Minister BC Janardhan Reddy : ఫైబర్ నెట్‌లో కోటి కనెక్షన్లే లక్ష్యం!
ABN, Publish Date - Jan 29 , 2025 | 05:10 AM
విజయవాడలోని ఫైబర్ నెట్ కార్యాలయంలో సంస్థ పనితీరుపై మంత్రి బీసీ జనార్దనరెడ్డి మంగళవారం సమీక్షించారు.
సంస్థలోని జీఎం, ఏజీఎం స్థాయి అక్రమార్కులపైనా చర్యలు
149కే త్రి ఇన్ వన్ సేవలను పునరుద్ధరించాలి
సమీక్షలో మంత్రి జనార్దన్ రెడ్డి దిశానిర్దేశం
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను కోటికి చేర్చాలన్న లక్ష్యంతో పనిచేయాలని సంస్థ సిబ్బందికి మంత్రి బీసీ జనార్దనరెడ్డి కర్తవ్యబోధ చేశారు. విజయవాడలోని ఫైబర్ నెట్ కార్యాలయంలో సంస్థ పనితీరుపై మంత్రి మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షలో సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన విభాగం ముఖ్యకార్యదర్శి యువరాజ్, ఫైబర్‌నెట్ ఎమ్‌డీ దినేశ్‌కుమార్, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. 2019 నాటికి 17 లక్షలుగా ఉన్న కనెక్షన్లు.. 2019-24 మధ్య కాలంలో ఐదు లక్షలకు ఎందుకు పడిపోయాయో పునఃసమీక్షించుకుని.. పూర్వవైభవం సాధించేలా అడుగులు వేయాలని ఫైబర్ నెట్ యాజమాన్యానికి సూచించారు. సంస్థపై ఆర్థిక భారంపడేలా వందల సంఖ్యలో ఉద్యోగులను ఇష్టారీతిన గత ప్రభుత్వంలోని ముఖ్యనేతలు నియమించుకున్నారని జనార్దనరెడ్డి మండిపడ్డారు. ఇలాంటివారిని దాదాపు 600 మందిని తొలిగించి కొంతమేర ఆర్థిక ఉపశమనం కలిగే చర్యలు తీసుకున్నా.. సంస్థ మనుగడకు ఇదెంతమాత్రమూ చాలదని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఫైబర్ నెట్ సంస్థకు బ్రాండ్‌గా మారి గుడ్‌విల్‌ను తీసుకువచ్చిన.. ల్యాండ్ లైన్, టీవీ ప్రసార చానళ్లు.. ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించడం ద్వారా.. కనెక్షన్లను గణనీయంగా పెంచుకోవచ్చన్నారు. గతంలో రూ.149కే త్రి ఇన్ వన్ సేవలను అందించేవారమని గుర్తు చేశారు. వ్యవస్థలన్నింటిని చెరబట్టినట్లే ఫైబర్ నెట్‌ను కూడా తన హయాంలో జగన్ ధ్వంసం చేశారని జనార్దనరెడ్డి ధ్వజమెత్తారు. గ్రామ, వార్డు సచివాలయాలకు.. ప్రభుత్వ శాఖలకు.. రెనిడెన్సియల్ పాఠశాలలకు.. విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఇంటర్నెట్ సేవలను ఫైబర్ నెట్ సేవలను విస్తృ తం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ఇప్పటిదాకా విశాఖపట్నం.. తిరుపతికే పరిమితమై ఫైబర్ నెట్ ‘‘నాక్’’ సేవలు జిల్లాలకు వికేంద్రీకరిద్దామని ఆయన అన్నారు. కొందరు జనరల్ మేనేజర్, ఏజీఎం స్థాయి అధికారులు సంస్థకు నష్టం చేసే విధానాలను అమలు చేశారని.. వారిని కూడా గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని జనార్దన్ రెడ్డి తెలిపారు.
Updated Date - Jan 29 , 2025 | 05:10 AM