ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి
ABN, Publish Date - May 22 , 2025 | 11:27 PM
ఈ నెల 22 నుంచి జూన 21 వరకు యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ పి రంజిత బాషా అన్నారు.
క్యాంపెయినను విజయవంతంగా నిర్వహించాలి
ప్రతి రోజు యోగా కార్యక్రమాలు చేపట్టాలి
కలెక్టర్ పి.రంజిత భాషా
కర్నూలు కలెక్టరేట్, మే 22 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 22 నుంచి జూన 21 వరకు యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ పి రంజిత బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి యోగాంధ్ర క్యాంపెయిన అంశంపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి రోజు యోగాకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జూన 17న ఐదు వేల మందితో..
రాష్ట్ర ప్రభుత్వం జూన 22 వరకు ప్రతి రోజు ఒక జిల్లాలో ఒక థీమ్‌తో స్టేట్ ఈవెంటు యోగా సెషనను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. అందులో భాగంగా జూన 17న కర్నూలు జిల్లాలో ఐదు వేల మంది పారిశుధ్య కార్మికులతో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లుచే యాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. జూన 8న కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్లలోని మూడు ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లతో యోగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలను ఆదేశించారు. కొండారెడ్డి బురుజు వద్ద, ఓర్వకల్లు రాక్‌గార్డెన, నగరవనం, మంత్రాలయంలో మే 30, జూన 5, జూన 12, జూన 18వ తేదీల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మే 26 నుంచి 30వ తేదీ వరకు...
ప్రతి గ్రామంలో మే 26 నుంచి మే 30వ తేదీ వరకు ప్రతి గ్రామంలో వివిధ రకాల యోగా పోటీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జూన 2 నుంచి 7వ తేదీ వరకు మండల స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. జూన 9 నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు డీఈవో, డీఎస్‌డీవోలు నిర్వహిస్తారన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన ఉత్తమ జట్లు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తాయన్నారు. జూన 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రతి కేటగిరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేస్తారని కలెక్టర్ తెలిపారు. వీసీలో జేసీ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు సందీప్‌కుమార్, భరత, అన్ని మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 11:27 PM