Andhra Pradesh: మన ఉత్పత్తులకు గ్లోబల్ డిమాండ్ లక్ష్యం
ABN, Publish Date - May 28 , 2025 | 05:57 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోలు, పాదరక్షల పరిశ్రమ అభివృద్ధికి లెదర్ & ఫుట్‌వేర్ పాలసీ 4.0ను ప్రకటించింది. చిన్న, పెద్ద పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, శిక్షణ సబ్సిడీలు వంటి అనేక ప్రోత్సాహకాలు అందించనుంది.
లెదర్ అండ్ ఫుట్‌వేర్ పాలసీ 4.0 విడుదల
కొత్త ఎంఎ్‌సఎంఈ యూనిట్లకు 12 కోట్ల వరకు..
విస్తరణ ప్రాజెక్టుకు 10 కోట్ల వరకు రాయితీ
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పలు ప్రోత్సాహకాలు
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తోలు, పాదరక్షల పరిశ్రమల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. లెదర్ అండ్ ఫుట్‌వేర్ పాలసీ (4.0)ని ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయాల్లో అంతరాలను తగ్గించడం, నూతన ఆవిష్కరణలు, సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ అనుకూల పరిశ్రమలుగా వీటిని తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దేశీయ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు తోలు ఉత్పత్తులకు ప్రపంచస్థాయి డిమాండ్‌ను తీసుకురావడమే లక్ష్యంగా నూతన పాలసీని రూపొందించింది. తోలు పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తోలు పరిశ్రమలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించనుంది. ఈ పాలసీ 5 సంవత్సరాలు (2025-30) లేదా కొత్త పాలసీ ప్రకటించేవరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు మంగళవారం పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహకాలు ఇలా..
కొత్త పరిశ్రమలకు మూలధన పెట్టుబడిలో 35 శాతం లేదా గరిష్ఠంగా రూ. 12 కోట్ల వరకు రాయితీ.
లెదర్ పరిశ్రమల విస్తరణ, నూతన ఆవిష్కరణలు చేసే పరిశ్రమలకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు రూ.10 కోట్ల వరకు సబ్సిడీ.
చర్మశుద్ధి కార్యకలాపాలకు విద్యుత్తు యూనిట్‌కు రూ.1.5 చొప్పున గరిష్ఠంగా రూ.20 లక్షలు, ఇతర కార్యాలయాలకు వినియోగించే విద్యుత్తుకు రూ.1 చొప్పున ఏడాదికి 15 లక్షల వరకు రీయింబర్స్.
బ్రాండింగ్, మార్కెటింగ్‌తో ఎంఎ్‌సఎంఈ యూనిట్‌లు ట్రేడ్‌మార్క్‌లను పొందేలా ప్రోత్సహించడానికి, జీఎల్ ట్యాగ్‌లు, ప్రమోషన్ తదితర కార్యకలాపాలకు అయ్యే ఖర్చులో 25 శాతం చొప్పున 3 సంవత్సరాలపాటు రూ. కోటి వరకు పొందవచ్చు.
ఐఎ్‌సవో, ఐఎ్‌సఐ, బీఐఎస్, ఎఫ్‌పీవో, బీఈఈ, అగ్‌మార్క్, ఎకోమార్క్ వంటి ధ్రువపత్రాలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ ధ్రువీకరణ పొందిన ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ.
తోలు, పాదరక్షల తయారీలో స్థానిక కార్మికులు నైపుణ్యం పెంచుకోవడానికి, గుర్తించిన సంస్థల నుంచి శిక్షణ పొందే ఎంఎ్‌సఎంఈలకు శిక్షణ ఖర్చులో 50 శాతం రాయితీ.
ఏపీఐఐసీ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.25 లక్షలకు పరిమితం చేసిన భూమి ఖర్చులో 75ు తిరిగి చెల్లింపు.
పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూమి కొనుగోలు, పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ వంద శాతం రీయింబర్స్‌మెంట్.
పెద్ద సంస్థలకు ఇవీ ప్రోత్సాహకాలు
లెదర్ క్లస్టర్లలో రూ.125 కోట్ల నుంచి 500 కోట్ల వరకు పెట్టుబడులతో నెలకొల్పిన పెద్ద పరిశ్రమలకు మూలధన పెట్టుబడిలో 25 శాతం లేదా గరిష్ఠంగా రూ. 50 కోట్ల వరకు రాయితీ.
సెమీ ప్రాసెస్డ్ లెదర్, వెట్ బ్లూస్ పరిశ్రమలకు మూలధన పెట్టుబడిలో 30 శాతం లేదా గరిష్ఠంగా రూ. 60 కోట్ల వరకు రాయితీ.
ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే అమలులోకి తీసుకువచ్చిన ఏపీ ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ పాలసీ 4.0 కింద మూలధన పెట్టుబడిలో 30 శాతం రాయితీ.
రాష్ట్రంలో తయారు చేసి విక్రయించే తోలు ఉత్పత్తులకు చెల్లించాల్సిన అమ్మకం పన్ను (జీఎస్టీ) పూర్తిగా మినహాయింపు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 05:57 AM