ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Velamavaripalem: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:31 AM

రేపల్లె అడ్డాగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న పేకాట శిబిరానికి ఆంధ్రజ్యోతి కథనంతో బ్రేక్‌ పడింది. పబ్లిక్‌గా పేకాట... మందు... విందులతో జూదగాళ్ల జోరు శీర్షికతో ఆంధ్రజ్యోతిలో మంగళవారం కథనం వెలువడింది.

  • జూదరుల అరెస్ట్‌.. శిబిరం సీజ్‌

  • వెలమవారిపాలెంలో పోలీస్‌ పికెట్‌

  • పరారీలో శిబిరం నిర్వాహకుడు

గుంటూరు, నగరం, జూలై 8(ఆంధ్రజ్యోతి): రేపల్లె అడ్డాగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న పేకాట శిబిరానికి ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో బ్రేక్‌ పడింది. ‘పబ్లిక్‌గా పేకాట... మందు... విందులతో జూదగాళ్ల జోరు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం కథనం వెలువడింది. దీంతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాపట్ల జిల్లా నగరం మండలంలోని వెలమవారిపాలెంలో కొద్ది రోజులుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. అక్కడ క్షణాల్లో లక్షాధికారులను భిక్షగాళ్లుగా మార్చే ‘కోత’ (కోసు) పందెం ఆటను ప్రధానంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పందెంరాయుళ్లు తరలివస్తున్నారు. చుట్టుపక్కలవారు దీనిని చూసినా.. వారికి అడిగే ధైర్యం లేదు....ఫిర్యాదు చేసే సాహసం లేదు. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించి 9 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్దనున్న నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. శిబిరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇకపై గ్రామంలో పేకాట జరక్కుండా చూసేందుకు ప్రత్యేకంగా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేస్తామని డీఎస్పీ చెప్పారు.

ఆడేదేమో రాత్రిపూట.. దాడులేమో పగలు

ఈ గ్రామంలో ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుం చి తెల్లవారుజామున 5 గంటల వరకు జూదం జోరుగా సాగుతుంది. సోమవారం రాత్రి కూడా సుమారు 90 మంది జూదరులు శిబిరానికి వచ్చి తెల్లారే వరకు మందు, విందు, పేకాటతో గడిపారు. అయితే పోలీసులు మంగళవారం పగటిపూట దాడులు చేసి, 9 మందిని అరెస్టు చేశామని ప్రకటించటాన్ని స్థానికులు నివ్వెరపోతున్నారు. దాడు ల సమయంలో మీడియాను కూడా అనుమతించలేదు.

అరెస్టులా.. డ్రామానా?

ఈ శిబిరం ప్రధాన నిర్వాహకుడైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఏలూరుపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి మాత్రం పోలీసులకు దొరకలేదు. ఇతను పేకాట శిబిరం ద్వారా వచ్చే సంపాదనతో రూ.5 కోట్ల విలువ చేసే భవనం నిర్మించుకున్నట్టు తెలిసింది. పోలీసులు మాత్రం అతడిని పట్టుకోవాలనే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వార్త రావడంతో నిర్వాహకుడితోపాటు జూదరులు కూడా అప్రమత్తమయ్యారు. దీంతో ‘ఈ ఒక్కరోజుకు ఆట ఆపుదాం’ అని నిర్వాహకుడు, జూదరులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయినా.. అక్కడ మంగళవారం కూడా జూదం జరిగినట్టు, 9 మంది పట్టుబడినట్లు పోలీసులు ప్రకటించటం విశేషం. నిర్వాహకుడే ఎవరో అనామకులను చూపించి, అరెస్టు డ్రామా నడిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రస్తుత గ్రామంలో జూద శిబిరాన్ని తాత్కాలికంగా మూసేసి, మరో గ్రామంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. రెండు రోజుల్లో మరో గ్రామాన్ని ఎంపిక చేసి లోకేషన్‌ షేర్‌ చేస్తానని నిర్వాహకుడు చెప్పినట్లు తెలిసింది.

జూదరుల అరెస్టు.. 25,670 స్వాధీనం

వెలమవారిపాలెంలో పేకాట శిబిరంపై దాడిచేసి తొమ్మిది మంది జూదరులను అరెస్టు చేశామని, వారి నుంచి రూ.25,670 స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు మంగళవారం విలేకరులకు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేకాట నిర్వహణ ప్రాంతంలోని గోడకు నోటీసులు అంటించామని చెప్పారు. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామని, ఎవరైనా పేకాట ఆడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Updated Date - Jul 09 , 2025 | 06:34 AM