TDP Leader Lavu Srikrishna Devaraya: పహల్గాం.. భారత్ ఆత్మపై దాడి
ABN, Publish Date - Jul 29 , 2025 | 06:29 AM
పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని భారత్ ఆత్మపై జరిగిన దాడి’’గా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అభివర్ణించారు. పహ ల్గాం ఉగ్రదాడి యుద్ధం కాదు.
కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు
ఆపరేషన్ సిందూర్ దేశ దృఢసంకల్పానికి నిదర్శనం
లోక్‌సభ చర్చలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు
న్యూఢిల్లీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ‘‘భారత్ ఆత్మపై జరిగిన దాడి’’గా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అభివర్ణించారు. పహ ల్గాం ఉగ్రదాడి ‘‘యుద్ధం కాదు. ఊచకోత. పౌరుల మతవిశ్వాసాల ఆధారంగా ఎంచుకుని వారి కుటుంబసభ్యుల ముందే కాల్చిచంపారు’’ అని చెప్పారు. సోమవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి కశ్మీర్‌లోని శాంతిని, పర్యాటక అభివృద్ధిని ధ్వంసం చేసిందన్నారు. రాత్రికి రాత్రే అక్కడ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రతీకార చర్య కాదని, దేశ విలువలు, సంయమనం, దృఢసంకల్పానికి నిదర్శనమని కొనియాడారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51ని ఉటంకిస్తూ ‘‘ఉగ్రవాదం సరిహద్దులను దాటినప్పుడు, స్వీయ రక్షణ కేవలం హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం అవుతుంది’’ అని పేర్కొన్నారు. క్లిష్టసమయాల్లో భారత్ ఏమిచేయగలదో ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి తెలియజేసిందన్నారు. సమయం కోసం భారత్ వేచిచూస్తుంది కానీ ఉగ్రదాడులను ఎన్నటికీ మర్చిపోదనే సందేశాన్ని పాక్‌కు పంపిందని చెప్పారు. ప్రధాని మోదీ దృఢమైన, ధైర్యవంతమైన నాయకత్వంతో సిందూర్ విజయవంతమైందని తెలిపారు. సిందూర్ తర్వాత మన దేశ ఏడు దౌత్య బృందాలు 32 దేశాలను సందర్శించి ఒకే స్వరంతో, పార్టీలకతీతంగా మాట్లాడాయని తెలిపారు. మనం దలైలామాకు ఆశ్రయమిస్తే పాక్ మాత్రం ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందని, భారత్ ఉపాధ్యాయులు, సాంకేతికతను ఎగుమతి చేస్తే పాక్ ఉగ్రవాదులను ఎగుమతి చేసిందని చెప్పారు. దేశ జాతీయ భద్రతను బలోపేతం చేయడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి నాయకత్వం వహించేందుకు కేంద్రానికి శ్రీకృష్ణదేవరాయలు సూచనలు చేశారు. ఉగ్రవాదాన్ని నిర్వచించేలా ఐరాసాపై ఒత్తిడి తేవాలని, ఇందుకోసం చేపట్టే కార్యక్రమాలకు భారత్ నాయకత్వం వహించాలని కోరారు.
Updated Date - Jul 29 , 2025 | 06:33 AM