విఠలాపురం సర్పంచ్‌పై చర్యలు
ABN, Publish Date - Jun 03 , 2025 | 01:55 AM
ఉపాధి హామీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన తాళ్లూరు మండలం విఠలాపురం సర్పంచ్, సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, వైసీపీ జిల్లా కార్యదర్శి మారం ఇంద్రసేనారెడ్డిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్‌ఆర్ యాక్ట్ ద్వారా నిధులు రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జి.వెంకనాయుడు స్థానిక తహసీల్దార్, విఠలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
వాడుకున్న నిధులు రాబట్టేందుకు ఆర్‌ఆర్ యాక్టు
తహసీల్దార్, కార్యదర్శికి డీపీవో ఆదేశాలు
తాళ్లూరు, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన తాళ్లూరు మండలం విఠలాపురం సర్పంచ్, సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, వైసీపీ జిల్లా కార్యదర్శి మారం ఇంద్రసేనారెడ్డిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్‌ఆర్ యాక్ట్ ద్వారా నిధులు రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జి.వెంకనాయుడు స్థానిక తహసీల్దార్, విఠలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు అందాయి. విఠలాపురం పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద 2018-19 సంవత్సరంలో టీడీపీ నాయకులు మానం రమేష్‌బాబు, షేక్ కాలేషావళిలు అభివృద్ధి పనులు చేశారు. సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి వారికి బిల్లులు చెల్లించకపోవడంతో 2021 డిసెంబరు 2న హైకోర్టును ఆశ్రయించారు. అయితే సర్పంచ్ కోర్టు ఆదేశాలను పాటించకుండా మరొకరికి బిల్లులు చెల్లించారు. దీంతో రమేష్, కాలేషాలు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. బిల్లుల చెల్లింపులో ఏర్పడిన వివావాదంపై హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ ఉత్తర్వులమేరకు పంచాయతీ రాజ్ ఎస్‌ఈ క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఈవిచారణలో వివాదంలో ఉన్న రూ.54,68,835 బిల్లులకు సంబంధించిన పనులను రమేష్, కాలేషావళిలు చేశారని, ప్రభుత్వపరంగా ఆనిధులను పంచాయతీకి జమచేయగా సర్పంచ్ దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించారు. హైకోర్టు ఆదేశానుసారం అప్పటి రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డిపై క్రిమినల్ కేసు, ఆర్‌ఆర్ యాక్టు తక్షణమే అమలు చేసి నిధులను రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి కలెక్టర్ దినేష్‌కుమార్ చర్యలకు ఉపక్రమించారు. ఆమేరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది.
గొట్టిపాటి లక్ష్మి ఫిర్యాదుతో అధికార యంత్రాంగంలో కదలిక
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి స్వయంగా కలెక్టర్ తమీమ్ అన్సారియాను మార్చి 21న కలిసి విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ హయాంలో విఠలాపురం సర్పంచ్ టీడీపీ కార్యకర్తల నిధులు రూ.55లక్షలు స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. ఆర్‌ఆర్‌యాక్ట్ ద్వారా నిధులు రాబట్టి పనిచేసిన వారికి చెల్లించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చినా అప్పట్లో పట్టించుకోలేదన్నారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. దీంతో డీపీవో హైకోర్టు ఉత్తర్వుల పూర్వాపరాలను పరిశీలించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ ఇంద్రసేనారెడ్డిపై ఆర్‌ఆర్‌యాక్ట్ ప్రయోగించి నిధులు రాబట్టేందుకు ఉపక్రమించారు.
Updated Date - Jun 03 , 2025 | 01:55 AM