తొమ్మిది రకాల పాఠశాలలకు ఆమోదం
ABN, Publish Date - May 14 , 2025 | 01:14 AM
పునర్విభజనలో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
విద్యాశాఖ ఉత్తర్వులు
ఒంగోలు విద్య, మే 13 (ఆంధ్రజ్యోతి) : పునర్విభజనలో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం 117 జీవోను విడుదల చేసింది. ఈ విధానంలో హైస్కూళ్లలో 3, 4, 5 తరగతులను విలీనం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 117 జీవోను రద్దుచేయా లని ఆందోళనలు కూడా జరిగాయి. ఈక్రమంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం 117 జీవోను రద్దుచేసి ప్రత్యామ్నాయంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణకు 19 జీవోను మంగళవారం విడుదల చేసింది. గత ప్రభుత్వంలోని ఆరు రకాల స్థానంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలకు ఊపిరిపోసింది. గత ప్రభుత్వంలో హైస్కూల్‌లో విలీనమైన 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలకు వెనక్కు పంపాలని అందరూ డిమాండ్ చేశారు. దాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం హైస్కూళ్లలో 1 నుంచి 10 తరగతుల వరకు నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. జిల్లాలోని దాదాపు సగం హైస్కూళ్లులో 1 నుంచి 10 తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో 82 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రభుత్వ మానస పుత్రికగా అమలులోకి వస్తున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్‌ఎం పోస్టులు ఇస్తున్నారు. ఈ పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం(పీస్‌హెచ్‌ఎం) పోస్టులు కేటాయిస్తున్నారు. పీఎస్ హెచ్‌ఎం పోస్టులు సరిపోకపోతే ఆ పాఠశాలలకు మిగులు స్కూలు అసిస్టెంట్లను హెచ్‌ఎంలుగా నియమిస్తున్నారు.
ప్రభుత్వం తాజాగా అమలులోకి తెస్తున్న తొమ్మిది రకాల పాఠశాలలు ఇవీ..
శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ : పూర్వ ప్రాథమిక (పీపీ1) పూర్వ ప్రాథమిక-2 (పీపీ2) పాఠశాలలు. వీటిని అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా పనిచేస్తాయి.
ఫౌండేషన్ స్కూల్ : పీపీ1, పీపీ2లో 1, 2 తరగతులు నిర్వహిస్తారు. ఈ పాఠశాలలకు 1 నుంచి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 31 కంటే ఎక్కువ 60 మంది వరకు ఉంటే రెండు ఎస్జీటీ పోస్టులు కేటాయిస్తారు.
బేసిక్ ప్రైమరీ స్కూల్ : 1 నుంచి 5 తరగతులు. ఈ పాఠశాలలకు 1 నుంచి 20 మందికి ఒక ఎస్జీటీ, 21 నుంచి 60 మందికి రెండు ఎస్జీటీ ఆపైన ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీని కేటాయిస్తారు.
మోడల్ ప్రైమరీ స్కూల్ : 1 నుంచి 5 తరగతులు. 59 మంది వరకు ఒక పీఎస్ హెచ్‌ఎం, 3 ఎస్జీటీలు, 60 నుంచి 150 మందికి 1 ఒక పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏ, నాలుగు ఎస్జీటీ పోస్టులు, ప్రతి 30 మందికి అదనంగా ఒక ఎస్జీటీని ఇస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలలు : 1 నుంచి 5 తరగతులకు బీపీఎస్/ఎంపీఎస్‌ల తరహాలో విద్యార్థుల సంఖ్యను బట్టి పోస్టులు ఇస్తారు. 6, 7, 8 తరగతులకు 1 నుంచి 10కి ఒక ఎస్‌ఏ, 11 నుంచి 20 మందికి రెండు ఎస్‌ఏలు, 31 నుంచి 140కి నాలుగు ఎస్‌ఏలు, 141 నుంచి 175కు ఐదు ఎస్‌ఏలను ఇస్తారు. మిగులు ఎస్‌ఏలు లేకపోతే ఎస్జీటీలను ఇస్తారు,.
హైస్కూలు (1 నుంచి 10 తరగతులు) : 1నుంచి 5 తరగతులకు 10మందికి రెండు ఎస్జీటీలు, 11 నుంచి 30 వరకు మూడు ఎస్జీటీలు, 31 నుంచి 59 వరకు ఒక పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఎ, 3 ఎస్జీటీలు ఇస్తారు. 6 నుంచి 10 తరగతులకు సెక్షన్లను బట్టి ఎస్‌ఏలను ఇస్తారు,
హైస్కూళ్లు 6 నుంచి 10 తరగతుల వరకు : సెక్షన్ల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.
హైస్కూల్ ప్లస్ 6 నుంచి 12 తరగతులు : సెక్షన్ల ఆధారంగా పోస్టులు, 11, 12 తరగతులకు పీజీ విద్యార్హతలు ఉన్న వారు బోధిస్తారు.
హైస్కూల్ ప్లస్ 1 నుంచి 12 తరగతులు : ప్రాథమిక, ఉన్నత సెక్షన్లకు నిబంధనల ప్రకారం టీచర్లను కేటాయిస్తారు. 11, 12 తరగతులకు పీజీ టీచర్లు బోధిస్తారు.
3,048 పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలో 3,048 పాఠశాలలు ఉన్నాయి. హైస్కూళ్లు, హైస్కూలు ప్లస్‌లో 1 నుంచి 5 తరగతులకు ఎస్జీటీలు, 6 నుంచి 12 తరగతులకు స్కూలు అసిస్టెంట్లు బోధిస్తారు.
Updated Date - May 14 , 2025 | 01:14 AM