Deputy CM Pawan Kalyan: సనాతన ధర్మం మతోన్మాదం కాదు
ABN, Publish Date - May 23 , 2025 | 05:06 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాకో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చెట్లతో పల్లెవనం చేసే అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రతి జిల్లాకో బయోడైవరిట్సీ పార్కు..
గ్రామానికో పల్లెవనం: పవన్ కల్యాణ్
విజయవాడ, మే 22 (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మం మతోన్మాదం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీ భూములను ఆక్రమించుకునే వారు ఉన్నారు కానీ.. చెట్లు లేని ప్రాంతంలో మొక్కలు నాటాలనే ఆలోచన ఏ ఒక్కరిలోనూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కనిపిస్తే కొందరికి ఆక్రమించుకోవాలనిపిస్తుందని... కానీ తనకు మాత్రం వైవిధ్యం నెలకొల్పాలనిపిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశాఖపట్నానికి చెందిన భూషన్ అనే ప్రకృతి సేవకుడిని చూపిస్తూ ‘మనకు సంబంధం ఉన్న ప్రదేశమైనా ఖాళీగా కనిపిస్తే అక్కడ విత్తనాలు, మొక్కలు నాటడం వృత్తిగా చేసుకున్న ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి’ అన్నారు. ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Updated Date - May 23 , 2025 | 05:07 AM