Votes Counting: ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. ఫలితాలు వెల్లడించడానికి ఎన్ని రోజులు పడుతుందంటే
ABN, Publish Date - Mar 02 , 2025 | 10:23 AM
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయస్థానానికి ఎన్నిక నిర్వహించగా.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రులు స్థానానికి ఎన్నిక జరిగింది.
ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఫలితాలపై ప్రతిఒక్కరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పోలింగ్‌పై చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఓటరును పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించడంపై పోలింగ్ వరకు దృష్టి పెడతారు. ఆ తర్వాత అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపై ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) ఉపయోగిస్తుండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గతంలో బ్యాలెట్ పేపర్లను లెక్కించేటప్పుడు ఫలితాలు ప్రకటించేందుకు రెండు రోజుల సమయం పట్టేది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగిస్తున్నప్పటికీ కొన్ని ఎన్నికలకు ఇంకా బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ నిర్వహించారు. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగగా.. తెలంగాణలో రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపు మార్చి3వ తేదీన జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితం వెలువడటానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టనుండగా.. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితం సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితం ఆసల్యంగా రావడానికి గల కారణాలు ఏమిటి.. అసలు ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం.
కోటా నిర్థారణ..
సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్దారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి, చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కకడతారు. 50 శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువుగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలుకడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల కోసం ఒక్కోక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. ఉదాహరణకు మొత్తం 2వేల ఓట్లు పోలైతే వాటిలో 1800 ఓట్లు చెల్లుబాటైతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు.
ఎలిమినేషన్ ఎలా చేస్తారంటే
ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వాటిని పైనున్న అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కోటా ఓట్లు ఎవరికి రాకపోతే మరో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. కోటా ఓట్లు వచ్చే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఎప్పుడైతే విజయానికి అవసరమైన కోటా ఓట్లు అభ్యర్థి సాధిస్తారో అప్పుడు అతడిని విజేతగా ప్రకటిస్తారు. గ్రాడ్యుయేట్ ఓట్లు లక్షల్లో ఉండటం ద్వారా వాటి లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఉపాధ్యాయుల ఓట్లు కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉండటంతో ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తవుతుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Mar 02 , 2025 | 10:23 AM