పైసలిస్తేనే..
ABN, Publish Date - Jul 15 , 2025 | 01:41 AM
వీఎంసీ ఆడిట్ విభాగం అవినీతిమయంగా మారింది. పైసలివ్వకపోతే ఫైల్ కదిలే పరిస్థితి లేకుండా పోయింది. కార్పొరేషన్‌లో జరిగే అభివృద్ధి పనులతోపాటు ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించి ఆడిట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ క్లీన్ చిట్ ఇస్తేనే ఫైల్ ముందుకు సాగుతుంది. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి ఫైల్ ఆడిట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే బిల్ అవుతుంది. లేకపోతే పెండింగ్‌లో ఉండిపోతుంది.
- ఆడిట్ విభాగంలో ఫైల్ కదిలేది!
- ఏళ్ల తరబడి పాతకుపోయిన జూనియర్ అసిస్టెంట్
- ప్రమోషన్ ఉన్నా కదలని సీనియర్ అసిస్టెంట్
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
వీఎంసీ ఆడిట్ విభాగం అవినీతిమయంగా మారింది. పైసలివ్వకపోతే ఫైల్ కదిలే పరిస్థితి లేకుండా పోయింది. కార్పొరేషన్‌లో జరిగే అభివృద్ధి పనులతోపాటు ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించి ఆడిట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ క్లీన్ చిట్ ఇస్తేనే ఫైల్ ముందుకు సాగుతుంది. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి ఫైల్ ఆడిట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే బిల్ అవుతుంది. లేకపోతే పెండింగ్‌లో ఉండిపోతుంది.
(ఆంధ్రజ్యోతి, కార్పొరేషన్):
నగరంలో జరిగే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు, వీఎంసీ ఆదాయం తదితర వాటిని క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు ఆడిట్ ద్వారా పరిశీలన చేసి నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఆడిట్ విభాగం. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ విభాగంలో ఇటీవల కాలంలో అవినీతిమయం అయ్యింది. ఈ అవినీతి వివిధ రూపాల్లో కనిపిస్తోంది. నగరపాలక సంస్థలో వివిధ విభాగాల నుంచి వచ్చిన బిల్లులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉండగా, ఆ విధంగా జరగటంలేదు. ఆయా విభాగాల నుంచి వచ్చే మామూళ్లు, కాంట్రాక్టర్ల నుంచి అందే ముడుపులకు లాలూచీపడి పూర్తి స్థాయిలో చెక్ చెయ్యకుండా బిల్లులు ఆడిట్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం, ప్రజారోగ్యం తదితర వాటిలో కాంట్రాక్టర్లు , అధికారులు పెట్టిన బిల్లులు కల్పిత ఖర్చులు చూపిస్తున్న వారిచే ముడుపులు తీసుకొని ఆడిట్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల బుడమేరు వరదలకు సంబంధించి పలు బిల్లులు కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టానుసారం పెట్టగా, ఎటువంటి పరిశీలన లేకుండా ఆడిట్‌లో ఓకే చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ ఇద్దరు అక్కడ నుంచి కదలరు
ఆడిట్ విభాగంలో ఓ జూనియర్ అసిస్టెంట్ సుమారు 10 ఏళ్లుగా ఆడిట్ విభాగంలో పని చేస్తున్నారు. క్లాస్ ఫోర్ నుంచి అక్కడ పని చేసి జూనియర్ అసిస్టెంట్ పదోన్నతి పొంది అదే విభాగంలో కొనసాగున్నారు. అలాగే మరో సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ప్యానల్‌లో ఉన్నా తీసుకోవటం లేదు. ఆడిట్ విభాగంలోనే తిష్ట వేసుకొని కూర్చున్నారు. వీరిరువురు ఎందుకు అక్కడ నుంచి కదలటంలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆడిట్ విభాగంలో వీరిరువురు తప్ప వేరే సిబ్బంది పని చెయ్యలేరా.. ! వీఎంసీలో పని చేసే వేరే సిబ్బందికి అర్హత లేదా..! లేకపోతే లెక్కలు రావని వీరిరువురినే కొనసాగిస్తున్నారనేది ఆ విభాగం అధికారులకు, కమిషనర్‌కు మాత్రమే తెలియాలి. వీఎంసీలో పని చేసే ప్రతి ఒక్కరూ అన్ని విభాగాల్లో పని చేస్తే వారి నైపుణ్యాన్ని పెంచుకోగలరు. కానీ కొందరు అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు వారు తప్ప ఇక్కడ ఎవరు పని చెయ్యలేరు అన్నట్టుగా చెప్పి కమిషనర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి వీఎంసీలో సిబ్బంది అన్ని విభాగాల్లో రోటేషన్ పద్ధతిలో పని చేసేలా చూస్తే అన్ని విభాగాలపై సిబ్బందికి అవగాహన ఉంటుంది.
Updated Date - Jul 15 , 2025 | 01:41 AM