ప్రకృతి వ్యవసాయం
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:14 AM
ప్రకృతి వ్యవ సాయం ఆరోగ్యవంతమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు.
చాపాడు, జూన4 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవ సాయం ఆరోగ్యవంతమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా పంటలకు వాడుతుం డడంతో భూసారం దెబ్బతినడమే కాకుండా విషరసాయనాలను ఉపయోగిస్తున్నందున ఆహార ఉత్పత్తులు విషంగా తయారు అవుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి వాటి బారీన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. గత అయిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంవైపు రైతులు దృష్టి పెట్టారు. రైతులు ఉద్యానవన పంటలు జామ, చీనీ వంటి పంటలను ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం కింద జీవామృతం తయారు చేసుకోవాలని అధికారులు వారికి సలహాలు ఇస్తున్నారు. ఈ జీవామృతానికి ఆవుపేడ, ఆవుపంచికం, శనగ పిండి, బెల్లం, పుట్టమట్టి, నీళ్లు వంటివి అవసరం. వీటిని ఒక డ్రమ్ములో కలిపి జీవామృతం తయారు చేస్తారు. వంద లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లం, రెండు కేజీల శనగపిండి, పది కేజీల ఆవుపేడ, పది లీటర్ల ఆవుపంచికం, గుప్పెడు పుట్టమట్టితో తయారు చేస్తారు. వీటన్నింటిని డ్రమ్ములో కలిపి వారం రోజులపాటు కలియబెట్టుతూ రావడంతో జీవామృతం తయారవుతుంది. ఇలా తయారు చేసిన జీవామృతాన్ని వరి, వేరుశనగ, పసుపు, నిమ్మ, సపోట, జామ వంటి పంటలకు స్ర్పే చేయాలి. అప్పుడు మొక్కల ఆకులు, కాండం, ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. పూత దశలో పిచికారి చేస్తే పండ్ల దిగుబడి, నాణ్యత, రుచి బాగుంటుందని రైతులు తెలిపారు. ఈ జీవామృతం తయారు చేసేందుకు రూ.1500 మాత్రమే ఖర్చు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జీవామృతం వాడితే పంటలకు ఆశించే తెల్లదోమ, చీడ పురుగు నివారణ అవుతాయి. మొక్కల వేర్లకు సూక్ష్మపోషకాలు అందుతాయి. మండలంలోని వెదురూరు, రాజుపాళెం, చాపాడు, రాజువారిపేట, పల్లవోలు, సీతారామపురం, మరికొన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం కింద జీవామృతాన్ని తయారు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఈ జీవామృతంతో భూమి సారవంతం అవుతుంది. రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది. సులభంగా పంటలు పండివచ్చు.
రైతులకు ఖర్చు తగ్గుతుంది
జీవామృతంను పంటల సాగుకు ఉపయోగిస్తేరైతులకు ఖర్చు తగ్గుతుంది. మొక్కలు, ఫలాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. భూమి సారవంతం అవుతుంది. భూమిలో వానపాముల సంఖ్య భారీగా పెరుగుతాయి. ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించవచ్చు.
- మొగిలి ఆంజనేయులు,
మండల ప్రకృతి వ్యవసాయ సలహాదారు
Updated Date - Jun 05 , 2025 | 12:14 AM