స్వల్ప భూకంపం
ABN, Publish Date - May 07 , 2025 | 12:29 AM
దర్శి ప్రాంతంలో మంగళవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో స్వల్పంగా భూమి కంపించింది. పట్టణంలోని పుచ్చలమిట్ట, పొదిలి రోడ్డు, తదితర ప్రాంతాల్లో సుమారు రెండు సెకన్లపాటు ప్రకంపనలు సంభవించాయి. ఆసమయంలో కొద్దిపాటి శబ్దం కూడా వచ్చింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు
దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో ప్రకంపనలు
భయాందోళనకు గురైన ప్రజలు
దర్శి/ తాళ్లూరు, మే 6 (ఆంధ్రజ్యోతి) : దర్శి ప్రాంతంలో మంగళవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో స్వల్పంగా భూమి కంపించింది. పట్టణంలోని పుచ్చలమిట్ట, పొదిలి రోడ్డు, తదితర ప్రాంతాల్లో సుమారు రెండు సెకన్లపాటు ప్రకంపనలు సంభవించాయి. ఆసమయంలో కొద్దిపాటి శబ్దం కూడా వచ్చింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దర్శి, తానంచింతల, చందలూరు, లంకోజనపల్లి తదితరప్రాంతాల్లోని కొండలను విచ్చలవిడిగా తవ్వారు. కొన్నిచోట్ల వంద అడుగుల లోతులో కుంటలను తీశారు. బొట్లపాలెంలో పశువుల మేత భూమిలో సుమారు వంద ఎకరాల్లో 50 అడుగుల లోతున మట్టి తవ్వారు. వందలాది ఎకరాల్లోని కొండల్లో, ప్రభుత్వ భూముల్లో మట్టి తోడేయడంతో సమతుల్యం దెబ్బతిని భూమి కంపించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. మండల కేంద్రమైన తాళ్లూరు, తూర్పుగంగవరం గ్రామాల్లో మంగళవారం ఉదయం సెకను పాటు భూమి కంపించింది. ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూక్రపంనలు సంభవించారు. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మండలంలోని శంకరాపురం, పోలవరం, వేంపాడు, తూర్పుకంభంపాడు, నూజెండ్లపల్లి, సుంకరవారిపాలెంతో పాటు పులిపాడు, కెల్లంపల్లి, బసవాపురం, శ్రీనివాస నగర్, ఉల్లగల్లులో భూమి కంపించింది. ఏడాది లోపే మండలంలో ఐదు సార్లు భూప్రంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొనకొండ మండలం యర్రబాలెం ఎస్సీ కాలనీలోనూ స్వల్పంగా భూమి కంపించింది.
Updated Date - May 07 , 2025 | 12:29 AM