పశ్చిమాన పండుగ
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:04 AM
జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఈనెల 26న పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని దోర్నాలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది.
26న మంత్రులు, కీలక ప్రజాప్రతినిధుల పర్యటన
దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
పాల్గొననున్న నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు
మార్కాపురంలో జిల్లా విజన్ ప్లాన్‌పై సమీక్ష
ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఒంగోలు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఈనెల 26న పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని దోర్నాలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది. అందుకోసం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు నేతృత్వంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలాకాలం క్రితమే ఆ కార్యక్రమం జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 4న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరైన అనంతరం అక్కడే ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా టీడీపీ సమావేశం నిర్వహించారు. అందులో 26న దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఇన్‌చార్జి మంత్రి ఆనం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌లతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు వంటి ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఆమేరకు కార్యక్రమంపై స్పష్టత రాగా తదనుగుణంగా భారీ ఏర్పాట్లు ఎరిక్షన్‌బాబు నేతృత్వంలో జరుగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతోపాటు పెద్దసంఖ్యలో గిరిజన గ్రామాల ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్కాపురంలో డీవీఏపీ సమావేశం
దోర్నాలలో కార్యక్రమం అనంతరం మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ (డీవీఏపీ) యూనిట్ సమావేశం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా విజన్-2047లో భాగంగా 2029 నాటికి చేపట్టే కార్యక్రమలపై జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది. వాటి ద్వారా ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సమావేశాలు జరిగాయి. ఇక్కడ ఈనెల 8న నిర్వహించాలని తొలుత నిర్ణయించిన కలెక్టర్ సెలవులో ఉండటంతో వాయిదా పడింది. ఆ సమావేశాన్ని 26న తిరిగి ఏర్పాటు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ 26న ముఖ్యమైన ప్రజాప్రతినిధులంతా దోర్నాల సభకు హాజరుకానుండటంతోపాటు సమావేశం ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరగాల్సి ఉండటంతో దోర్నాల కార్యక్రమం అనంతరం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ సమావే శాన్ని ఏర్పాటు చేశారు. ఆమేరకు ఇన్‌చార్జి మంత్రి ఆనం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడంతో తదనుగుణ ఏర్పాట్లపై అధికారులు చర్యలు చేపట్టారు.
Updated Date - Jul 24 , 2025 | 01:04 AM