Padma Awards 2025: మందకృష్ణకు పద్మశ్రీ
ABN, Publish Date - May 28 , 2025 | 05:51 AM
రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల రెండో విడత కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా 68 మందికి
పద్మ పురస్కారాల ప్రదానం.. ఏపీ నుంచి ఇద్దరికి..
న్యూఢిల్లీ, మే 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ, ఆర్థికశాస్త్రం, సంస్కృత పండితుడు వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి.. పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకున్నారు. 2025కి గాను కేంద్ర ప్రభుత్వం 139 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో 7 పద్మ విభూషణ్, 11 పద్మభూషణ్, 113 పద్మశ్రీ ఉన్నాయి. తొలి విడతగా ఏప్రిల్ 28న నిర్వహించిన కార్యక్రమంలో డి.నాగేశ్వర్ రెడ్డి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సహా 71 మంది పద్మ పురస్కారాలను అందుకున్నారు. మిగిలిన 68 మందికి మంగళవారం నిర్వహించిన రెండో విడత కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ముగ్గురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 56 మందికి పద్మశ్రీ ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ పద్మవిభూషణ్, ప్రముఖ సినీ నటి, భరతనాట్య కళాకారిణి శోభన, కన్నడ సినీ నటుడు అనంతనాగ్, విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం దుర్గావాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు సాధ్వి రితంబర పద్మభూషణ్ అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్, అవార్డు గ్రహీతలు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ తన అవిశ్రాంత పోరాటంతో ఎస్సీ ఉపవర్గీకరణను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆమోదించడంలో కీలకపాత్ర పోషించారని అవార్డుతోపాటు అందజేసిన ప్రశంసాపత్రంలో రాష్ట్రపతి భవన్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 05:53 AM