ఓపెన్ స్కూల్ పరీక్షల దందా!
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:17 AM
జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగదు చెల్లిస్తే పాస్ గ్యారంటీ అంటూ ప్రైవేటు స్కూల్, ట్యుటోరియల్స్ యజమానులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఒక్కో సబ్జెక్టుకు రూ.2 వేల వరకు వసూలు చేసి మరీ ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇన్విజలేటర్ల నియామకంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షా పత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, వాటికి జవాబులు రాసి విద్యార్థులకు అందజేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- నగదు చెల్లిస్తే పాస్ గ్యారంటీ అంటూ ప్రైవేటు స్కూల్, ట్యుటోరియల్స్ భరోసా
- ఒక్కో సబ్జెక్టుకు రూ.2 వేల వరకు వసూలు!
- ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణలో అమలు
- ఇన్విజలేటర్లు, పరీక్షా కేంద్రాలు ప్రత్యేకంగా ఎంపిక
- జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కనుసన్నల్లో ఈ తతంగం!
జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగదు చెల్లిస్తే పాస్ గ్యారంటీ అంటూ ప్రైవేటు స్కూల్, ట్యుటోరియల్స్ యజమానులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఒక్కో సబ్జెక్టుకు రూ.2 వేల వరకు వసూలు చేసి మరీ ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇన్విజలేటర్ల నియామకంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షా పత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, వాటికి జవాబులు రాసి విద్యార్థులకు అందజేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెలలో జరిగాయి. ప్రస్తుతం ఈ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి రెగ్యులర్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు వారు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేమని చెప్పడంతో జిల్లా విద్యాశాఖ అధికారులకే ఈ బాధ్యతలను అప్పగించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో మరో రెండు గదులను అదనంగా కేటాయించి అక్కడ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లా నుంచి 2,341 మందికి గాను 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు పూర్తి చేశారు. జిల్లాలో పదో తరగతి ఓపెన్ స్కూల్స్ పరీక్షలకు వెయ్యి మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం 23 పరీక్షా కేంద్రాలను జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ప్రస్తుతం ఏర్పాటు చేశారు.
పాస్ గ్యారంటీ అని చెప్పి..
ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి జిల్లాలోని వివిధ ప్రైవేటు స్కూల్, ట్యుటోరియల్స్ నడిపేవారు ముందస్తుగానే గ్యారంటీ పాస్ పేరుతో నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ విభాగాల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తూ పదోన్నతుల కోసం కొంత మంది, వివిధ అవసరాల నిమిత్తం మరికొంతమంది, సర్టిఫికెట్ల కోసం ఇంకొంతమంది ఇంటర్మీడియట్, పదో తరగతులను ఓపెన్ స్కూల్ ద్వారా పూర్తి చేసేందుకు ముందుకు వస్తున్నారు. వీరికి సబ్జెక్టుకు ఇంత, పరీక్ష ఫీజు ఇంత అని ముందుగానే చెప్పి ఒక్కో సబ్జెక్టుకు కనీసంగా రెండు వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పరీక్షలు సక్రమంగా రాయకున్నా జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే సమయంలోనైనా తమదైన శైలిలో పాస్ చేయిస్తామని నమ్మబలికి నగదు వసూలు చేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది.
చక్రం తిప్పుతున్న విద్యాశాఖ కార్యాలయంలోని కాంట్రాక్టు ఉద్యోగి
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగి కనుస్నల్లో పదో తరగతి ఓపెన్ స్కూల్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ఇన్విజలేటర్ల నియామకం జరుగుతున్నట్లు సమాచారం. ప్రైవేటు స్కూల్స్ యజమానులకు, విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే అధికారులకు మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడుకాకుండా సాగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ పరీక్షల మాదిరిగా, ఓపెన్ స్కూల్ పరీక్షలను అధికారులు అంతగా పట్టించుకోకపోవడంతో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే నడుస్తోంది. పరీక్షా పత్రాలను బయటకుతెచ్చి త్వరితగతిన వాటికి జవాబులు రాసి, తిరిగి ఓపెన్‌స్కూల్ పదోతరగతి పరీక్షా కేంద్రాలకు గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకుని తమ పనిని పూర్తి చేస్తుండటం గమనించదగ్గ అంశం. ఈ అంశంపై విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్‌రాజును వివరణ కోరగా గతంలో ఏవైౖనా తప్పులు జరిగితే జరిగి ఉండవచ్చని, కృష్ణాజిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి ఓపెన్‌స్కూల్స్ పరీక్షలలో ఎలాంటి మాస్‌కాపీయింగ్ జరగడానికి అవకాశమే లేదని చెప్పారు.
Updated Date - Mar 19 , 2025 | 01:17 AM