ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజారోగ్యంతో చెలగాటం!

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:11 AM

మాంసం వ్యర్థాల రవాణాకు విజయవాడ నగరం కేంద్రంగా మారుతోంది. రామలింగేశ్వరనగర్‌ కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కొందరు అక్రమార్కులు కార్పొరేషన్‌ శానిటరీ విభాగంలోని పలువురి కనుసన్నల్లో అక్రమంగా మాంసం వ్యర్థాలను నిల్వ చేస్తున్నారు. కంటెయినర్లు, డ్రమ్ముల్లో ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని కొందరు చేపల చెరువుల యజమానులు, పందుల పెంపకం దారులు వీటిని కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నారు.

- కృష్ణానదిలో గుట్టుగా మాంసాహార వ్యర్థాల నిల్వలు

- మాంసం వ్యర్థాలు, మాంసాహార వ్యర్థాలుగా గ్రేడింగ్‌

- కంటెయినర్లు, డ్రమ్ముల్లో ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు రవాణా

- చేపల చెరువులతో పాటు పందుల పెంపకానికి వినియోగం

- కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖలోని కొందరు అవినీతి అధికారుల అండదండలతో వ్యాపారం

మాంసం వ్యర్థాల రవాణాకు విజయవాడ నగరం కేంద్రంగా మారుతోంది. రామలింగేశ్వరనగర్‌ కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కొందరు అక్రమార్కులు కార్పొరేషన్‌ శానిటరీ విభాగంలోని పలువురి కనుసన్నల్లో అక్రమంగా మాంసం వ్యర్థాలను నిల్వ చేస్తున్నారు. కంటెయినర్లు, డ్రమ్ముల్లో ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని కొందరు చేపల చెరువుల యజమానులు, పందుల పెంపకం దారులు వీటిని కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/రామలింగేశ్వరనగర్‌):

విజయవాడ నగరంలోని మాంసం దుకాణాలు, క్యాటరింగ్‌, రెస్టారెంట్స్‌, హోటల్స్‌ నుంచి సేకరించిన నాన్‌వెజ్‌ ఫుడ్‌ వేస్ట్‌ను కృష్ణానదిలో భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారు. నగరంలో ఇళ్ల మధ్య నిల్వ చేస్తే వాసన వస్తుందన్న ఉద్దేశ్యంతో అక్రమార్కులు తెలివిగా కృష్ణానదిని ఎంపిక చేసుకున్నారు. రామలింగేశ్వరనగర్‌ కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో డంపింగ్‌ యార్డు, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ఉన్న చోటును ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారు. చేపల వ్యర్థాలు, నాన్‌వెజ్‌ వేస్ట్‌ ఫుడ్‌ కూడా ఇక్కడే నిల్వ చేస్తున్నారు. కంటెయినర్లు, డ్రమ్ములను పెట్టి మాంసం వ్యర్థాలు, మాంసాహార వ్యర్థాలను వేరు చేస్తున్నారు. మాంసం వ్యర్థాలు, మాంసాహార వ్యర్థాలను గుర్తు తెలియని చోట అక్రమార్కులు వేయించి (ఫ్రై) తీసుకువస్తున్నారు. వీటిని వేయించటం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇలా వేయించిన మాంసం వ్యర్థాలు, మాంసాహార వ్యర్థాలను వేర్వేరుగా కంటెయినర్లు, ప్లాస్టిక్‌ డ్రమ్ములలో నిల్వ చేస్తున్నారు. ఇలా నిల్వ చేసిన వ్యర్థాలను మ్యాక్సీ ట్రక్కులలోకి లోడింగ్‌ చేసి బయటకు తరలిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు, కృష్ణాజిల్లాలోని చేపల చెరువుల యజమానులకు ఈ వ్యర్థాలను ఎగుమతి చేస్తున్నారు. చేపలకు సాధారణ ఫీడ్‌ ఇస్తే ఆరు నెలల వరకు పెరగటానికి అవకాశం ఉండదు. అదే మాంసాహార వ్యర్థాలను ఇవ్వటం ద్వారా అవి మూడు నెలలకే ఎదిగిపోతాయి. అంటే సంవత్సరంలో రెండు సార్లు చేతికి వచ్చే చేపలు.. ఈ వ్యర్థాల వల్ల ఏడాదికి నాలుగు సార్లు దిగుబడిని ఇస్తాయి. ఈ వ్యర్థాలను తిన్న చేపలు బరువు పెరిగి త్వరగా వేటకు వస్తాయి. ఈ చేపలను తిన్న ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.

తక్కువ ధర.. త్వరగా బరువు

సాధారణ సంప్రదాయ చేపల ఫీడ్‌ కంటే కూడా 60 శాతం పైగా తక్కువ ఖర్చుకే మాంసం, మాంసాహార వ్యర్థాలు లభిస్తున్నాయి. దీంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఇది తప్పని తెలిసినా డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. కృష్ణానదిలో ఏకంగా అక్రమ వ్యాపార దందాకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరంలోని మాంసం దుకాణాల నుంచి వ్యర్థాలను అక్రమ ముఠా గ్యాంగ్‌ సేకరిస్తుంది. అలాగే నగరంలోని నాన్‌వెజ్‌ రెస్టారెంట్లు, హోటల్స్‌, భోజన శాలలకు వెళ్లి ఆహార వ్యర్థాలను సేకరిస్తారు. ఇలా ప్రతి రోజూ సేకరించిన వ్యర్థాలను డ్రమ్ములలో నిల్వ చేస్తారు. నాలుగైదు మ్యాక్సీ ట్రక్‌లలో డ్రమ్ములను ఉంచే పరిమాణం వరకు సేకరించగానే.. వాటిని రవాణా చేస్తున్నారు.

చేపలకే కాదు.. పందుల పెంపకానికి కూడా సరఫరా

రామలింగేశ్వరనగర్‌ కృష్ణానది కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై ‘ఆంధ్రజ్యోతి’ దృష్టి సారించగా.. మరో విషయం వెలుగు చూసింది. నాన్‌వెజ్‌ ఆహార వ్యర్థాలను ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలోని పందుల పెంపకందార్లకు కూడా సరఫరా చేస్తున్న విషయం తెలిసింది. సీమ, నాటు పందులను పెంచేవాళ్లు మాంసాహార వ్యర్థాలను వినియోగిస్తున్నారు. దీంతో చాలా ముందుగా పందులు కోతకు వచ్చేస్తున్నాయి. అతి తక్కువ వ్యవధిలో పందులు ఏపుగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా మాంసాహార వ్యర్థాలకు డిమాండ్‌ ఉంటోందని, ఫోన్లు చేసి మరీ నిల్వ చేసిన ఆహారాన్ని తెప్పించుకుంటున్నారని తెలిసింది.

కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖ కనుసన్నల్లోనే..

రామలింగేశ్వరనగర్‌ కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు కార్పొరేషన్‌ ప్రజారోగ్య శాఖ అధికారులకు కూడా తెలుసునని సమాచారం. తూర్పు ప్రాంతంలోని పలువురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు ఇక్కడి వ్యవహారంతో సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మాంసం వ్యర్థాలను నిల్వ ఉంచినందుకు అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నట్టు సమాచారం. క్షేత్ర స్థాయి పరిశీలన సందర్భంలో పలువురు శానిటరీ సిబ్బంది వ్యర్థాల వద్ద ఉండటం ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తోంది.

Updated Date - Jun 04 , 2025 | 01:11 AM