పేర్ని, అనిల్‌పై రేపటి వరకు చర్యలొద్దు: హైకోర్టు
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:44 AM
వైసీపీ నేతలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్(పామర్రు మాజీ ఎమ్మెల్యే)లపై గురువారం వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్(పామర్రు మాజీ ఎమ్మెల్యే)లపై గురువారం వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై పామర్రు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఇరువురూ వేసిన క్వాష్ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ వై.లక్ష్మణరావు విచారణ జరిపారు. ఈ కేసులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తారని, అనారోగ్య కారణాల వల్ల ఆయన విచారణకు హాజరుకాలేకపోయారని ఏపీపీ నీలోత్పల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ.. తదుపరి విచారణ వరకు పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారని, చెప్పకుండా నరికేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మచిలీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
Updated Date - Jul 23 , 2025 | 04:45 AM