DGP Harish Kumar Gupta: తప్పిపోయిన బాలికల కోసం ఆపరేషన్ ట్రేస్
ABN, Publish Date - Aug 01 , 2025 | 05:45 AM
ప్పిపోయిన బాలికల్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు నెలరోజుల పాటు రాష్ట్రంలో ‘ఆపరేషన్ ట్రేస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు.
వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం
ఈనెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అమలు: డీజీపీ
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): తప్పిపోయిన బాలికల్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు నెలరోజుల పాటు రాష్ట్రంలో ‘ఆపరేషన్ ట్రేస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. తల్లిదండ్రుల వద్దకు ఆడబిడ్డల్ని చేర్చడమే లక్ష్యంగా ఉమెన్ సేఫ్టీ విభాగం ఆగస్టు 1 నుంచి 31 వరకూ ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. క్షేత్రస్థాయి పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీసీటీఎన్‌ఎస్, వత్సలా పోర్టల్, ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తిస్తామని చెప్పా రు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రెడ్ లైట్ ఏరియాల్లో తనిఖీలు చేసి గుర్తించిన బాలికల్ని మహిళా పోలీసుల ద్వారా చైల్డ్ వెల్ఫేర్ కమిటీల సహకారంతో కుటుంబ సభ్యుల వద్దకు చేరుస్తామన్నారు. కేసులు నమోదు చేయాల్సి వస్తే చేస్తామన్నారు. మిస్సింగ్‌కు కారణాలు తెలుసుకుని కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు విద్యాభ్యాసం, నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ పథకాల ద్వారా భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని డీజీపీ వివరించారు. ఎవరి కుటుంబాల్లోనైనా బాలికలు తప్పిపోయి ఉంటే ఆ కుటుంబసభ్యులు 112 లేదా 1098 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. శక్తి వాట్సాప్(7993485111) ద్వారా బాలిక ఫొటోతో సంప్రదించవచ్చని సూచించారు. ప్రతి పాఠశాలలో ఐదుగురు బాలికల్ని శక్తి వారియర్స్‌గా ఎంపిక చేసి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మరక్షణపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల ఏడీజీ మధుసూదన్‌రెడ్డి, ఐజీ రాజకుమారితో కలిసి ‘ఆపరేషన్ ట్రేస్’ పోస్టర్‌ను డీజీపీ గుప్తా విడుదల చేశారు.
Updated Date - Aug 01 , 2025 | 05:46 AM