‘కుల’ కుట్రల రాజకీయం!
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:14 AM
గుడివాడలో ‘కుల’ రాజకీయాలు మొదలయ్యాయి. బలహీనవర్గాలను రెచ్చగొట్టేందుకు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కుట్ర రాజకీయాలకు దిగారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్‌ను తెరపైకి తెచ్చారు. బీసీ మహిళపై టీడీపీ దాడి చేసిందంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన, యాదవ సంఘం జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికకు అండగా ఉంటుందని ప్రకటించారు. బలహీన వర్గాలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇన్నాళ్లూ తటస్థంగా ఉన్న ఆయన సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడం వెనుక లోపాయకారి ఒప్పందం ఉందని ప్రచారం జరుగుతోంది. స్థానికంగా తెలుగుదేశం పార్టీలో ముసలం సృష్టించేందుకు దుష్ట పన్నాగాలు ఆరంభించారని తెలుస్తోంది.
- గుడివాడ నియోజకవర్గంలో బీసీలను రెచ్చగొట్టేందుకు నానీల కుతంత్రం
- మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్‌ను తెరపైకి తెచ్చి రాజకీయం
- కొడాలి నానిని కలిసి మద్దతు ప్రకటించిన ఈశ్వర్‌కుమార్
- బీసీ మహిళపై టీడీపీ దాడి అంటూ ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు
- జెడ్పీ చైర్‌పర్సన్ హారికకు యాదవ సంఘం మద్దతిస్తుందని ప్రకటన
- టీడీపీలో ముసలం సృష్టించేందుకు మరిన్ని క్షుద్ర రాజకీయాలు
గుడివాడలో ‘కుల’ రాజకీయాలు మొదలయ్యాయి. బలహీనవర్గాలను రెచ్చగొట్టేందుకు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కుట్ర రాజకీయాలకు దిగారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్‌ను తెరపైకి తెచ్చారు. బీసీ మహిళపై టీడీపీ దాడి చేసిందంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన, యాదవ సంఘం జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికకు అండగా ఉంటుందని ప్రకటించారు. బలహీన వర్గాలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇన్నాళ్లూ తటస్థంగా ఉన్న ఆయన సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడం వెనుక లోపాయకారి ఒప్పందం ఉందని ప్రచారం జరుగుతోంది. స్థానికంగా తెలుగుదేశం పార్టీలో ముసలం సృష్టించేందుకు దుష్ట పన్నాగాలు ఆరంభించారని తెలుస్తోంది.
విజయవాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి):
గుడివాడలో నీచమైన రాజకీయాలకు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఒడిగట్టారు. బలహీనవర్గాలలో గౌడ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో భౌతికంగా ఎలాంటి దాడి జరగలేదు. కానీ జెడ్పీ చైర్‌పర్సన్ భర్త ఉప్పాల రాము బూతు పురాణంతోనే వివాదం రేగింది. అతనిపై కూడా ఏ టీడీపీ కార్యకర్త దాడి చేయలేదు. కానీ, బీసీ మహిళపై దాడి జరిగిపోయిందంటూ కొత్త నాటకానికి తెరతీశారు. ఈ నాటకానికి సాక్ష్యాలుగా పలువీడియోలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుడివాడలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీనపరచటం కోసం నానీలు సరికొత్త రొచ్చు రాజకీయానికి దిగారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్‌ను తెర మీద పెట్టి బలహీనవర్గాలకు అన్యాయం జరిగిపోతుందన్న ప్రచారానికి మంగళవారం దిగారు. పెడనలో జరిగిన ‘బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ’ సమావేశం తర్వాత పేర్ని నాని, కొడాలి నాని ఆంతరంగిక సమాలోచనలు జరిపారు.
ప్రీ ప్లాన్డ్‌గా కఠారి ఎంట్రీ!
గుడివాడలో ఒకప్పుడు కొడాలి నానికి ప్రత్యర్థిగా పోటీ చేసిన కఠారి ఈశ్వర్‌కుమార్‌ను రంగంలోకి దించారు. ఏం మంత్రాంగం చేశారో తెలియదు కానీ, కఠారి ఈశ్వర్‌కుమార్ గుడివాడలో ప్రవేశం కూడా నానీల వ్యూహం ప్రకారమే జరిగినట్టుగా తెలుస్తోంది. గుడివాడలోకి కఠారి ఈశ్వర్‌కుమార్ ఎంట్రీ కూడా ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొడాలి నాని నివాసానికి వెళ్లి ఆయనను హత్తుకుని మరీ మద్దతు పలికారు. ఆ తర్వాత ఇద్దరూ చర్చించుకున్నారు. కుల సంఘాల నేతలతోనూ సమావేశం అయ్యారు. కొడాలి నాని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉండటంతో ఇద్దరూ కలిసి ఒకే కారులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కొడాలి నాని సంతకం చేసిన తర్వాత ఇద్దరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత కఠారి ఈశ్వర్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రెస్‌మీట్‌లో కఠారి ఈశ్వర్‌కుమార్ చాలా పరుషంగా మాట్లాడారు. చంద్రబాబు సతీమణికే ఆత్మాభిమానం ఉంటుందా ? బీసీ మహిళలకు ఉండదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణిని కొడాలి నాని విమర్శించినట్టు ఎక్కడా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని వ్యాఖ్యానించారు. బీసీ ప్రజాప్రతినిధిపై గుడివాడలో టీడీపీ గూండాలు అవమానకరంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. బీసీ జాతి అంతా హారికను సోదరిగా భావిస్తోందని, మీడియా ముందు మాట్లాడలేనంతగా ఆమెను దూషించారని ఆరోపించారు. వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు తాను అండగా ఉంటానని చెబుతూనే హారికకు యాదవ సంఘం మద్దతుగా నిలుస్తోందని ప్రకటించారు. ఇక్కడే అసలు విషయం దాగుంది. కఠారి ఈశ్వర్ కుమార్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో, టీడీపీలో కొనసాగిన ఆయన కొంత కాలంగా తటస్థంగా ఉంటున్నారు. ఇప్పుడు సడెన్‌గా గుడివాడకు ఈశ్వర్‌కుమార్ ఎంట్రీ ఇచ్చారు. కొడాలి నానికి కఠారి ఈశ్వర్‌కుమార్ మద్దతు తెలపటం వెనుక లోపాయకారి ఒప్పందం ఉందని తెలుస్తోంది.
బీసీ వర్గాలను తన వైపు తిప్పుకునేందుకే..
గుడివాడ నియోజకవర్గంలో దారుణ ఓటమిని చవిచూసిన కొడాలి నాని తాజాగా హారిక ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని ఆయా వర్గాలను తన వైపు తిప్పుకునేందుకే కఠారిఈశ్వర్ కుమార్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో కుల రాజకీయాలకు పరోక్షంగా నానీలు ఆజ్యం పోస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలకు 70 వేల ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత కాపు 28 వేల ఓట్లు, కమ్మ 12 వేల ఓట్లు ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్న బీసీ కులాలలో అత్యధికంగా ఇంచుమించు కాపులతో సమానంగా 25 వేల యాదవుల ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత గౌడ సామాజిక వర్గానికి సంబంధించి 17 వేల ఓట్లు ఉన్నాయి. కొప్పువెలమ ఏడు వేలు, కాళింగ నాలుగు వేలు, రజక నాలుగు వేలు చొప్పున, మిగిలిన ఇతర బీసీ కులాలకు కూడా చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉంది. హారిక ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని గౌడ సామాజిక వర్గాన్ని, కఠారి ఈశ్వర్ కుమార్‌ను అడ్డం పెట్టుకుని యాదవుల ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు నాని సాగించిన ఎత్తుగడగా అర్థమవుతోంది. బీసీ మహిళ హారికపై దాడి జరిగిందంటూ బీసీల్లో టీడీపీపై వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
కోవర్టులతో కుతంత్రాలు
గుడివాడ నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీలో ముసలం సృష్టించే పన్నాగాలకు కొడాలి నాని తెర వెనుక శ్రీకారం చుట్టారు. ఈ వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. టీడీపీలోని రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు వర్గాలతో కొడాలి నాని మంతనాలు సాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి ఎక్కడో ఒకచోట అధిష్టానం పుల్‌స్టాప్ పెట్టకపోతే పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉంది. గతంలో కొడాలి నాని దగ్గర పనిచేసిన కడియాల గణేష్, పొట్లూరి రవి వంటి వారు ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. ఒకప్పుడు వీరు నానికి అత్యంత ఆప్తులు. ఇప్పుడు కూడా నానికి ఆప్తులే అన్న ప్రచారం ఉంది. గుడివాడ ఎమ్మెల్యే కార్యాలయంలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ జరిగే పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు నానికి తెలిసిపోతాయని సమాచారం. తన కోవర్టులు అనేకమందిని రహస్యంగా ఉంచి టీడీపీలో ముసలం సృష్టించే ప్రయత్నాలు చేస్తుండటం కూడా ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగించే విషయం. ఒక వైపు కులాల కుంపట్లు, మరో వైపు టీడీపీలో ముసలం సృష్టించే కార్యక్రమాలకు కొడాలి నాని పరోక్షంగా తెరతీసినట్టు సమాచారం.
Updated Date - Jul 16 , 2025 | 01:14 AM