ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Water Issues: జలంపై నిర్లక్ష్యం

ABN, Publish Date - Jul 13 , 2025 | 05:24 AM

గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర జలవనరుల శాఖ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా బోర్డుల మార్గదర్శకాలపై అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్ర జల ప్రయోజనాలను...

AP vs TG
  • రాష్ట్ర ప్రయోజనాలు గోదాట్లోకి..

  • విభజన జరిగి పదేళ్లు దాటినా ఇంకా తెలంగాణలోనే కృష్ణా బోర్డు

  • బోర్డుల మార్గదర్శకాలపైనా అలసత్వం

  • తెలంగాణ ఇంజనీర్ల మాటకే విలువ

  • పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్ణయాల్లో ఏపీ అధికారుల పాత్ర నామమాత్రమే

  • జలవనరుల శాఖ తీరుపై విమర్శలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర జలవనరుల శాఖ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా బోర్డుల మార్గదర్శకాలపై అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్ర జల ప్రయోజనాలను కాపాడటంలోనూ జల వనరుల శాఖ ఇలాగే వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంలో గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుపై అనుసరిస్తున్న తీరునే ఇందుకు ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు.

సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించాల్సిన సమయంలో లేవనెత్తాల్సిన సందేహాలను ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సమయంలో వ్యక్తం చేయడం వెనుక బోర్డుల్లోనూ, పీపీఏలోనూ తెలంగాణ ఇంజనీరింగ్‌ అధికారుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా జలాలపై హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలు నిరంతరం నదీ యాజమాన్య బోర్డులపై ఒత్తిడి పెంచుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బోర్డుల విషయంలో ఉదాసీనతను, ప్రతిపక్ష పార్టీ వైసీపీ పూర్తి నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రావాల్సిన న్యాయమైన హక్కులను కోల్పోవాల్సి వస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి రాని కేఆర్‌ఎంబీ..

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) తెలంగాణలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో ఉండాలి. బోర్డులకు వర్కింగ్‌ మాన్యువల్‌ను రూపొందించాలి. బోర్డులలో డిప్యూటేషన్‌పై పని చేసే ఇంజనీరింగ్‌ అధికారుల కోసం రాష్ట్రాలు నియమ నిబంధనలతో మార్గదర్శకాలను రూపొందించాలి. కానీ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఇప్పటి దాకా కార్యరూపం దాల్చలేదు. కేఆర్‌ఎంబీని 2014-19 మధ్యకాలంలో విజయవాడకు రప్పించాలని ప్రయత్నాలు చేశారు. కానీ గట్టిగా ఒత్తిడి తీసుకురాలేకపోవడంతో రాష్ట్రానికి కేఆర్‌ఎంబీ తరలిరాలేదు. ఆ తర్వాత జగన్‌ పాలనలో కేఆర్‌ఎంబీ విషయంలో డొంకతిరుగుడుగా వ్యవహరించారు.

విభజన చట్టంలో రాష్ట్ర రాజధాని నగరంలో కేఆర్‌ఎంబీ ఏర్పాటు చేయాలని ఉంటే.. కృష్ణా పరీవాహక ప్రాంతంతో ఏమాత్రం సంబంధం లేని విశాఖపట్నంలో బోర్డు ప్రధాన కార్యాలయం కోసం జగన్‌ స్థలం, భవనం చూపించారు. ఈ నిర్ణయాన్ని నాడు జల వనరుల నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించినా జగన్‌ పట్టించుకోలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సువిశాలమైన భవంతిని చూపించారు. ఇక్కడికి కేఆర్‌ఎంబీ తరలించేందుకు ఆమోదించినా, హైదరాబాద్‌ మహానగరాన్ని వీడి విశాఖకు రాలేదు. 2024లో జగన్‌ ప్రభుత్వం ఓడిపోయాక.. కూటమి సర్కారు కేఆర్‌ఎంబీని విజయవాడకు తరలించేందుకు ప్రతిపాదించింది. అయితే.. విభజన చట్టం ప్రకారం అమరావతిలో కేఆర్‌ఎంబీ ఉండాలని, విజయవాడలో కాదంటూ బోర్డు తిరకాసు పెడుతోంది. దీంతో హైదరాబాద్‌ను వీడి కేఆర్‌ఎంబీ రాష్ట్ర రాజధానికి తరలిరావడం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.

తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా..

కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలతో పొరుగు రాష్ట్రం తెలంగాణ నిత్యం టచ్‌లో ఉంటోంది. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న తెలంగాణ ఇంజనీరింగ్‌ అధికారులకు భరోసా ఇస్తోంది. జలాల విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒక్కటిగా నిలుస్తున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర జలవనరుల శాఖ పట్టించుకోవడం లేదు. బోర్డులకు అవసరమైన ఇంజనీరింగ్‌ సిబ్బందిని సకాలంలో డిప్యూటేషన్‌పై పంపడం లేదు. నీటి కేటాయింపుల్లో కీలకంగా వ్యవహరించే సూపరింటెండెంట్‌ ఇంజనీరు స్థాయి అధికారిని డిప్యూటేషన్‌పై పంపాలంటూ కేఆర్‌ఎంబీ చైర్మన్‌ రాష్ట్ర జలవనరుల శాఖను పదేపదే కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది.

నాలుగు నెలల క్రితం కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి విజయవాడకు వచ్చి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను కలిసి కోరారు. ఈ అభ్యర్థనపైనా రాష్ట్ర జలవనరుల శాఖ నుంచి స్పందన లేదు. కీలకమైన ఖరీఫ్‌ పంటలకు జలాలు విడుదల చేసే సమయం దాటిపోతున్నా ఇప్పటిదాకా ఎలాంటి కదలికా లేదు. దీంతో రాష్ట్ర వాటా మేరకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకునే వీల్లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు. బోర్డు సమావేశాలకు తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శుల స్థాయి నుంచి ఇంజనీర్ల దాకా హాజరవుతుంటే.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గైర్హాజరవుతున్నారు. కేవలం ఒక్కసారే బోర్డు సమావేశానికి హాజరు కావడం విమర్శలకు తావిస్తోంది.

లాబీయింగ్‌ ఏదీ?

నదీ జలాల్లో రాష్ట్ర వాటాపై జలవనరుల శాఖ నదీ యాజమాన్య బోర్డులపై ఒత్తిడి కానీ, లాబీయింగ్‌ కానీ చేయలేకపోతోంది. కృష్ణా నదీ జలాల వాటా విషయంలో, గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకంపై బోర్డులు తీసుకుంటున్న నిర్ణయాల్లో తెలంగాణ ఇంజనీరింగ్‌ అధికారుల మాటకే విలువ ఇస్తున్నారు. పోలవరం-బనకచర్ల పథకంపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తీసుకున్న నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగిన ఇంజనీరింగ్‌ అధికారుల ప్రమేయం నామమాత్రమే. ఈ పథకంపై జీఆర్‌ఎంబీ, పీపీఏ కోర్రీలు వేశాయన్న అభిప్రాయం ఏర్పడింది. బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్న ఏపీ డిప్యూటేషన్‌ ఇంజనీర్లతో జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరుకు కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ చైర్మన్లు మారనున్నారు. ఏపీ ప్రయోజనాలతో సంబంధం లేదన్నట్లుగా జలవనరుల శాఖ వ్యవహరిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు.

ఇంజనీరింగ్‌ అధికారులపై వేధింపులు

ఏపీకి చెందిన ఇంజనీరింగ్‌ సిబ్బందిని జీఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నా రాష్ట్ర జలవనరుల శాఖ పట్టించుకోవడం లేదు. అదే తెలంగాణ ఇంజనీరింగ్‌ అధికారులకు ఇలాంటి వేధింపులు ఎదురైతే ప్రభుత్వం, రాజకీయపక్షాలు అండగా నిలుస్తున్నాయి.

Updated Date - Jul 13 , 2025 | 08:49 AM