పంచాయతీలకు విలీన గ్రహణం!
ABN, Publish Date - Jul 31 , 2025 | 12:49 AM
గత వైసీపీ ప్రభుత్వ పెద్దల కుటిల రాజకీయానికి జిల్లాలోని 17 పంచాయతీలు బలయ్యాయి. మచిలీపట్నం, గుడివాడ పురపాలక సంఘాల్లో విలీనం ప్రతిపాదన తెచ్చి వదిలేయడంతో ఎన్నికలకు దూరమయ్యాయి. పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కోల్పోయాయి. అభివృద్ధికి నోచుకోక నాలుగేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గుతున్నాయి. విలీనం గ్రహణం ఎప్పుడు వీడుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి.
-పురపాలక సంఘాల్లో కలిపేందుకు గత ప్రభుత్వంలో ప్రతిపాదన
-ఎన్నికలకు దూరమైన జిల్లాలోని 17 పంచాయతీలు
-నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు
- గత వైసీపీ పెద్దల కుటిల రాజకీయంతో కుంటుపడిన అభివృద్ధి
- ప్రత్యేక అధికారుల పాలనలో మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలు
గత వైసీపీ ప్రభుత్వ పెద్దల కుటిల రాజకీయానికి జిల్లాలోని 17 పంచాయతీలు బలయ్యాయి. మచిలీపట్నం, గుడివాడ పురపాలక సంఘాల్లో విలీనం ప్రతిపాదన తెచ్చి వదిలేయడంతో ఎన్నికలకు దూరమయ్యాయి. పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కోల్పోయాయి. అభివృద్ధికి నోచుకోక నాలుగేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గుతున్నాయి. విలీనం గ్రహణం ఎప్పుడు వీడుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని 17 పంచాయతీలు పాలకవర్గాలు లేక త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మచిలీపట్నం నగరపాలక సంస్థ, గుడివాడ పురపాలక సంఘంలో కొన్ని పంచాయతీలను విలీనం చేసేందుకు 2020లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి పంపారు. దీని వెనుక అప్పటి వైసీపీ పెద్దలు వేసిన ఎత్తుగడలు పనిచేశాయి. అయితే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్న సమయంలోనే పురపాలక సంఘాలు, పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2021, ఫిబ్రవరిలో పంచాయతీలకు, 2021 మార్చిలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. పురపాలక సంఘాల్లో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. ఆయా పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. అయితే ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పంచాయతీల వైపు కన్నెత్తి చూడనిస్థితి నెలకొంది.
ఎన్నికలకు దూరంగా మచిలీపట్నం నియోజకవర్గంలో తొమ్మిది పంచాయతీలు
మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 34 పంచాయతీలు ఉండగా, 25 పంచాయతీలకే ఎన్నికలు నిర్వహించారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌కు చుట్టుపక్కల ఉన్న అరిసేపల్లి, పోతేపల్లి, మేకావానిపాలెం, కరగ్రహారం, చినకరగ్రహారం, గరాలదిబ్బ, రుద్రవరం, ఎస్‌ఎన్ గొల్లపాలెం, సుల్తానగరం పంచాయతీలను మచిలీపట్నం నగరపాలక సంస్థలో విలీనం చేయాలనే ప్రతిపాదన పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికలు నిర్వహించలేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సమయంలో మచిలీపట్నం మండల జెడ్పీటీసీ స్థానంతో పాటు, 20 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిలిపివేశారు.
కలిపే ప్రతిపాదనలు లేనట్లేనా!
మచిలీపట్నం మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈస్థానాలకు ఎన్నికలు నిలిచిపోవడంతో మండల పరిషతకు పాలకవర్గం లేకుండానే ఇంతకాలం గడచిపోయింది. జెడ్పీటీసీ స్థానానికి కూడా ఎన్నికలు నిలిచిపోవడంతో టీడీపీ, వైసీపీ నాయకులకు మండల స్థాయిలో పదవులు దక్కకుండా పోయాయి. దీంతో పంచాయతీలను మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో కలిపే అంశాన్ని పక్కనపెట్టి ఈ సారి జరిగే ఎన్నికల్లో 34 పంచాయతీలకు, 20 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిపే ఆలోచన చేస్తున్నట్లు కూటమి నాయకులు చెప్పుకుంటున్నారు. ఇదే అంశాన్ని మంత్రి కొల్లు రవీంద్రతో కూటమి నాయకులు ఇటీవల చర్చించి ఒప్పించినట్లు సమాచారం. దీంతో ఈసారి జరిగే స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి నాయకులు ఇప్పటి నుంచే తమ వంతుగా వ్యూహరచన చేస్తున్నారు.
విడుదల కాని 15వ ఆర్థిక సంఘం నిధులు
గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలోని కూరాడ, కౌతవరం పంచాయతీల్లోని రెండేసి వార్డులను గుడ్లవల్లేరు పంచాయతీలో విలీనం చేసి గుడ్లవల్లేరును నగర పంచాయతీగా మార్పు చేయాలనే ప్రతిపాదనను గతంలో పెట్టారు. ఈ అంశంపై కొందరు కోర్టును ఆశ్రయించారనే కారణం చూపి ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు. దీంతో గుడ్లవల్లేరు పంచాయతీకి రూ.2 కోట్లు, కౌతవరం పంచాయతీకి కోటి రూపాయలు, కూరాడ పంచాయతీకి రూ.60 లక్షలకుపైగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదు. గుడివాడ మండలంలోని లింగవరం, వలివర్తిపాడు, మల్లాయపాలెం, బొమ్ములూరు, బిళ్లపాడు, పెదపారుపూడి మండలం భూషణగుళ్ల పంచాయతీలను గుడివాడ పురపాలక సంఘంలో విలీనం చేయాలనే ప్రతిపాదన చేయడం, ఈ అంశంపై ఆయా పంచాయతీలకు చెందిన వారు కోర్టును ఆశ్రయించడంతో ఈ పంచాయతీలలోనూ ఎన్నికలు నిలిచిపోయాయి. వీటితో పాటు గుడివాడ పురపాలక సంఘం ఎన్నికలు నిలిపివేశారు. గుడివాడ పురపాలక సంఘం ప్రత్యేక అధికారి పాలనలోనే నేటికీ కొనసాగుతోంది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో ఇవి కొనసాగుతున్నాయి. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ విబాగం ఏఈలు ఈ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్నారు.
వివరాలు కోరిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీల జాబితాలను పంపాలని డీపీవో కార్యాలయ అధికారులను నెలరోజుల క్రితం ప్రభుత్వం కోరింది. పంచాయతీల్లో ఉన్న ఓటర్ల వివరాలను కూడా ప్రత్యేకంగా తయారు చేసిన ఫార్మాట్‌లో పంపాలని సూచించింది. కానీ ఈ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని డీపీవో కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, విలీన ప్రక్రియ జరుగుతుందా లేదా అనే అంశంపైనా ఇంకా స్పష్టతలేదని డీపీవో కార్యాలయ అధికారులు చెబుతున్నారు.
Updated Date - Jul 31 , 2025 | 12:49 AM