్ల తొలివిడతగా పథకం అందించే లబ్ధిదారులలో వారు ఉండే అవకాశం లేదు. జిల్లాలో పథకం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి సిహెచ్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాకు అందించిన 5.31 లక్షల రైతు ఖాతాల పరిశీలన పూర్తిచేసి నివేదికలు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. తదుపరి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2.48లక్షల మందికి పీఎం కిసాన్‌ పథకం అందుతుందని వారందరికీ అన్నదాత సుఖీభవ అందే అవకాశం ఉందన్నారు. ఇతరుల విషయంలో ప్రభుత్వం తదుపరి చర్యలకు అనుగుణంగా ఉంటాయన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 01:31 AM