AP Political Parties: ఎస్‌ఐఆర్‌తో ప్రజాస్వామ్యానికి విఘాతం
ABN, Publish Date - Jul 25 , 2025 | 04:07 AM
బిహార్ తరహాలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ను రాష్ట్రాల్లో అమలుచేస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు.
2014 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలి
సీఈవోతో సమావేశంలో రాజకీయ పార్టీలు
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): బిహార్ తరహాలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ను రాష్ట్రాల్లో అమలుచేస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. 2002నాటి స్పెషల్ రివిజన్ కాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో జరిగిన ఎన్నికల ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. గురువారం అమరావతి సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో ఓటరు జాబితాల తయారీ, ఎన్నికల విధివిధానాలపై సూచనలు, సలహాల కోసం జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీల సమావేశాన్ని సీఈవో వివేక్‌యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరిగింది. సమావేశానికి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, ఏపీ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ రాజశేఖర్ హాజరయ్యారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘2002 ఎస్‌ఐఆర్‌ను పరిగణలోకి తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో, హైదరాబాద్ వలస వెళ్లిన ఆంధ్ర ప్రాంతం వారు తిరిగి ఇక్కడ ఓటు హక్కు పొందటం చాలా శ్రమతో కూడిన పని అవుతోంది. కాబట్టి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐఆర్‌ను అమలుచేసే పక్షంలో 2014 ఎన్నికల నాటి జాబితాలను పరిగణలోకి తీసుకోవాలి. అన్ని పార్టీ రాజకీయ పార్టీల సలహా, సంప్రదింపులతో మాత్రమే ఇది జరగాలి.
బీఎల్‌ఏలకు గుర్తింపు కార్డులిచ్చి, వారికి మండల, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇవ్వాలి. వీవీ ప్యాట్‌లో పార్టీ గుర్తింపు పెద్దగా చేసి, ఎక్కువ సేపు కనబడేలా ఉంచాలి. జీరో డోరు నంబరు విధానాన్ని రద్దు చేసి, తాత్కాలికంగా పక్కింటి డోరు నంబరుతో ఓటరు చిరునామా గుర్తింపు విధానాన్ని అమలు చేయాలి. ఓటర్ల సంఖ్యను బట్టి కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతిబూత్‌లో గరిష్ఠంగా 900 ఓట్లు ఉండేలా చూడాలి’ అని కోరినట్లు టీడీపీ నేతలు చెప్పారు. బీజేపీ నేత కిలారు దిలీప్ మాట్లాడుతూ... ఓటర్ల జాబితాను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. వైసీపీ నేత మల్లాది విష్ణు మాట్లాడుతూ... వీవీ ప్యాట్‌లపై అనుమానాలున్నాయని, వాటిని సమీక్షించాలని కోరామన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 04:12 AM