ఆన్లైన్లో 75 మంది.. క్లాసుకు వచ్చింది నలుగురే!
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:02 AM
ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యనందించాలన్న ఉద్దేశంతో ఎయిడెడ్ పాఠశాలలకూ గుర్తింపు నిచ్చింది. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తున్నా విధులు మాత్రం సక్రంగా నిర్వర్తించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరుగురు ఉపాధ్యాయులకు జీతాలు
డీఈవో, డిప్యూటీ ఈవో తనిఖీల్లో తేటతెల్లం
రికార్డులు చూపని కరస్పాండెంట్
కొమరోలు, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యనందించాలన్న ఉద్దేశంతో ఎయిడెడ్ పాఠశాలలకూ గుర్తింపు నిచ్చింది. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తున్నా విధులు మాత్రం సక్రంగా నిర్వర్తించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాల హాజరుకు సంబంధించి ఆన్‌లైన్‌లో 75మంది ఉండగా, క్లాస్‌కు మాత్రం నలుగురు విద్యార్థులే హాజరుకావడం సాక్షాత్తు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్, ఉప విద్యాశాఖాధికారి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వెలుగు చూసింది. అధికారులు తెలిపిన వివరాల మేరకు కొమరోలులోని ఏబీఎం ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఆరుగురు ఉపాధ్యాయులకు ప్రభుత్వం సుమారు రూ.6లక్షలు జీతాల రూపంలో చెల్లిస్తోంది. కానీ ఇక్కడ మాత్రం ఆన్‌లైన్లో 75మంది ఉండగా, మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి తనిఖీల్లో కేవలం నలుగురు మాత్రమే కన్పించారు. బుధవారం మార్కాపురం డిప్యూటీ ఈవో పాఠశాలను తనిఖీచేయగా ఏడుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. డీఈవో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల తనిఖీకి వెళ్లినప్పుడు కరస్పాండెంట్ లేరని, రికార్డులను చూపించకపోవడంతో హెచ్‌ఎం సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీంతో బుధవారం డిప్యూటీ ఈవో శ్రీనివాసరెడ్డి పాఠశాలను సందర్శించినా కరస్పాండెంట్ రికార్డులను చూపించలేదు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఏబీఎం ఉన్నత పాఠశాలలో ఆన్‌లైన్లో 75మంది ఉండగా ఏడు మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వారిలో ఇద్దరి పేర్లు ఆన్‌లైన్లో లేవని చెప్పారు. ఏబీఎం ప్రాథమిక పాఠశాలలో ఆన్‌లైన్లో 94మంది ఉండగా అక్కడ కేవలం నలుగురు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. గతంలో విద్యార్థులు లేని కారణంగా టీచర్లను ప్రభుత్వ పాఠశాలలకు డిప్యుటేషన్‌కు పంపగా కరస్పాండెంట్ రిలీవ్ చేయలేదని ఎంఈవో వెంకటేశ్వర్లు ఉన్నాతాధికారులకు తెలిపారు. దీంతో పనిచేయకుండానే వారంతా జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంఈవోలు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నం పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 01:02 AM