AP High Court: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:25 AM
టీడీపీ నేతల హత్యకు సంబంధించిన కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేం
పిన్నెల్లి సోదరులకు స్పష్టం చేసిన హైకోర్టు
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతల హత్యకు సంబంధించిన కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్లపై విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పల్నాడుజిల్లా, వెల్దుర్తి మండలం, గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా హత్యలు జరిగాయన్నారు. తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ప్రోద్బలంతోనే హత్యలు జరిగాయన్నారు. పిటిషనర్ల నేరచరిత్రను పరిగణనలోకి తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. దీంతో పిన్నెల్లి తరఫు న్యాయవాది సమర్పించిన పెన్‌డ్రైవ్‌లోని అంశాల వాస్తవికత, ఘటన జరిగినప్పుడు పిటిషనర్లు మరోచోట ఉన్నట్లు చెబుతున్న అంశాలపై వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.
Updated Date - Jun 13 , 2025 | 04:26 AM