ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూలీ కోసం ఖూనీ

ABN, Publish Date - Jul 17 , 2025 | 01:23 AM

కూలీ డబ్బుల కోసం మొదలైన పంచాయితీ ఇద్దరి ప్రాణాలు తీసింది. వాటాల్లో తేడాలు రావడంతో పంచాయితీలో ఉన్న రౌడీషీటర్‌ కత్తితో వీరంగం వేశాడు. ఆ ఇద్దరిని చంపేసి అక్కడి నుంచి పారిపోయిన ఘటన విజయవాడ గవర్నరుపేటలో బుధవారం జరిగింది.

నగరంలో ఇద్దరు దారుణ హత్య

చంపేసి పారిపోయిన రౌడీషీటర్‌

కూలీ డబ్బుల పంచాయితీలో వివాదం

క్షణాల్లో నిందితుడ్ని గుర్తించిన కాప్స్‌

ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు

విజయవాడ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కూలీ డబ్బుల కోసం మొదలైన పంచాయితీ ఇద్దరి ప్రాణాలు తీసింది. వాటాల్లో తేడాలు రావడంతో పంచాయితీలో ఉన్న రౌడీషీటర్‌ కత్తితో వీరంగం వేశాడు. ఆ ఇద్దరిని చంపేసి అక్కడి నుంచి పారిపోయిన ఘటన విజయవాడ గవర్నరుపేటలో బుధవారం జరిగింది. విజయవాడకు చెందిన ఎన్‌.రాజు(35), విజయనగరానికి చెందిన జి.వెంకటరావు(38) క్యాటరింగ్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. అజితసింగ్‌ నగర్‌కు చెందిన పెండ్యాల రాము అనే క్యాటరింగ్‌ మేసి్త్ర వద్ద కార్మికులుగా ఉంటున్నారు. వీరిద్దరు గవర్నరుపేటలోని అన్నపూర్ణ థియేటర్‌ ఎదురుగా ఉన్న డీటీ రావు వీధిలో గల సుధీర్‌ విహార్‌ భవనంలో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. కొత్తపేట నైజాం గేటు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ జమ్ము కిషోర్‌ 20 రోజుల క్రితం రాము వద్ద క్యాటరింగ్‌ పనులకు చేరాడు. రాజు, వెంకటరావుతో పాటే గవర్నరుపేటలో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి క్యాటరింగ్‌ పనులకు వెళ్లారు. క్యాటరింగ్‌లో యజమాని ఇచ్చే వేతనం కాకుండా కార్యక్రమ నిర్వాహకులు టిప్‌ ఇచ్చారు. వాటిని పంచుకోవడానికి ముగ్గురు కలిసి గదిలో కూర్చున్నారు. మద్యం తాగుతూ వాటాలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పార్టీలో మేడపైన ఉండే బాషా అనే వ్యక్తితోపాటు మరో యువకుడు ఉన్నారు. మద్యం తాగుతూ డబ్బులు పంచుకునే క్రమంలో వాటాల వద్ద వ్యత్యాసాలు వచ్చాయి.

పైకి వెళ్లి వచ్చేలోగా ఖతం

డబ్బుల పంపిణీలో తేడాలు రావడంతో రాజు, వెంకటరావు, కిషోర్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది చినికిచినికి గాలి వానలా మారుతుండడంతో పార్టీలో ఉన్న బాషా ముగ్గురిని వారించాడు. తర్వాత అక్కడి నుంచి లేచి పైన ఉన్న గదిలోకి వెళ్లిపోయాడు. అయినా గొడవ ఆగకపోవడం, ముగ్గురు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితి రావడంతో అక్కడే ఉన్న మరో యువకుడు పైకి వెళ్లి బాషాకు విషయం చెప్పాడు. ఇంతలోనే రాజు, వెంకటరావుపై కిషోర్‌ కత్తితో దాడి చేశాడు. ఇద్దరిని ఇష్టానుసారంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాషా వద్దకు వెళ్లిన యువకుడు అప్పటికే బాగా మద్యం తాగాడు. మేడ పైనుంచి కిందికి వచ్చిన ఆ యువకుడు మత్తులో ఉండడంతో గదిలో పడిపోయాడు. బాషా కిందికి వచ్చి చూసే సరికి రాజు, వెంకటరావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడు వెంటనే గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చాడు. పోలీసులు పెట్రోలింగ్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపారు. పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి వెళ్లే సరికి కిషోర్‌ పారిపోతూ కనిపించాడు. అతడిని ఓ కానిస్టేబుల్‌ వెంటాడినా ఫలితం లేకపోయింది. ఘటనా స్థలం నుంచి ఏలూరు రోడ్డులోకి వచ్చి ఆటో ఎక్కి వెళ్లిపోయాడు. ఘటనా స్థలాన్ని అడ్మిన్‌ డీసీపీ కేజీవీ సరిత, దక్షిణ మండలం ఏసీపీ డి.పావన్‌ కుమార్‌ పరిశీలించారు.

పోలీసుల అదుపులో యువకుడు

గదిలో మత్తులో ఉన్న యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఘటనకు సంబంధించిన అసలు వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఏలూరు రోడ్డు వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ జంట హత్యలు చేసింది రౌడీషీటర్‌ కిషోర్‌ అని ఒక నిర్థారణకు వచ్చారు. నగరంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పరిశీలిస్తున్నారు. అతడు ఎక్కిన ఆటోను గుర్తించారు. ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, కిషోర్‌ ప్యాంటు జేబులో రెండు మద్యం సీసాలు, బొడ్డు వద్ద చూపుడు వేలు పరిమాణంలో ఉండే కత్తి ఉందని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కిషోర్‌ కోసం అధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను నియమించారు. ఇందులో ఆరు బృందాలు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నాయి. మిగిలిన రెండు బృందాలు కిషోర్‌ కోసం గాలిస్తున్నాయి.

ఎవరు ఈ కిషోర్‌?

జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్‌ జమ్ముల కిషోర్‌ కొత్తపేటలోని వించిపేటకు సమీపాన ఉన్న నైజాంగేటు ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడిపై కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. ఒక హత్య కేసు, బైండోవర్‌ కేసులు వెరసి ఎనిమిది వరకు ఈ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాయి. ఆయుధాలతో దారినపోయే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. నైజాం గేటు వద్ద ఒక గదిని అద్దెకు తీసుకుని ఉండేవాడు.

Updated Date - Jul 17 , 2025 | 01:23 AM