Nara Lokesh : వాట్సాప్ ద్వారా 500 సేవలు!
ABN, Publish Date - Mar 19 , 2025 | 07:11 AM
500 రకాల ప్రభుత్వ సేవలను మన మిత్రలో వాట్సాప్ ద్వారా అందిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
జూన్ 30 నాటికి అందుబాటులోకి తెస్తాం
ప్రపంచంలోనే మెరుగ్గా ‘మనమిత్ర’ సేవలు
అసెంబ్లీలో వాట్సాప్ గవర్నెన్స్‌పై లోకేశ్
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రపంచంలోనే మెరుగ్గా నిర్వహిస్తామని, ఈ ఏడాది జూన్ 30నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మన మిత్రలో వాట్సాప్ ద్వారా అందిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో వాట్సాప్ గవర్నెన్స్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 1983లో ఎన్టీఆర్ సీఎం అయిన వెంటనే పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని చంద్రబాబు పదే పదే చెప్పేవారని తెలిపారు. పాదయాత్రలో ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల ముందు పడిగాపులు పడాల్సి వస్తోందని తన దృష్టికి తెచ్చారని లోకేశ్ వివరించారు. బటన్ నొక్కితే సినిమా టిక్కెట్లు, ఆహారం, నిత్యావసర వస్తువులు, ట్యాక్సీ వంటి అన్ని సేవలూ ఇంటికి వస్తున్నప్పుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రావని ప్రజలు తనను ప్రశ్నించారని ఆయన చెప్పారు. ఆఫీసులకు వెళ్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, గంటల తరబడి వేచిఉండాల్సి వస్తుందని, అందుకే సామాన్య ప్రజలు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో ఎక్కువ ఎంపీటీసీలు టీడీపీ-జనసేన గెలుచుకున్నా... ఎంపీపీగా బీసీ మహిళకు రిజర్వేషన్ వస్తే ఆనాటి ఎమ్మెల్యే ఆమెకు కులధృవీకరణ పత్రం అందకుండా అడ్డుపడి, పదవికి దూరం చేసిన విషయాన్ని లోకేశ్ ప్రస్తావించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ఆ రోజే తాను సంకల్పించానన్నారు. అప్పటి నుంచే తనలో వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన మొదలైందన్నారు.
మనమిత్రతో కీలక సంస్కరణలకు నాంది
విజిబుల్ గవర్నెన్స్-ఇన్విజబుల్ గవర్నెన్స్ నినాదం ద్వారా ప్రజల దైనందిన జీవితంలో అధికారులు, రాజకీయ నాయకుల అవసరం ఉండకూడదన్నదే తన లక్ష్యమని లోకేశ్ చెప్పారు. బేసిక్ సర్వీసెస్, వివిధ రకాల సర్టిఫికెట్ల జారీలో అధికారుల పాత్ర లేకుండా చేయాలనే ఆలోచన చేశానని, అందరి ఫోనుల్లో ఉన్న వాట్సాప్ ద్వారా మనమిత్ర పేరుతో ప్రజల చేతిలోకి పాలన తెచ్చే లక్ష్యంతో సేవలు ప్రారంభించామని మంత్రి చెప్పారు. పౌరసేవలకు గేమ్ ఛేంజర్‌గా మన మిత్ర పేరుతో సేవలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం 200 సేవలను మనమిత్ర ద్వారా అందిస్తున్నామని, సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీడీ అధికారులతో చర్చించి 30 రోజుల్లో టీటీడీకి సంబంధించి అన్నీ సర్వీసులను మనమిత్ర ప్లాట్‌ఫాంపైకి తీసుకురాబోతున్నామని లోకేశ్ తెలిపారు. ఈ నెలాఖరుకు 300 రకాల ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. జూన్ 30 నాటికి 500 సర్వీసులు మనమిత్ర ద్వారా అందుబాటులోకి తెస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు. నూతన విధానంలో వివిధ రకాల సర్టిఫికేట్లు ట్యాంపరింగ్‌కు ఆస్కారం లేకుండా క్యూఆర్‌కోడ్ అనేబుల్ సర్టిఫికేట్లు అందజేస్తామని లోకేశ్ తెలిపారు. త్వరలో విద్యార్థుల పరీక్షల ఫలితాలు కూడా వాట్సాప్ ద్వారానే వారి ఫోన్లకు పంపిస్తామన్నారు.
మీసేవ కేంద్రాల ద్వారా సమాంతర సేవలు
పాదయాత్ర సమయంలో తనను మీసేవ ఆపరేటర్లు కలిశారని, గత ప్రభుత్వం మీసేవ కేంద్రాల సేవలను కుదించిన విషయాన్ని తన దృష్టికి తెచ్చారని లోకేశ్ వివరించారు. ప్రస్తుతం మీసేవ కేంద్రాలు కూడా ఐటీ పరిధిలోకి వచ్చాయని, మీసేవలను కూడా అందుబాటులోకి తెస్తామని ఆపరేటర్లకు హామీ ఇస్తున్నామని మంత్రి చెప్పారు. సమాంతరంగా సచివాలయాలు, వాట్సాప్, మీసేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు. వందరోజుల్లో మనమిత్ర 2.0 ఏఐ ద్వారా వాయిస్ ఎనేబుల్ విధానం అందుబాటులోకి తెస్తామన్నారు.
ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి: లోకేశ్
ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు విధిగా నిబంధనలు పాటించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో వ్యాయామ విదా బోధన (ఫిజికల్ ఎడ్యుకేషన్) ముఖ్యమని అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్నో, డిజిటల్ స్కూల్స్‌కు అపార్ట్‌మెంట్ స్కూల్ కాన్సెప్ట్ ఉందా? అని అడిగారు. ప్రయివేటు స్కూల్స్ ప్రమాణాలు పాటించడం లేదని, నియమ నిబంధనలు పాటించడంలేదని, ఆటస్థలాలు ఉండడం లేదని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి లకేశ్ బదులిస్తూ పాఠశాల విద్యలో మార్పులు చేయాలంటే జీవో88లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఇకపై అనుమతుల జారీని ఆన్‌లైన్ చేద్దామని చెప్పారు.
చేనేతలకు అండగా ఉంటాం
చేనేతలకు ఉచిత విద్యుత్ హామీని అమల్లోకి తెస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు ‘ఎక్స్’ వేదికగా వేర్వేరు ప్రకటనల ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ ప్రభుత్వం చేనేతలకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘చేనేత కార్మికుల ఇళ్లకు విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయించింది. దీని వల్ల 93 వేల మంది నేతన్నల కుటుంబాలకు, 10,534 మరమగ్గాలకు ప్రయోజనం చేకూరుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే వారికి జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ‘ఒక హామీ నెరవేర్చితే ఏదో నా బాధ్యత తీరిపోయినట్లు కాదు.. భారం దించుకున్నట్లు కాదు. లక్షలాది బతుకులకు అది వెలుగు దారి కావాలనే నా ఆశయం నెరవేరుతుందనే ఆనందం ఇది’ అంటూ లోకేశ్ ఉద్వేగంగా స్పందించారు.
Updated Date - Mar 19 , 2025 | 07:13 AM