AP Govt : ఆ నిషేధం చెల్లదిక
ABN, Publish Date - Feb 21 , 2025 | 03:08 AM
జగన్ జమానాలో రాజకీయ ప్రత్యర్థులు, మాట వినని వారిని అదిరించి బెదిరించేందుకు భూములపై కుట్రలు చేశారు. వారి భూములను అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధ భూముల జాబితాలో చేర్చారు.
22(ఏ) నుంచి ప్రైవేటు భూములకు విముక్తి
మొత్తం సర్వే నంబర్ నిషేధ జాబితాలో వద్దు
ప్రైవేటు భూములకు సర్వే, సబ్‌డివిజన్ చేయాలి
ఆన్‌లైన్ విన్నపాలపై కలెక్టర్ కమిటీ పరిశీలన
రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా మార్గదర్శకాలు
హౌసింగ్ బోర్డు కాలనీలు, నివాస స్థలాలకూ స్వేచ్ఛ
స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికుల భూములకు విముక్తి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ జమానాలో రాజకీయ ప్రత్యర్థులు, మాట వినని వారిని అదిరించి బెదిరించేందుకు భూములపై కుట్రలు చేశారు. వారి భూములను అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధ భూముల జాబితాలో చేర్చారు. వారికి కంటిమీద కునుకులేకుండా చేసి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడ్డ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలా రాష్ట్రం అంతా కలిపి 38వేల ఎకరాలను 22(ఏ)(1)(ఇ) కేటగిరీలో చేర్చి వేధింపులను పరాకాష్ఠకు తీసుకెళ్లారు. ఇక ఆ వేధింపులకు కాలం చెల్లింది. ఆ భూములకు స్వేచ్ఛ లభించనుంది. అన్యాయంగా, అకారణంగా నిషేధ జాబితా 22(ఏ)లో చేర్చిన భూములు ఒక్క క్షణం కూడా అలా ఉండటానికి వీల్లేదని, వెంటనే స్వేచ్ఛ కల్పించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని, పట్టా, ప్రైవేటు భూములను 22(ఏ) నుంచి తొలగించాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మార్గదర్శకాలు జారీ చేశారు. వీటితోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికులు...ఇంకా అనాధీనం, షరతుగల పట్టా భూములపై లోగడ ఇచ్చిన ఉత్తర్వులు, మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని నిషేధ విముక్తి కల్పించాలని ఆయన ఆదేశించారు. దీంతో వేలాదిమంది సాగు భూములకు స్వేచ్ఛ లభించనుంది. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోబోతుందని ఈనెల 8వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ ’’నిషేధ భూములకు విముక్తి’’ శీర్షికన వార్తను ప్రచురించిన విషయం తెలిసిందే.
మార్గదర్శకాల్లోని కీలకాంశాలు...
ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములేవీ నిషేధ భూముల జాబితాలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి నిషేధ జాబితా 22(ఏ)(1)(ఇ)లో ఉన్న పట్టా భూములను తొలగించాలి.
కొన్ని భూముల్ని కాపాడే పేరిట సబ్ డివిజన్ చేయకుండానే మొత్తం సర్వే నంబర్‌ను నిషేధ జాబితాలో చేర్చారు. దీంతో ఆ సర్వే నంబర్‌లోనే ఉన్న పట్టా భూముల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి, ఒక సర్వే నంబర్‌లోని భూములను ప్రత్యేకంగా నిషేధ జాబితాలో చేర్చాలంటే, అందులో ఉన్న ఇతర ప్రైవేటు భూములను వేరుచేయాలి. సర్వేచేసి ఆ భూములను సబ్‌డివిజన్ చేయాలి. ఆ తర్వాతే 22(ఏ)లో చేర్చాలి.
తమ భూములను అన్యాయంగా నిషేధ జాబితాలో చేర్చారని, వాటికి మోక్షం కల్పించాలని రైతులు లిఖితపూర్వక విన్నపాలు ఇచ్చినా, లేదా ఆన్‌లైన్‌లో పిటిషన్ సమర్పించినా వాటిని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలన చేయాలి. ఆ రైతు తన వాదన వినిపించేందుకు తగిన సమయం ఇవ్వాలి. ఆ భూమిపై ఆర్‌డీవో నుంచి కమిటీ నివేదిక తెప్పించుకొని రైతు వాదన వినాలి. ఆ తర్వాతే ఆ భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించాలా? లేదా అన్నదానిపై జిల్లా కమిటీ నిర్ణయం తీసుకోవలి. అంతే తప్ప రైతుల వాదన వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు.
నిషేధ భూముల తొలగింపు, జాబితాను తాజా పరిచే అంశంపై జిల్లా కమిటీ తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు జిల్లా రిజిస్ట్రార్‌కు తెలపాలి.
ఏదైనా భూమిని పొరపాటుగా నిషేధ జాబితాలో చేర్చినట్లు గుర్తిస్తే దాన్ని 22(ఏ) నుంచి తొలగించడానికి జిల్లా కమిటీ సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి జాయింట్ కలెక్టర్ లాగిన్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో తగిన మార్పులు చేపట్టాలి అని రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా స్పష్టం చేశారు. అయితే, ఏ ఏ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలో లోగడ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉటంకిస్తూ వాటిపై నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వీటికి విముక్తి కల్పించాల్సిందే...
రాష్ట్రంలో 1954, జూన్ 18కి ముందు అసైన్ చేసిన భూములను 22(ఏ) నుంచి తొలగించాలని 2018, నవంబరు 16న ప్రభుత్వం ఇచ్చిన జీవో 575ను కలెక్టర్లు అమలుచేయాలి. అంటే, ఆ కేటగిరీలోకి వచ్చే భూములను సాధారణంగానే నిషేధ జాబితా నుంచి తొలగించాలి. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్లకు రిపోర్టు ఇవ్వాలి.
రైతులకు హక్కులు దక్కిన చుక్కల భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలి. 2022, మార్చి 23న ప్రభుత్వం ఇచ్చిన మెమో ఆధారంగా రైతులకు హక్కులు ఉన్న చుక్కల భూములను 22(ఏ) నుంచి తొలగించాలి.
రాష్ట్రంలో 1954, జూన్ 18కి ముందు అసైన్ చేసిన అనాధీన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలంటూ 2022, సెప్టెంబరు 26న ప్రభుత్వం ఇచ్చిన జీవో 649ను అమలు చేయాలి. ఈ కేటగిరీలోకి వచ్చే అనాధీనం భూములను నిషేధ జాబితా నుంచి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తొలగించాలి.
1954కు ముందు ఇచ్చిన షరతుగల పట్టా భూములను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలి.
ఇంటిస్థలాలు కూడా...
ప్రభుత్వం ప్రజల నివాసం కోసం హౌసింగ్ బోర్డు కాలనీలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం భూములు కేటాయించింది. ఆ తర్వాత వాటిని ప్రజలకు విక్రయించారు. అయితే, కాలక్రమేనా ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలి. కానీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు స్థలాలు, నివాస భూములను నిషేధ జాబితాలో కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అన్నమయ్య, పుట్టపర్తి తదితర జిల్లాల్లో ఈ సమస్య చాలా తీవరంగా ఉంది. రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా జిల్లాల పర్యటనకు వెళ్లిన ప్పుడు దీనిపై భారీగా పిటిషన్‌లు వస్తున్నాయి. ఇంటిస్థలాలు, హౌసింగ్‌బోర్డు భూములను ఇంకా నిషేధ జాబితాలో కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి, ఈ నేపఽథ్యంలో అలాంటి భూములను 22(ఏ) నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించినట్లు సిసోడియా ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ‘‘ప్రభుత్వం హౌసింగ్ బోర్డులకు ఇంటిస్థలాలు ఇచ్చింది. వాటిని ప్రజలు కొనుక్కున్నారు. ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆ భూములు ఇంకా 22(ఏ)లో ఉంచడం సరైంది. కాదు. ఆ రికార్డులను మార్చాలి. ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చాం’’ అన్నారు. ప్రజల సాగుభూములు, ఇంటిస్థలాలు ఏ కారణంతోనైనా నిషేధ జాబితాలో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
Updated Date - Feb 21 , 2025 | 03:08 AM