వేటు మొదలైంది!
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:33 AM
డ్వామాలో అక్రమార్కులపై వేటు మొదలైంది. మొత్తం ఆ సంస్థ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు బదిలీల ప్రక్రియ నడుస్తుండగా, మరోవైపు గత ప్రభుత్వంలో ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి.
డ్వామాలో 14మందిపై చర్యలు
ఒక టెక్నికల్ అసిస్టెంట్ తొలగింపు
ఇన్‌చార్జి ఏపీడీ జడ్పీకి సరెండర్
నలుగురు కంప్యూటర్ ఆపరేటర్ల డిప్యుటేషన్ రద్దు
మరికొందరి నుంచి నగదు రికవరీ
లోకేశ్వరరావు కమిటీ నివేదిక ఆధారంగా యాక్షన్
పూర్తిస్థాయిలో చర్యల కోసం సమగ్ర విచారణకు ఆదేశం
డ్వామాలో అక్రమార్కులపై వేటు మొదలైంది. మొత్తం ఆ సంస్థ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు బదిలీల ప్రక్రియ నడుస్తుండగా, మరోవైపు గత ప్రభుత్వంలో ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు 14మందిపై వేటు పడింది. పలు ఆరోపణల నేపథ్యంలో పూర్వపు పీడీ శీనారెడ్డి అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు అందజేసింది. దాని ప్రకారం ప్రస్తుతం యాక్షన్ తీసుకుంటున్నారు. కాగా శీనారెడ్డిపైనా చర్యలు ఉంటాయని సమాచారం. అలాగే కమిటీ నివేదిక ఆధారంగా మరోసారి డ్వామాపై సమగ్ర విచారణ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఒంగోలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి కలెక్టర్ నియమించిన డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా పలువురు డ్వామా సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో మొత్తం 14 మందిపై చర్యలు తీసుకుంటూ పీడీ జోసఫ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులో జడ్పీ నుంచి డిప్యుటేషన్‌పై డ్వామాలో పనిచేస్తున్న ఒకరిని తిరిగి ఆ శాఖకు సరెండర్ చేశారు. నలుగురు కంప్యూటర్ ఆపరేటర్ల డిప్యుటేషన్ల రద్దు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సర్వీసు నుంచి తొలగింపు, నలుగురికి నగదు రికవరీలు పెట్టారు. త్రిపురాంతకం మండలంలో 11వ విడత సోషల్ ఆడిట్ అవకతవకలకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా శాఖాపరంగా మరోసారి సమగ్ర విచారణకు నిర్ణయించారు. అందులో 10మంది సిబ్బంది ఉన్నారు. అలా మొత్తంగా 24మందిపై చర్యలకు నిర్ణయించారు.
శీనారెడ్డిపై చర్యలకు సిఫార్సు
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో దాదాపు నాలుగున్నరేళ్లు డ్వామా పీడీగా శీనారెడ్డి పనిచేశారు. ఆయన అధికారిగా కన్నా వైసీపీ నాయకుడిగా వ్యవహరించారు. శీనారెడ్డి పనిచేసిన కాలంలో డ్వామాలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులతో విచారణకు ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కలెక్టర్ అన్సారియా నియమించారు. ఆ కమిటీ డిసెంబరు, జనవరి నెలల్లో విచారణ నిర్వహించింది. నివేదికను జనవరి ఆఖరులో కలెక్టర్‌కు అందించింది. దానిని పరిశీలించిన కలెక్టర్.. అవినీతి, అక్రమాలు జరిగాయని, శీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అదేసమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు డ్వామా జిల్లా కార్యాలయ, అలాగే ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది పేర్లను కమిటీ ప్రస్తావించింది. వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన పలువురిపై వేటు వేశారు. డ్వామా పీడీగా శీనారెడ్డి పనిచేసిన సమయంలో జడ్పీ నుంచి డ్వామాకు డిప్యుటేషన్‌పై వచ్చి తొలుత విజిలెన్స్ సూపరింటెండెంట్‌గా అనంతరం ఒంగోలు క్లస్టర్ ఇన్‌చార్జి ఏపీడీగా పనిచేస్తున్న పి.వెంకటస్వామి డిప్యూటేషన్ రద్దు చేసి తిరిగి జడ్పీకి పంపించారు.
డ్వామా జిల్లా కార్యాలయంలో పనిచేస్తూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధనాల సురేష్, దాసరి సురేష్, ఏపీవో నాగేశ్వరరావు, ఈసీ ప్రవీణ్‌కుమార్‌ల డిప్యుటేషన్లను రద్దుచేశారు.
విధులకు హాజరు కాకుండానే జీతాలు డ్రా చేసినట్లు తేలడంతో డ్వామా కార్యాలయంలోని టెక్నికల్ అసిస్టెంట్ తోట నవీన్‌ను సర్వీసు నుంచి తొలగించారు.
కనిగిరి ఏపీడీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్‌ను మరో క్లస్టర్‌కు, డ్వామా కార్యాలయంలోని ఆఫీసు సబార్డినేటర్ వై.చేజర్లను మరో సెక్షన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
టంగుటూరు మండల ఈసీ దివికుమార్, వైపాలెం మండలంలోని టీఏలు వి.లక్ష్మయ్య, జి.శివరామరెడ్డి, పెద్దారవీడు మండలం టీఏ ప్రవీణ్‌కుమార్‌ల నుంచి నగదు రికవరీకి ఆదేశించారు.
త్రిపురాంతకం మండలంలో 2019లో జరిగిన 11వ విడత సోషల్ ఆడిట్‌లో సుమారు రూ.3కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. 10మంది సిబ్బందిని సస్పెండ్ చేసి కొద్దిరోజులకు తిరిగి అక్కడే పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆ విషయాన్ని లోకేశ్వరరావు కమిటీ ప్రశ్నించింది. దీంతో సదరు వ్యవహారంపై మరోసారి శాఖాపరమైన విచారణ చేపట్టాలని భావించారు. జిల్లా విజిలెన్స్ అధికారి, నాణ్యత నియంత్రణ విభాగాధికారి, మార్కాపురం ఏపీడీలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు.
ఒంగోలు సీఎల్‌ఆర్‌సీ పరిధిలో రూ.10లక్షలను ఆఫీసు అటెండర్ చల్లా శేషారావు చెక్కులపై ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసిన వ్యవహారంలో సరైన చర్యలను నాటి పీడీ శీనారెడ్డి తీసుకోకుండా అతనిని సస్పెండ్ చేసి ఆ వెంటనే డబ్బు రికవరీ చేశారంటూ పోస్టింగ్ ఇచ్చారు. ఆ విచారణ తీరును కమిటీ ప్రశ్నించింది. దీంతో ఈ ఘటనపై ప్రస్తుత డ్వామా ఏపీడీ వండర్‌మెన్‌ను విచారణ చేయాలని ప్రస్తుత పీడీ సూచించారు.
Updated Date - Mar 19 , 2025 | 01:33 AM