AP Gold Award: ఓడీవోపీ లో ఏపీకి గోల్డ్
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:06 AM
ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌కు గోల్డ్ అవార్డు దక్కింది. సోమవారం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రతిష్ఠాత్మక ఓడీఓపీ-2024 అవార్డులను ప్రదానం చేశారు.
జిల్లా స్థాయిలో మరో 9 జాతీయ అవార్డులు
ఢిల్లీలో అందుకున్న మంత్రి సవిత, కలెక్టర్లు
న్యూఢిల్లీ, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌కు గోల్డ్ అవార్డు దక్కింది. సోమవారం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రతిష్ఠాత్మక ఓడీఓపీ-2024 అవార్డులను ప్రదానం చేశారు. విదేశాల్లోని భారత మిషన్లు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలు అనే మూడు విభాగాల్లో మొత్తం 34 అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రాల కేటగిరిలో మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అవార్డును అందుకుంది. జిల్లాల విభాగంలో వ్యవసాయ కేటగిరిలో గుంటూరు(మిర్చి) గోల్డ్ అవార్డును, శ్రీకాకుళం(జీడిపప్పు) కాంస్య అవార్డును అందుకున్నాయి. వ్యవసాయేతర ఉత్పత్తుల కేటగిరిలో బాపట్ల(చీరాల సిల్క్ చీరలు(కుప్పడం)), విజయనగరం(బొబ్బిలి వీణ), తిరుపతి(వెంకటగిరి కాటన్ చీరలు) గోల్డ్ అవార్డును, శ్రీసత్యసాయి(ధర్మవరం సిల్క్ చీరలు) రజత అవార్డును, అనకాపల్లి(ఏటికొప్పాక బొమ్మలు), కాకినాడ(పెద్దాపురం సిల్క్స్) కాంస్య అవార్డును, పశ్చిమగోదావరి(నరసాపూర్ క్రోచెట్ లేస్‌లు) ప్రత్యేక ప్రశంస అవార్డును అందుకున్నాయి. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత, ఆయా జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమం అనంతరం ఏపీ భవన్‌లో మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధిపథం వైపు దూసుకుపోతున్న రాష్ట్రంవైపు దేశం యావత్తూ చూస్తోందని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్న స్పందిస్తూ.. ‘రైతుల సంకల్పం, అధికారుల కృషి కలిసి ఓ గొప్ప విజయాన్ని సాధించాయి’ అని ప్రశంసించారు.
Updated Date - Jul 15 , 2025 | 05:07 AM