Telugu Leaders: ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు గవర్నర్లు
ABN, Publish Date - Jul 15 , 2025 | 06:24 AM
గవర్నర్లుగా పనిచేసే అవకాశం చాలా తక్కువ మందికే లభిస్తుంది. అటువంటిది ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు ఇద్దరు నాయకులు గవర్నర్లు కావడం విశేషం.
ఒడిసాలో కంభంపాటి హరిబాబు, గోవా వెళ్లనున్న అశోక్
విశాఖపట్నం, జూలై 14(ఆంధ్రజ్యోతి): గవర్నర్లుగా పనిచేసే అవకాశం చాలా తక్కువ మందికే లభిస్తుంది. అటువంటిది ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు ఇద్దరు నాయకులు గవర్నర్లు కావడం విశేషం. బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ప్రస్తుతం ఒడిసా గవర్నర్‌గా ఉన్నారు.ఇప్పుడు టీడీపీ నేత అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. హరిబాబు ఆంధ్ర వర్సిటీలో చదువుకోవడానికి విశాఖ వచ్చి అదే సంస్థలో అధ్యాపకుడిగా పనిచేశారు. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడుల పరిచయంతో రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో కీలకంగా పనిచేశారు. 1999లో విశాఖ-1 నుంచి పోటీ చేసి గెలుపొందారు.2014లో విశాఖ ఎంపీగా..వైఎస్ జగన్ తల్లి విజయలక్ష్మిపై విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. 2021 జూలై 19న మిజోరం గవర్నర్‌గా నియమితులైన ఆయన గత ఏడాది డిసెంబరు 26న ఒడిసాకు బదిలీ అయ్యారు. విజయనగరం సంస్థానాధీశుడైన అశోక్‌గజపతిరాజు.. సింహాచలం సహా పలు దేవస్థానాలకు వంశపారంపర్య ధర్మకర్త. ఆయన పౌరవిమానయాన మంత్రిగా ఉన్నప్పుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి కృషిచేశారు.
Updated Date - Jul 15 , 2025 | 06:26 AM