తెరపైకి మళ్లీ ఆదరణ
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:29 AM
కూటమి ప్రభుత్వం ఆదరణ పథ కాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అవసర మైన వస్తువులను 90శాతం సబ్సిడీపై అందజేయనుంది.
కులవృత్తిదారులకు పరికరాలు
90శాతం సబ్సిడీతో యూనిట్లు అందజేయనున్న ప్రభుత్వం
ఒంగోలు నగరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ఆదరణ పథ కాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అవసర మైన వస్తువులను 90శాతం సబ్సిడీపై అందజేయనుంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభు త్వం అధికారంలో ఉన్న 1997-99 సంవత్సరంలో ఆదరణ-1, 2018-19లో ఆదరణ-2 ను అమలు చేసింది. 335 రకాల వృత్తిదారులకు వారికి అవసరమైన పరికరాలు అందజేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని పథకాలను నిలిపేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ బీసీలకు మంచిరోజులు వచ్చాయి. ఆదరణ-3 పేరుతో కులవృత్తులతో జీవిస్తున్న వేలాది మంది బీసీలకు అవసరమైన వస్తువులను కొద్దిరోజుల్లోనే అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కులవృత్తిదారులకు భారీగా లబ్ధి
జిల్లాలో 15 వేల నుంచి 20వేల మంది వరకూ ఆదరణ పథకం కింద లబ్ధి చేకూరనుంది. వృత్తిదారుల అవసరాలను తెలుసుకుని వారికి ఉపయోగపడే పరికరాలను ఆదరణ-3 పథకం కింద అందజేయనున్నారు. ఇందులోభాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో బీసీ కార్పొరేషన్ అధికారులు వివిధ కుల వృత్తిసంఘాల నాయకులు, బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవసరమైన వృత్తి పరికరాల గురించి ఈడీ వెంకటేశ్వరరావు తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో కులవృత్తిదారులతో బీసీ కార్పొరేషన్ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో వృత్తి పరికరాలను అందజేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా నెల రోజుల్లోనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
Updated Date - Mar 19 , 2025 | 01:29 AM