Rainfall Deficit: ముఖం చాటేసిన నైరుతి
ABN, Publish Date - Aug 01 , 2025 | 04:21 AM
నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే నైరుతి సీజన్ సగం ముగిసిపోయింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా ఏపీలోని సగం ప్రాంతంలో వర్షాభావం నెలకొంది.
సగం ముగిసిపోయిన సీజన్
రాష్ట్రంలో సాధారణం కంటే 25శాతం తక్కువ వర్షపాతం నమోదు
సగం మండలాల్లో వర్షాభావం
విశాఖపట్నం, జూలై 31(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే నైరుతి సీజన్ సగం ముగిసిపోయింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా ఏపీలోని సగం ప్రాంతంలో వర్షాభావం నెలకొంది. ఖరీ్‌ఫలో విత్తనాలు నాటేందుకు జూన్, జూలై నెలలు కీలకం. అయితే రుతుపవనాల ప్రారంభం, మధ్యలో కొన్ని రోజులు తప్ప మిగిలిన రోజుల్లో వర్షాలు లేకపోగా తీవ్ర ఎండలతో వాతావరణం కొనసాగింది. రుతుపవనాలు ముందుగానే వచ్చినప్పటికీ జూన్ రెండో వారం వరకూ వర్షాల జాడ లేదు. ఆ తరువాత కూడా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు కోస్తాలో ఒకటి, రెండు రోజులు వర్షాలు కురిశాయి తప్ప రాయలసీమలో వర్షాభావం కొనసాగింది. జూలైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పంటలు ఎండిపోయాయి. విచిత్రంగా గోదావరి, కృష్ణా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురవడంతో తుంగభద్ర, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోయాయి. గోదావరి డెల్టాలో పుష్కలంగా నీరు అందుతోంది. నాగావళి, వంశధార నదులకూ వరద వచ్చింది.
రాయలసీమ అన్నదాతల్లో గుబులు
జూన్ 1 నుంచి గురువారం నాటికి ఏపీలో 255.7 మి.మీ.కు గాను 191.4 మి.మీ. వర్షపాతం (సాధారణం కంటే 25.1ు తక్కువ) నమోదైంది. మొత్తం 670 మండలాల్లో 55 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ, 255 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 296 మండలాల్లో సాధారణం కంటే తక్కువ, మరో 64 మండలాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. కోస్తాలోని 174 మండలాల్లో సాధారణం కంటే తక్కువ, మరో 4 మండలాల్లో చాలా తక్కువ, రాయలసీమలో 116 మండలాల్లో తక్కువ, 46 మండలాల్లో చాలా తక్కువగా వర్షపాతం నమోదైంది. కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడకపోవడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
గత పదేళ్లలో ఇప్పుడే తక్కువ వర్షం
జూన్, జూలైల్లో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనాలు తప్పాయి. నైరుతి సీజన్ తొలి రెండునెలల్లో ఈ ఏడాది పడినంత తక్కువ వర్షాలు గత పదేళ్లలో లేవని గుర్తుచేస్తున్నారు. తొలి 2నెలల లెక్కల ప్రకారం 2015లో సాధారణం కంటే 41ు ఎక్కువ (రాయలసీమలో వర్షాభావం), 2016లో 34ు, 2017లో 7ు, 2018లో 8ు (రాయలసీమలో తక్కువ వర్షాలు), 2019లో 16ు (కోస్తా, రాయలసీమలోని పలు మండలాల్లో వర్షాభావం), 2020లో 55ు, 2021లో 34ు, 2022లో 17ు, 2024లో 34ు ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే 2023లో మాత్రం 6ు తగ్గింది. ఈ ఏడాది ఏకంగా 25ు తక్కువగా నమోదైంది. నైరుతి సీజన్ ద్వితీయార్థం ఆగస్టు, సెప్టెంబరుల్లో మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశతో ఉన్నారు. రుతుపవనాల తీరులోనే మార్పులు చోటుచేసుకుంటున్నట్టు విశ్రాంత వాతావరణ అధికారి కృష్ణభగవానుడు వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో వరదలు, మరోచోట వర్షాభావం కొనసాగుతున్నాయని చెప్పారు. వాతావరణంలో మార్పులు, ప్రకృతి విధ్వంసంతో ఐఎండీ అంచనాలు ఒక్కోసారి తప్పుతుంటాయని తెలిపారు. భవిష్యత్తులో వర్షం తీరు మరింత మారుతుందని ఆయన విశ్లేషించారు.
ఉత్తర కోస్తాలో తక్కువ వర్షపాతం
ఆగస్టులో ఉత్తర కోస్తాలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు దానికి ఆనుకుని కృష్ణా జిల్లా వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తాజా బులెటిన్‌లో తెలిపింది. ఈ నెలలో ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది.
Updated Date - Aug 01 , 2025 | 04:23 AM