పంచాయతీలకు బకాయిల బండ!
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:09 AM
గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీలను బకాయిల బండ వేధిస్తోంది. డెవలప్‌మెంట్ చార్జీల కింద సీఆర్‌డీఏ నుంచి రూ.100 కోట్లపైనే బకాయి ఉంది. ఏళ్ల తరబడి ఈ బకాయిలు రాక గ్రామ పంచాయతీలు విలవిల్లాడుతున్నాయి. విస్తరిస్తున్న నిర్మాణ రంగానికి తగినట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నాయి. విధిలేని పరిస్థితుల్లో కలెక్టర్ లక్ష్మీశ దృష్టికి విషయం తీసుకెళ్లాయి. ఆయన సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.
- సీఆర్‌డీఏ నుంచి రావాల్సింది రూ.100 కోట్లపైనే..
- ఒక్క గొల్లపూడికే రూ.65 కోట్ల బకాయి
- పదేళ్లుగా పంచాయతీలకు డెవలప్‌మెంట్ చార్జీలు ఇవ్వని సీఆర్‌డీఏ
- ఈ జాబితాలో రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, గూడవల్లి, నిడమానూరు, గన్నవరం..
- ఇబ్రహీంపట్నం, కొండపల్లి , మైలవరానికి అందని డెవలప్‌మెంట్ చార్జీలు
- నిధులు లేక మౌలిక సదుపాయాలకు నోచుకోని గ్రామాలు
- కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేసిన గ్రామ పాలకవర్గాలు
- బకాయిలు చెల్లించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు కలెక్టర్ లేఖ
గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీలను బకాయిల బండ వేధిస్తోంది. డెవలప్‌మెంట్ చార్జీల కింద సీఆర్‌డీఏ నుంచి రూ.100 కోట్లపైనే బకాయి ఉంది. ఏళ్ల తరబడి ఈ బకాయిలు రాక గ్రామ పంచాయతీలు విలవిల్లాడుతున్నాయి. విస్తరిస్తున్న నిర్మాణ రంగానికి తగినట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నాయి. విధిలేని పరిస్థితుల్లో కలెక్టర్ లక్ష్మీశ దృష్టికి విషయం తీసుకెళ్లాయి. ఆయన సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత గ్రామాలుగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, గూడవల్లి, నిడమానూరు, గన్నవరం తదితర గ్రామాలు ఉన్నాయి. విజయవాడ నగరంతో సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఆయా గ్రామాల్లో నిర్మాణ రంగం ఊపందుకుంది. గ్రూప్ హౌస్‌లు, మల్టీస్టోర్డ్ బిల్డింగ్‌లు, భారీ అపార్ట్‌మెంట్లు వంటివి నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించి సీఆర్‌డీఏ వసూలు చేస్తున్న డెవలప్‌మెంట్ చార్జీలో స్థానిక గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన వాటా మొత్తాన్ని విడుదల చేయటం లేదు. దీంతో విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీలకు రూ.100 కోట్లు పైబడి సీఆర్‌డీఏ బకాయిలు పడింది. ఈ బకాయిలు 2016 నుంచి రావాల్సి ఉంది. చూస్తుండగానే కొండలా బకాయిలు పేరుకుపోయాయి. గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాల్లో ప్రధానంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామ పంచాయతీలకు సింహభాగం డెవలప్‌మెంట్ చార్జీలను సీఆర్‌డీఏ బకాయి పడింది. ఎన్‌హెచ్ - 65 వెంబడి ఉండే గొల్లపూడి గ్రామ పంచాయతీ, ఎన్‌హెచ్ - 16 వెంబడి ఉండే రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం గ్రామ పంచాయతీలు, ఎన్‌హెచ్ - 30 వెంబడి ఉన్న ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామ పంచాయతీలకు సీఆర్‌డీఏ అత్యధిక వాటా బకాయి పడింది.
భారీ నిర్మాణాలతో పెరుగుతున్న విస్తరణ
జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామాల్లో నిర్మాణ రంగం మిగిలిన వాటికంటే ఎక్కువుగా ఉంది. ఈ కారణం చేత భారీ గ్రూప్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు ఏర్పడుతున్నాయి. గొల్లపూడి గ్రామ పంచాయతీలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ నిర్మాణాలు వచ్చాయి. గొల్లపూడి నడిబొడ్డే కాకుండా శివారు ప్రాంతం కూడా భారీ నిర్మాణాలతో విస్తరించింది. ఈ కారణంగా ఒక్క గొల్లపూడి గ్రామపంచాయతీకే డెవలప్‌మెంట్ చార్జీల కింద సీఆర్‌డీఏ రూ. 65 కోట్ల మేర బకాయి పడింది. సింహభాగం వాటా ఒక్క గొల్లపూడి గ్రామ పంచాయతీకే బకాయి పడింది. 2016 నుంచి ఈ బకాయిలు రావాల్సి ఉంది. గొల్లపూడి మేజర్ గ్రామ పంచాయతీ కావటంతో ఆర్థిక వనరులు కలిగి ఉండటంతో ... గత పదేళ్లుగా తన పరిధిలో స్థానికంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. గొల్లపూడి పంచాయతీకి ఎన్నికలు జరగకపోవటంతో .. ఫైనాన్స్ గ్రాంట్స్ కూడా రావటం లేదు. దీంతో గ్రామపంచాయతీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భారీ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నా మౌలిక సదుపాయాలు కల్పించరా అంటూ పంచాయతీ అధికారులను నిలదీస్తున్నారు. బకాయిలలో కనీసం రూ. 15 కోట్లు అయినా వచ్చినా .. అత్యవసర మౌలిక సదుపాయాలు చేపట్టాలని గొల్లపూడి గ్రామ పంచాయతీ భావిస్తోంది. రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, గూడవల్లి, గన్నవరం ప్రాంతాలకు కలిపి రూ.10 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఈ విషయం గ్రామ పంచాయతీల పాలకవర్గాలు కలెక్టర్ లక్ష్మీశ దృష్టికి ఇటీవల తీసుకువచ్చాయి. గ్రామ పంచాయతీలకు బకాయిలు ఉన్న డబ్బులను తక్షణం విడుదల చేయాల్సిందిగా సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబుకు కలెక్టర్ లక్ష్మీశ లేఖ రాశారు. సీఆర్‌డీఏ నుంచి బకాయిలు వస్తాయేమోనని గ్రామ పంచాయతీలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి.
రిజిస్ర్టేషన్ శాఖ నుంచి ట్రాన్స్‌ఫర్ డ్యూటీ నిల్
గ్రామ పంచాయతీ పరిధిలోని ఆస్తులకు సంబంధించి జరిగిన రిజిస్ర్టేషన్లకు ట్రాన్స్‌ఫర్ డ్యూటీ (టీడీ) కూడా ఇప్పటి వరకు ఏ పంచాయతీలకు జమ కావటం లేదు. గొల్లపూడి మేజర్ గ్రామ పంచాయతీకి రూ.2.50 కోట్ల మేర టీడీ బకాయిలు రావాల్సి ఉన్నాయి. మిగిలిన గ్రామ పంచాయతీలకు కూడా రూ.కోట్లలో కాకపోయినా రూ. లక్షలలోనైనా రావాల్సి ఉంది.
సమస్యలను ఎలా పరిష్కరించగలం
మా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణ రంగం పతాక స్థాయిలో ఉంది. సీఆర్‌డీఏకు పెద్ద మొత్తంలో డెవలప్‌మెంట్ చార్జీల రూపేణా ఆదాయం వస్తోంది. గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన డెవలప్‌మెంట్ చార్జీలు కూడా ఇవ్వటం లేదు. ఎప్పటి నుంచో ఈ డబ్బులను ఇవ్వమని అడుగుతున్నా స్పందన లేదు. రూ. 65 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. గ్రామంలో ఏం చేయాలన్నా.. చేయలేకపోతున్నాం. జాతీయ రహదారి వెంబడి ఉండటం వల్ల వాటి పారిశుధ్య నిర్వహణ అంతా కూడా ఆయా పంచాయతీలే నిర్వహిస్తున్నాయి. పంచాయతీల పరిధిలో ఎన్నో సమస్యలుంటాయి. ఆ సమస్యలను పరిష్కరించాలంటే డబ్బులు కావాలి. మా పంచాయతీ ఉత్తమ అవార్డు సాధించింది. ఇలాంటి పంచాయతీని నిర్లక్ష్యంగా వదిలేస్తే మాకే చెడ్డపేరు వస్తుంది. ఉత్తమ పంచాయతీకైనా బకాయిలు ఇవ్వాలనిపించటం లేదు. ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకుని సీఆర్‌డీఏ నుంచి బకాయిలను ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
- బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్
Updated Date - Aug 04 , 2025 | 01:09 AM