Narsapuram ZP High School: హ్యాట్సాఫ్ మాస్టారూ
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:29 AM
ప్రాణాలు కాపాడిన ఫేస్‌బుక్ సందేశం’ శీర్షికన ఈ నెల 15న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్తకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ విద్యార్థికి చికిత్స చేయించడం కోసం ఫేస్‌బుక్ మాధ్యమంగా...
ఆదర్శ ఉపాధ్యాయుడు శ్రీధర్‌కు లోకేశ్ అభినందనలు
మోడల్ ఎడ్యుకేషన్‌కు మీలాంటివారే ప్రేరణ అంటూ మంత్రి కితాబు
ఆయన గురించి వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’కీ లోకేశ్ అభినందనలు
విజయవాడ (విస్సన్నపేట), జూలై 26 (ఆంధ్రజ్యోతి): ‘ప్రాణాలు కాపాడిన ఫేస్‌బుక్ సందేశం’ శీర్షికన ఈ నెల 15న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన వార్తకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ విద్యార్థికి చికిత్స చేయించడం కోసం ఫేస్‌బుక్ మాధ్యమంగా రూ.6 లక్షల విరాళాలు సేరించిన శ్రీధర్ అనే ఉపాధ్యాయుడి గురించి వచ్చిన కథనాన్ని చూసిన లోకేశ్ ఎక్స్‌లో ఆ ఉపాధ్యాయుడిని, ‘ఆంధ్రజ్యోతి’ని అభినందించారు. ‘అంకితభావంతో బోధన, నిస్వార్థ సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ మార్గదర్శిగా నిలుస్తున్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నర్సాపురం జడ్పీ హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ బొల్లేపల్లి శ్రీధర్‌కు అభినందనలు. ప్రమాదానికి గురైన ఒక విద్యార్థి బ్రెయిన్ సర్జరీ కోసం రూ.6 లక్షల విరాళాలు పోగుచేసి ప్రాణాలు నిలిపిన మీకు హ్యాట్సాఫ్. ప్రభుత్వ స్కూల్లో వసతులు, లైబ్రరీ బుక్స్, మైక్‌సెట్, క్రీడా సామగ్రి కోసం దాతల సహకారంతో రూ.లక్షలు సమకూర్చి విద్యా వికాసానికి దోహదపడిన శ్రీధర్ మాస్టారు అందరికీ ఆదర్శం. పాఠశాల సమయం ముగిశాక..ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు సొంతింట్లో భోజనం పెడుతూ క్లాసులు చెబుతున్న శ్రీధర్ మాస్టర్ వంటివారే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను రూపొందించేందుకు ప్రేరణ’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ పోస్టు చేసిన వార్త క్లిప్పింగ్‌ను లోకేశ్ తన సందేశానికి జత చేశారు. ఈ సందర్భంగా శనివారం విస్సన్నపేట వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆర్డీవో మాధురి.. శ్రీధర్ మాస్టారును సన్మానించి అభినందించారు.
Updated Date - Jul 27 , 2025 | 04:31 AM