Nara Lokesh: ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ABN, Publish Date - May 16 , 2025 | 03:50 AM
అనంతపురంలో మంత్రి లోకేశ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి చేర్చాలని పిలుపునిచ్చారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.. కూటమి మధ్య చిచ్చుపెట్టే వైసీపీ కుట్రలను తిప్పికొట్టండి
పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేది లేదు.. ‘అనంత’ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్
ఉత్తమ కార్యకర్తల కుటుంబ సభ్యులకు సత్కారం
అనంతపురం, మే 15(ఆంధ్రజ్యోతి): ‘ఏడాది పాలనలో మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. పది మందికి చెప్పాలి’ అని మంత్రి లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసిగా పనిచేయాలని సూచించారు. అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు గురువారం గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించారు. గుత్తి మండలం రామరాజుపల్లి సమీపంలో పార్టీ ఉత్తమ కార్యకర్తలు, శ్రేణులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ముందుగా 32 మంది ఉత్తమ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు. కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... ఎన్నికల హామీ మేరకు రూ.4 వేల పింఛన్ ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించామని, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని, రోడ్లపై గుంతలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నామని అన్నారు. ఈ ఏడాది జూన్‌లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళతామని అన్నారు. ‘16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చాం. చంద్రబాబు నేతృత్వంలో రాష్ర్టానికి పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయి. అనంతపురానికి రూ.22వేల కోట్ల విలువైన భారీ సోలార్, విండ్ ప్రాజెక్టు వస్తోంది. విశాఖకు టీసీఎస్ డెవల్‌పమెంట్ సెంటర్ వస్తోంది. రాబోవు ఐదేళ్లలో యువతకు ఉద్యోగాలు వస్తాయి’ అని అన్నారు.
వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
‘మన ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తోందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒక్క పాఠశాలనూ మూయడం లేదు. అది మన లక్ష్యం కాదు. ఒక క్లాస్‌కు ఒక టీచర్ ఉండాలన్నదే మన ధ్యేయం. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 33 లక్షలకు పడిపోయారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం. మంత్రి నారాయణ సహకారంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మంచి ఫలితాలొచ్చాయి. జనసేనతో కలిసి పోటీ చేశాం. భవిష్యత్తులో కలిసే ప్రయాణం చేస్తాం. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. వైసీపీ నాయకులు మన మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. వారి విమర్శలు, ఆరోపణలను సమర్థంతంగా తిప్పికొట్టాలి. పార్టీ కేడర్ రెడ్‌బుక్ గురించి అడుగుతున్నారు. మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలను. రెడ్‌బుక్‌ను మరువను. నా అంతకు నేనుగా ఎవరితో గొడవ పెట్టుకోను. మన జోలికి వస్తే మాత్రం వదలను. కార్యకర్తల బాగు కోసం నేను పనిచేస్తున్నాను. ఇది మన కుటుంబం.. మన పార్టీ. అన్యాయం జరిగితే నన్ను, పార్టీలోని ఇతర పెద్దలను కలవండి. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా. పనిచేసే వారిని గుర్తిస్తా’ అని లోకేశ్ అన్నారు.
ఘనస్వాగతం
ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకుని గుత్తి మండలం బేతాపల్లి వద్ద హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న లోకేశ్‌కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణి శ్రీ, పల్లె సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు స్వాగతం పలికారు.
లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినులు
‘కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని అన్నలా ఆదుకున్నారు. మీరు చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం’ అని గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రభాకర్ కుమార్తెలు పురందేశ్వరి, స్నేహలత.. మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ చేసిన సాయంతో తాను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని పురందేశ్వరి, ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేశానని స్నేహలత తెలిపారు. నంద్యాలలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో ప్రభాకర్ భార్య, కూతుళ్లు లోకేశ్‌ను కలిసి వారి కష్టాలను చెప్పుకొన్నారు. ఆ సమయంలో ఇద్దరిని చదివిస్తానని లోకేశ్ మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవడంతో ప్రభాకర్ కుటుంబం మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ ఇద్దరు విద్యార్థినుల చదువు పూర్తయ్యే వరకు తాను అండగా ఉంటానని లోకేశ్ మరోసారి భరోసా ఇచ్చారు.
Updated Date - May 16 , 2025 | 03:51 AM