Nara Lokesh: ప్రధానితో గడిపిన సమయం మరువలేను
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:09 AM
ఇటీవల ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీతో రెండు గంటలు సమావేశం కావడం మరపురానిదని లోకేశ్ అన్నారు. బీజేపీతో ఎన్నికల అవగాహన కుదిరిన తర్వాత ఆయనతో కలిసి రెండు మూడు సభల్లో పాల్గొన్నానని చెప్పారు. ‘తొలుత రాజమండ్రి సభలో మోదీ నన్ను కూటమి ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందని అడిగారు.
2 గంటలు మాట్లాడుకున్నాం
3 కీలకమైన సలహాలిచ్చారు
నిజాయితీగా పనిచేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పారు
నాన్న ఇచ్చిన అవకాశాలతో స్వతంత్రంగా ఎదగాలన్నారు
ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం కష్టపడాలన్నారు: లోకేశ్
ఇటీవల ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీతో రెండు గంటలు సమావేశం కావడం మరపురానిదని లోకేశ్ అన్నారు. బీజేపీతో ఎన్నికల అవగాహన కుదిరిన తర్వాత ఆయనతో కలిసి రెండు మూడు సభల్లో పాల్గొన్నానని చెప్పారు. ‘తొలుత రాజమండ్రి సభలో మోదీ నన్ను కూటమి ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందని అడిగారు. మూడు పారీలూ కలిసి పనిచేస్తే 22 సీట్లు గెలుస్తామని చెప్పాను. అన్ని వస్తాయా అని ఆయన ఆశ్చర్యపోయారు. ప్రమాణ స్వీకార సభలో కూటమికి 21 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తుచేసినప్పడు బాగా చేశారని అభినందించారు. ఢిల్లీ వచ్చి తనను కలవాలన్నారు. ఆయనకు నన్ను కలిసేంత సమయం ఉండదని భావించి ఢిల్లీకి వెళ్లలేదు. కానీ విశాఖ సభలో ఆయన మళ్లీ గుర్తు చేయడమే గాక.. మీ అబ్బాయి ఢిల్లీ రమ్మంటే రావడం లేదని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మళ్లీ అమరావతిలో రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ సభలో.. నువ్వు ఢిల్లీ రానందుకు శిక్షిస్తానని వీపుపై రెండు దెబ్బలు వేశారు. దీంతో ఆయన అపాయింట్‌మెంట్ అడిగి ఢిల్లీ వచ్చాను. గత పాతికేళ్లుగా గుజరాత్‌లోనూ, ఢిల్లీలోనూ ఆధికారంలో ఉన్న మోదీ వెనుక ఉన్న శక్తి ఏమిటి, ఆయనకంత ఉత్సాహం ఎలా వచ్చిందన్న ఆసక్తితోనే ఆయన్ను కలిశాను. 2 గంటల్లో మొదటి గంటంతా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆయన వివరంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాకు మూడు కీలక విషయాలు చెప్పారు. నా ఆలోచనలు స్పీడ్‌గా ఉంటాయని అదే సమయంలో తప్పులు కూడా జరుగుతాయని, అందువల్ల నన్ను గైడ్ చేయాలని నేను కోరగా.. పని చేసేవారే తప్పులు చేస్తారు. ఇంట్లో పడుకుంటే చేయం కదా.. మనం నిజాయితీగా, సరిగా పనిచేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మోదీ మొదటి సలహాగా చెప్పారు. నువ్వు ఎదిగేందుకు మీ నాన్న ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. వాటిని ఉపయోగించుకుని స్వతంత్రంగా నాయకుడిగా ఎదగాలని రెండో సలహా ఇచ్చారు. ఇక దేశ శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించి నిరంతరం కష్టపడాలని చివరిగా సూచించారు. ఆయనతో సమావేశం ఇలా జరగడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సమావేశం నుంచి వచ్చాక తెల్లవారుజామున నాలుగింటి వరకూ నిద్రపట్టలేదు’ అని లోకేశ్ తెలిపారు. ప్రధాని అంత సమయం ఇచ్చి చె ప్పిన విషయాలను సీరియ్‌సగా తీసుకోవాలనుకున్నానని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని స్పందించిన తీరు అభినంద నీయమన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 05:09 AM