Minister Lokesh: ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
ABN, Publish Date - Jul 19 , 2025 | 06:25 AM
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలో నాణ్యత పెంచి, తద్వారా ప్రవేశాలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ అన్నారు.
నాణ్యమైన బోధన అందించడం ద్వారా
అడ్మిషన్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
మంచి విద్య అందిస్తారని విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాలి
‘షైనింగ్ టీచర్’ హెచ్‌ఎం దుర్గాభవానీకి మంత్రి లోకేశ్ అభినందన, సత్కారం
అద్భుత పనితీరుతో ఆదర్శంగా నిలిచారని ప్రశంస
అమరావతి/మచిలీపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలో నాణ్యత పెంచి, తద్వారా ప్రవేశాలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇతర అంశాల్లో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు వై.దుర్గాభవానీని ‘షైనింగ్ టీచర్’ బిరుదుతో శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గి, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ‘ప్రభుత్వ బడుల ముందు అడ్మిషన్లు అయిపోయాయనే బోర్డులు పెట్టే పరిస్థితి రావాలి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందుతుందని తల్లిదండ్రులు విశ్వసిస్తారు’ అని పేర్కొన్నారు. ఈ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తామని, చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దుర్గాభవాని నుంచి లోకేశ్ ఈ సందర్భంగా సలహాలు, సూచనలు స్వీకరించారు. అద్భుత పనితీరుతో ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచారని ఆమెను ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకే ఉపాధ్యాయులను నేరుగా కలవాలని నిర్ణయం తీసుకున్నామని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ముఖ్యమేనని, వచ్చే నాలుగేళ్లు విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టి సారిస్తామన్నారు.
హెచ్‌ఎం దుర్గాభవాని కృషి ఇదీ..
పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం దుర్గాభవాని వృత్తి పట్ల నిబద్ధత చూపి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. 2025 పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేశారు. పాఠశాలలో 54 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఏడుగురు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు పొందారు. వరుసగా మూడేళ్లు పదుల సంఖ్యలో విద్యార్థులు ఎంఎంఎంఎస్ స్కాలర్‌షి్‌పకు అర్హత సాధించేలా చేశారు. రాష్ట్రం లో మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ నిర్వహించారు. పీఎంశ్రీ యోజన కింద పాఠశాల ఎంపిక కావడానికి కృషి చేశారు. వాల్ ఆర్ట్స్, డ్యాన్స్, మ్యూజిక్ క్లాస్‌లు, కంప్యూటర్ శిక్షణ అందించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రంతోపాటు ఐరెన్‌బాక్స్ హీట్ కంట్రోల్ ఇన్‌క్లైన్, పాఠశాలలో చెత్తను శుభ్రం చేసేందుకు పాతవస్తువుల నుంచి బ్లోయర్ తయారీ, ఆల్కహాల్ సెన్సింగ్ హెల్మెట్ వంటి నవీన ఆవిష్కరణలను విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలి పర్యవేక్షణలో రూపొందించారు. మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న తనను మంత్రి లోకేశ్ పిలిచి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు? వారికి ప్రభుత్వ పరంగా ఇంకేం చేయగ లం? అనే అంశాలపై అడగడం సంతోషంగా ఉందని దుర్గాభవాని తెలిపారు.
Updated Date - Jul 19 , 2025 | 06:26 AM